పరమాత్మ ఎలా తృప్తిపడతాడు?
పరమాత్మ ఎలా తృప్తిపడతాడు??
పూర్వపురోజుల్లో దేవాలయాలు ఆగమ శాస్త్ర ప్రకారం కట్టబడేవి. దేవాలయాల పక్కన కోనేరు లేకపోతే పెద్ద బావి, విష్ణ్వాలయం అయితే పారిజాతం చెట్టు, ఇతర ఫల వృక్షాలు, శివాలయం అయితే మారేడు చెట్టు ఉండేవి. ఆలయంలోకి రాగానే కాళ్లు కడుక్కొని శుద్ధిఅయి, ఒక బిల్వమో లేక పారిజాత పుష్పమో కోసుకొని లోపలకు పోయి దేవుడికి భక్తితో అర్పించేవారు. ఈనాటికి కూడా వారణాసిలో పండు ముసలి వాళ్లు కూడా గంగానదిలో స్నానం చేసి, చిన్న రాగి చెంబుతో నీళ్లు తీసుకొని పోయి ఆ పరమశివుడి మీద పోసి నమస్కారం చేస్తారు. కాని మనకు మాత్రం టెంకాయ కొడితే కానీ తృప్తి ఉండటం లేదు. మనం ఎంత ఘనంగా ప్రసాదాలు పంచామో అనే లెక్కలు వేస్తున్నారు. ధనికులు ఏం చేసినా చెల్లుతుంది. ఏమీలేని వాడు కూడా ఆ విధంగా చేయాలి అని అనుకోవడం అవివేకం. అందుకే అందరికీ అందుబాటులో ఉండే వాటిని నాకు అర్పించమన్నాడు పరమాత్మ. వాటికి నిర్మలమైన మనస్సు, భక్తి, జోడిస్తే, వాటిని నేను ప్రేమతో స్వీకరిస్తాను అని అన్నాడు. ఏవేవో కోరికలు కోరుకుంటూ ఈ కోరికలు ఈ దేవుడు తీరుస్తాడా, లేదా అనే సందేహంతో, మలినమైన మనస్సుతో వజ్రకిరీటాలు సమర్పించినా దేవుడు సంతోషించడు. పరిశుద్ధమైన మనసుతో చిన్ని పువ్వు, దళము కూడా స్వీకరిస్తాడు. ఇది అందరికీ తెలుసు కాని ఎవరూ చెయ్యరు.
కాబట్టి మనం ఏమి నివేదన చేసాము అనేది కాదు ముఖ్యం. దానిని నిర్మలమైన భక్తితో ఇచ్చామా లేదా అనేది ముఖ్యం. మనం చేసే పూజలలో, వ్రతాలలో, కావాల్సింది ఆర్భాటం కాదు, నిర్మలమైన మనస్సు, భగవంతుని ఎడల భక్తి. ఈ రెండింటికీ ఎటువంటి ధనం అవసరం లేదు. ఏ పూజ చేసినా, వ్రతం చేసినా, నిర్మలమైన మనస్సు, భక్తి లేకపోతే అవి వ్యర్ధము. ఇవి పూజలకు కావాల్సిన అర్హతలు.
మనం శ్రీకృష్ణతులాభారము నాటకం, సినిమా చూస్తాము. అందులో నటించిన నటీనటులు, వారు పాడిన పాటలు పద్యాల గురించి పట్టించుకుంటాము కానీ ఆ నాటకంలోని అంతరార్ధం మాత్రం గ్రహించడానికి ప్రయత్నం చేయము. అందులో శ్రీకృష్ణుని ధనముతో, బంగారముతో తూచాలని ప్రయత్నించి విఫలమైన సత్యభామది సకామభక్తి, కేవలం ఒక తులసీ దళంతో శ్రీకృష్ణుని తూచిన రుక్మిణిది నిష్కామభక్తి.
అలాగే విదురుడు తన ఇంటికి వచ్చిన కృష్ణుడికి ఆతిథ్యము ఇస్తూ, శ్రీకృష్ణుని మీద భక్తి పారవశ్యముతో అరటి పండు ఒలిచి, పండు కింద పడేసి, తొక్కలను ఆయనకు ఇచ్చాడు. వాటిని కృష్ణుడు ప్రీతితో ఆరగించాడు.
అలాగే కుచేలుడు తన చినిగిన పంచలో మూటకట్టిన పిడికెడు అటుకులను, కృష్ణుడు వెదికి తీసుకొని మరీ ఆరగించాడు. మనం వీటిని కథలుగానే చదువుతాము కానీ అంతరార్థం తెలుసుకోడానికి ప్రయత్నం చేయము. రుక్మిణి, విదురుడు, కుచేలుడు వీరి నిష్కామభక్తి, అనన్యభక్తి, నిర్మలమైన మనసు గురించి అర్థం చేసుకోము. ఇది అర్థం అయితే ఈ భగవంతుని అనుగ్రహము, మనం ఆయనకు ఏమి ఇచ్చామో అనేదాని మీద ఆధారపడి ఉండదు, ఇచ్చిన వాడి మనసు మీద ఆధారపడి ఉంటుంది అనే విషయం అర్థమవుతుంది. అతడి మనసులో నిర్మలమైన భక్తి, ఏకాగ్రమైన భక్తి, అనన్య భక్తి ఉంటే చాలు, అతడు ఏమి ఇచ్చినా పరమాత్మ ప్రీతితో స్వీకరిస్తాడు.
పరమాత్మ అనుగ్రహం పొందడానికి ధనధాన్యములు, భోగభాగ్యములు, శాస్త్ర పరిజ్ఞానము అవసరంలేదు, భక్తి, చిత్తశుద్ధి మాత్రమే అవసరం అని స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు. "చిత్తశుద్ధిలేని శివపూజలేలరా" అని వేమన గారు అన్నారు కదా! అనన్యభక్తి, చిత్తశుద్ధి ఎంతటి పేదవాడికైనా సిద్ధిస్తుంది. ఇవి బయటదొరికే వస్తువులు కాదు. ప్రతివాడి లోపల ఉండేవి. కాకపోతే వాటిని మనం సక్రమంగా వినియోగించుకోవడంలేదు. ఆర్భాటాలకు, ఆడంబరాలకు పోతున్నామే కానీ, అవసరమైన వాటి కోసం ప్రయత్నించడం లేదు. అందుకనే ప్రయతాత్మనః అని వాడారు. అంటే నిర్మలమైన మనస్సు, భక్తి, చిత్తశుద్ధి కొరకు ప్రయత్నించేవాడు అని అర్థం. అటువంటి ప్రయత్నం మనం కూడా చేయాలి. లేకపోతే మనం చేసే పూజలు, వ్రతాలు అన్నీ ఎందుకూ పనికిరాకుండా పోతాయి.
◆వెంకటేష్ పువ్వాడ.