ఆత్మజ్ఞానం ఎలా గుర్తిస్తారు?
ఆత్మజ్ఞానం ఎలా గుర్తిస్తారు?
మానవులు మూడు గుణములకు అంటే సత్వ, రజస్తమోగుణములకు లోబడి ప్రవర్తిస్తుంటారు. తమోగుణములో ఉన్న వారు, రజోగుణములోకి, తరువాత సత్వగుణములోకి, ఆ పైన శుద్ధ సత్వగుణములోకి చేరుకుంటారు. ఆ స్థితికి చేరుకున్న వారు మరలా రజోగుణము, తమోగుణములోకి దిగజారరు. భోగములు, విలాసములు, స్త్రీసుఖముల కొరకు ప్రయత్నించరు. మజ్జిగ చిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్న మజ్జిగలో తేలుతుందే కానీ అందులో మునిగిపోదు. అలాగే బాగా మధించి, తపస్సు చేసి, ఇంద్రియనిగ్రహము మనోనిగ్రహము అలవాటు చేసుకొని సత్వగుణము పొందిన వారు మరలా కిందికి దిగజారరు. వారు అలా ప్రవర్తించారంటే వారు ఇంకా రజోగుణము తమోగుణములోనే ఉన్నారన్నమాట.
తత్వవేత్త అయిన వాడు కూడా చూడటం, వినడం, తాకడం, వాసన చూడటం, రుచి చూడటం, శ్వాసించడం మొదలగు కర్మేంద్రియములతో చేసే అన్ని పనులు చేస్తుంటాడు. కానీ, వాడిలో అవిద్య ఉండదు. ప్రాపంచిక దృశ్యములు, విషయ వాంఛలు అతనిని ఏమీ ప్రభావితం చేయలేవు. అటువంటి వాడు బయట ప్రపంచంలో ఉన్న వస్తువులను, మనుషులను చూస్తున్నా. ఎవరితోనైనా మాట్లాడుతున్నా, లేక వారు చెప్పేది వింటున్నా, ఎవరినైనా కానీ, దేనినైనా కానీ తాకుతున్నా, వాసన చూస్తున్నా, ఏమి తింటున్నా, తాగుతున్నా, కాళ్లతో నడుస్తున్నా, నిద్రపోతున్నా, ఊపిరి తీస్తున్నా, కళ్లు తెరిచినా మూసినా, ఏదైనా వస్తువును కానీ విషయాన్ని కానీ గ్రహిస్తున్నా లేక విడిచిపెడుతున్నా. ఇంకా ఇంద్రియములతో ఏమేమి చేసినా, అవన్నీ ఇంద్రియములు తమ తమ పనులు చేస్తున్నాయి తనలో ఉన్న ఇంద్రియములు, ఇంద్రియములకు కావలసిన వాటితో ప్రవర్తిస్తున్నాయి వాటి ప్రవర్తనతో నాకు ఎటువంటి సంబంధము లేదు తాను ఏమీ చేయడం లేదు నేను కేవలం సాక్షిని మాత్రమే, ఆ పనులతో నాకు ఎలాంటి సంబంధము, సంగము లేదు అని అనుకుంటూ ఉంటాడు.
అప్పుడు అతని ఇంద్రియములకు, మనసుకు ఈ విషయ వాంఛలు అంటవు. అటువంటి వాడు ఏమి చేసినా లోకోపకారమునకే చేస్తాడు. తన స్వార్థం కోసం ఏమీ చేసుకోడు. కేవలం దేహము నిలబడటానికే పనులు చేస్తాడు కానీ తన సుఖం కోసం ఏమీ చేయడు. అతనికి ఎటువంటి కరత్వభావన ఉండదు. నేను నాది అనే భావన ఉండదు. నువ్వు నేను అనే భేదభావము ఉండదు. ఇటువంటి స్థితికి రావాలంటే ముందు నిష్కామ కర్మతో మొదలెట్టాలి. తరువాత భక్తి, ధ్యానము, సాధన, వీటి ద్వారా మనసును శుద్ధిచేసుకోవాలి. నేను వేరు, ఆత్మ వేరు, అనే విషయం అవగాహన చేసుకోవాలి. అప్పుడు అతడు ఏమి చేసినా ఆ బంధనములు అతనిని అంటవు.
అతడు తాను చేసే పనులకు కేవలము సాక్షీభూతంగా ఉంటాడు. తనలో ఉన్న ఇంద్రియములు ఇంద్రియములకు కావలసిన వాటితో ప్రవర్తిస్తున్నాయి. వాటి ప్రవర్తనతో నాకు ఎటువంటి సంబంధము లేదు అనే భావనతో ఉంటాడు. అటువంటి వాడు చేసే పనులు ధర్మబద్ధంగానే ఉంటాయి కానీ ధర్మవిరుద్ధంగా చేయడు. తాను ఆత్మజ్ఞానిని అని చెప్పుకుంటూ, ధర్మ విరుద్ధమైన పనులు చేస్తే అతనికి ఇంకా ఆత్మజ్ఞానము అలవడలేదు అని అర్థం చేసుకోవాలి.
◆ వెంకటేష్ పువ్వాడ.