స్త్రీ రూపంలో హనుమంతుడు వెలసిన ప్రాంతం.. ఎంత శక్తివంతమో తెలుసా!
హనుమంతుడు పురాణాలలో చిరంజీవులలో ప్రముఖుడు. శ్రీరామ భక్తుడిగా చెప్పుకోవడానికే ఈయన ఇష్టపడతాడు. ఆ శ్రీరామ చంద్ర ప్రభువు ముందు ఆయన శక్తులన్నీ సూక్ష్మరూపంలోకి వెళ్లిపోతాయి. హనుమంతుడిని చాలా రూపాలలో పూజిస్తారు. పంచముఖి ఆంజనేయ స్వామిని చాలా శక్తివంతంగా చెబుతారు. హనుమంతుడిని బ్రహ్మచారి అని కూడా చెబుతారు. కానీ సాక్షాత్తు ఆ హనుమంతుడే స్త్రీ రూపంలో ఉండటం ఎవరికైనా తెలుసా.. స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడు స్వయంభువు గా వెలసి పూజలందుకుంటున్న ఆలయం కూడా ఉంది. ఇంతకీ ఇదెక్కడ ఉందో.. దీని ప్రత్యేకత ఏమిటో.. దీని వెనుక కథనం ఏమిటో తెలుసుకుంటే..
ఛత్తీస్గడ్ లోని రతన్ పూర్ గ్రామంలో హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజిస్తారు. ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల కాలం కిందటిది. ఈ ఆలయం గురించి భక్తులకు చాలా విశ్వాసం ఉంది. చాలా శక్తివంతమైన ఆలయం అని భక్తులు నమ్ముతారు. ఇక్కడి స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడి దర్శనం కోసం ప్రజలు ఎక్కడెక్కడి నుండో వస్తారు. అంతేనా.. ఇక్కడి హనుమంతుడిని దర్మనం చేసుకున్న వారు తమ కోరికలు తీర్చుకునే వెనుదిరుగుతారని కూడా అంటారు.
దీని వెనుక కథనం..
పురాణాలు, చరిత్ర ఆధారంగా స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడి ఆలయాన్ని హనుమంతుడి భక్తుడైన రతన్ పూర్ రాజు ఫృథ్వీ దేవ్జు సుమారు 10వేల సంవత్సరాల కిందట ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ రాజు కుష్టువ్యాధితో బాధ పడేవాడు. దానివల్ల చాలా ఇబ్బందులు పడేవాడు. ఒకరోజు హనుమంతుడు అతనికి కలలో కనిపించాడు. హనుమంతుడు స్త్రీ రూపంలో ఉన్నాడు. హనుమంతుడు దేవత రూపాన్ని కలిగి ఉన్నాడు కానీ పెద్ద ఆకారంలో తోకను కూడా కలిగి ఉన్నాడు. చెవుల్లో చెవిపోగులు, నుదుటిపై కిరీటం ఉన్నాయి. హనుమంతుడి ఒక చేతిలో ప్లేట్ నిండా లడ్డూలు, మరో చేతిలో రామ ముద్ర ఉంది. కలలో హనుమంతుడు రాజుతో "నీ భక్తికి నేను సంతోషిస్తున్నాను. నీ బాధలు తప్పకుండా తొలగిపోతాయి." అని అన్నాడట. అంతేకాదు.. తనకు దేవాలయం నిర్మించమని రాజుతో చెప్పాడట. అలాగే గుడి వెనుక చెరువును తవ్వి అందులో స్నానం చేస్తే నీ రోగం నయమవుతుందని చెప్పుకొచ్చాడట.
కల నుండి బయటకు వచ్చిన రాజుకు హనుమంతుడు చెప్పిన మాటలే గుర్తు వచ్చాయి. వెంటనే హనుమంతుడి ఆలయ నిర్మాణం కోసం పనులు మొదలుపెట్టాడు. గుడి నిర్మాణం మొత్తం పూర్తయిన తరువాత హనుమంతుడి విగ్రహం ఎక్కడి తీసుకురావాలి అనే సందేహం రాజుకు పట్టుకుంది. అయితే ఆలయం నిర్మాణం జరిగిన తరువాత హనుమంతుడు మళ్లీ రాజు కలలో కనిపించి "నా విగ్రహం గుడి వెనుక ఉన్న మహామాయ చెరువులో ఉంది, ఆ చెరువు నుండి నా విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్టించండి" అని చెప్పాడట. హనుమంతుడు చెప్పినట్టే రాజు చెరువు నుండి విగ్రహాన్ని బయటకు తీయించగా హనుమంతుడు స్త్రీ రూపంలో ఉన్నాడు. అచ్చం తనకు కలలో అలాంటి రూపమే కనిపించడంతో రాజు ఆ విగ్రహాన్ని అలాగే దేవాలయంలో ప్రతిష్టించాడు. తదనంతరం గుడి వెనుక ఉన్న చెరువులో స్నానం చేశాడు. ఇలా చేయగా రాజుకు ఉన్న కుష్టు రోగం మాయమైంది. అప్పటి నుండి స్త్రీ రూపంలో ఉన్న హనుమంతుడు నిత్య పూజలు అందుకుంటున్నాడు. హనుమంతుడికి స్త్రీ దేవతా అలంకారం చేస్తారు. స్త్రీ దేవతా నగలు కూడా చేయించి అలంకరిస్తారు.
*రూపశ్రీ.