హనుమంతుడికి పంచ ముఖాలు ఎలా వచ్చాయి...దీని వెనుక కథ తెలుసా!

 

 

హనుమంతుడికి పంచ ముఖాలు ఎలా వచ్చాయి...దీని వెనుక కథ తెలుసా!

 

హనుమంతుడు లేదా ఆంజనేయుడు హిందూ దేవతలలో ముఖ్యుడు.  హనుమంతుడిని దేవుడు,  సప్త చిరంజీవులలో ఒకరు అని చెప్పడం కంటే రామ బంటుగానూ,  రామ భక్తుడిగానూ గుర్తిస్తేనే సంతోషిస్తాడు.  హనుమంతుడి బాల్యం,  తరువాత లంకా దహనం, హనుమంతుడి భక్తి ఇవన్నీ అందరికీ తెలిసినవే.. వీటిని వినే కొద్దీ భక్తి పారవశ్యంలోకి వెళ్లిపోతారు. సాధారణ హనుమంతుడి కంటే.. పంచముఖ హనుమంతుడికి శక్తి ఎక్కువ అని చెబుతుంటారు.  అసలు హనుమంతుడికి పంచ ముఖాలు ఎలా వచ్చాయి? నరసింహ స్వామి ముఖం ఆంజనేయస్వామిలో ఉండటం వెనుక కారణం ఏమిటి?  ఈ పంచముఖి ఆంజనేయస్వామి విశిష్టత ఏంటి? తెలుసుకుంటే..

నరసింహ స్వామి పేరులోనే ఒక ఆవేశం, ఆగ్రహం.. కనిపిస్తుంది.  శ్రీమహావిష్ణువు దశావతారాలలో నరసింహ అవతారం కూడా ఒకటి.  నరసింహ అవతారాన్ని మహావిష్ణువు రుద్ర రూపం అని కూడా అంటారు. పంచముఖ హనుమంతుడు మానవ శరీర రూపంలో.. నరసింహ స్వామి ముఖాన్ని కూడా కలిగి ఉంటాడు.  రామాయణం కాలం నాడు..  అహిరావణుడు ఉండేవాడు.  ఈ అహిరావణుడు శ్రీరాముడిని,  లక్ష్మణుడిని అపస్మారక స్థితికి చేర్చి పాతాళానికి తీసుకెళ్లిపోతాడు.  అక్కడ ఐదు దిక్కులా దీపాలు వెలిగించి రామలక్ష్మణులను బంధించాడు.  ఆ ఐదు దీపాలను  ఒకేసారి ఆర్పితే తప్ప అహిరావణ సంహారం జరగదని,  రామలక్ష్మణులను అక్కడి నుండి తీసుకెళ్లడం సాధ్యం కాదని తెలుసుకున్నాడు. ఆ ఐదు దీపాలను ఆర్పడానికి హనుమంతుడు ఐదు ముఖాలు కలిగిన రూపంలోకి మారాడట.   ఐదు ముఖాలు కలిగన రూపంలోకి మారి దీపాలను ఆర్పి,  అహిరాణవణుడిని  వధించాడు.  దీని తరువాత అహిరావణుడి నుండి రామలక్ష్మణులను విడిపించుకుని వెళ్లాడు.

పంచముఖి ఆంజనేయస్వామి ఎందకంత శక్తిమంతుడు అంటే..


పంచముఖి ఆంజనేయస్వామిలో ఐదు దేవతల శక్తి ఉంటుంది.   అందుకే ఆయన అంత శక్తివంతమైనవాడిగా పిలవబడతాడు.

ఆంజనేయ ముఖం..

ఆంజనేయ ముఖం పంచముఖి అవతారంలో మధ్యలో ఉంటుంది.  ఇది తూర్పు వైపుగా ఉంటుంది.  ఆంజనేయుడి శక్తి మొత్తం ఈ రూపంలో ఉంటుంది.


గరుడ ముఖం..


పంచముఖి ఆంజనేయ  అవతారంలో పడమర దిక్కులో గరుడుడి ముఖం ఉంటుంది. గరుడుడిని పూజిస్తే జీవితంలో బాధలు, కష్టాలు తొలగుతాయట.  పంచముఖి ఆంజనేయ స్వామిలో ఉండే గరుడుడి శక్తి ఈ సమస్యను తగ్గిస్తుందని నమ్ముతారు.


వరాహ ముఖం..


పంచముఖి ఆంజనేయ స్వామి ఉత్తర దిక్కులో వరాహ రూపం ఉంటుంది. వరాహ స్వామి ఆరాధన ద్వారా వ్యక్తి దీర్ఘాయువును పొందుతాడట.

నరసింహ ముఖం..


నరసింహ ముఖం పంచముఖి ఆంజనేయస్వామి దక్షిణ ముఖంగా ఉంటుంది. నరసింహ స్వామి ముఖంతో కూడినప్పుడు ఆంజనేయ స్వామి శక్తి మరింత పెరుగుతుంది. మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలు, జీవితంలో ఏర్పడే సమస్యలు అన్నింటి నుండి పరిష్కారం లభిస్తుంది.


అశ్వం ముఖం..

పంచముఖి ఆంజనేయ రూపంలో ఐదవ ముఖం అశ్వం. ఒక వ్యక్తి కోరుకునే కోరికలన్నీ ఈ ముఖంతో పూజించడం వల్ల త్వరగా నెరవేరుతాయట.


                                 *రూపశ్రీ.