భాను సప్తమి ఎప్పుడు...ఈ రోజు సూర్య అనుగ్రహం కోసం ఏం చేయాలంటే..!

 

భాను సప్తమి ఎప్పుడు...ఈ రోజు సూర్య అనుగ్రహం కోసం ఏం చేయాలంటే!


సూర్యుడిని ప్రత్యక్ష దైవం అని అంటారు.  సూర్య కిరణాల ద్వారానే ఈ ప్రపంచం జీవశక్తిని నింపుకుంటోంది.  సూర్యుడిని చాలా రకాల పేర్లతో పిలుస్తారు. వాటిలో భానుడు అనేది కూడా ఒక పేరు.  ఈ భానుడు అనే పేరు పురాణ గ్రంథాలలో కూడా ఉంది.  మార్గశిర మాసంలో భాను సప్తమి వస్తుంది.  భాను సప్తమి రోజు సూర్య భగవానుడిని పూజించి ఉపవానం ఉండే సంప్రదాయం ఎప్పటినుండో ఉంది. సాధారణంగా నెలలో రెండు సార్లు భాను సప్తమి వస్తుంది.  ఒకటి కృష్ణపక్షంలో,  రెండవది శుక్లపక్షంలో.. ఆదివారం రోజు సప్తమి తిథి వస్తే దానిని భాను సప్తమి లేదా సూర్య సప్తమి అని అంటారు. ఈ రోజు కొన్ని పనులు చేయడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

సూర్య భగవానుడు ఈ సృష్టికి ప్రాణ ప్రధాతగా పరిగణించబడతాడు.  శక్తికి సూర్యుడే మూలం.  సూర్యుడిని సూర్య సప్తమి రోజున ప్రధానంగా పూజిస్తారు.  భాను సప్తమి లేదా సూర్య సప్తమి రోజు సూర్యుడిని పూజించడం వల్ల జీవితంలో శ్రేయస్సు కలుగుతుందట.  జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది.  ఆరోగ్యం, ఆనందం వెల్లివిరుస్తాయి.


సాధారణంగా ఆదివారం సూర్యుడికి ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు.  చాలామంది ఆదివారం రోజు సూర్యుడికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు.  అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువగా సూర్యుడికి పూజలు నిర్వహించడం చూస్తుంటారు.  ఈ సప్తమి తిథితో కూడిన ఆదివారం రోజు సూర్య భగవానుడిని పూజించి ఆ రోజు ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. కేవలం భాను సప్తమి రోజే కాకుండా ప్రతి రోజూ ఉదయాన్నే సూర్యుడిని అర్ఘ్యం సమర్పించడం వల్ల శరీరానికి కొత్త శక్తి అందుతుందట.   అన్ని రోగాల నుండి రక్షణ లభిస్తుందట.


తెలిసి తెలియక చాలా మంది పాపాలు చేసి ఉంటారు.  అలాంటి వారు భాను సప్తమి రోజు సూర్యుడిని ఆరాధించడం వల్ల  పాపాలు నశిస్తాయని,  సూర్య భగవానుడిని పూజించినందుకు పుణ్యం చేకూరుతుందని అంటారు.

ఆదివారం రోజు సూర్యుడిని ఆరాధించి ఉపవాసం ఉంటే మనసు, శరీరం రెండూ శుద్ది అవుతాయట.  ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. తద్వారా శారీరక ఆరోగ్యం కూడా బలంగా మారుతుంది.


భాను సప్తమి రోజు సూర్యుడిని ఆరాధించడం వల్ల  దాంపత్య బంధం ఆనందంగా ఉంటుంది.  పిల్లలు కలగని వారికి పిల్లలు కలిగేనా అనుగ్రహం కలుగుతుంది.  సంతానం ఉన్నవారి జీవితంలో సంతోషం పెరుగుతుంది.

                                         *రూపశ్రీ.