హనుమంతుని శక్తి వంతమైన 9 రూపాల గురించి తెలుసా!

 

 

హనుమంతుని శక్తి వంతమైన 9 రూపాల గురించి తెలుసా!

 


హనుమంతుడు సప్త చిరంజీవులలో ఒకరు. ఈయనను రాముని బంటుగా కొలిస్తేనే ఎక్కువ ప్రీతి చెందుతాడు.  సాధారణంగా గ్రహాలకు అధిపతిగా పరమేశ్వరుడు లేదా శివుడిని పేర్కొంటాడు.  శివుడి అంశతో పుట్టినవాడు కావడం మూలాన హనుమంతుడుని పూజిస్తే సకల గ్రహ దోషాలు,  బాధలు తగ్గుతాయని అంటారు. అందుకే ఏ గ్రహ దోషం ఉన్నవారు అయినా మొదట హనుమంతుడిని పూజిస్తే ఉపశమనం ఉంటుంది. ఇక దుష్ట శక్తులు,  చెడు గాలులు వంటివి హనుమంతుడి నామం స్మరించేవారికి ఆమడదూరంలోనే ఉంటాయి. నిజానికి తంత్ర శాస్త్రంలో శ్రీవిద్య తెలిసిన 51మంది వీరులలో హనుమంతుడు కూడా ఉంటాడు.   ఇంత శక్తి వంతమైన హనుమంతుడి 9 రూపాల గురించి చాలామందికి తెలియదు.  అవేంటో తెలుసుకుంటే..

ప్రసన్న ఆంజనేయస్వామి..

రామాయణ యుద్దంలో కోపోద్రిక్తుడైన హనుమంతుడు ప్రసన్నాంజనేయ రూపంలో ఉంటాడట.  చేతిలో గద పట్టుకుని అభయం ఇస్తున్నట్టు వరద ముద్రలో ఉంటాడు.

వీరాంజనేయస్వామి..

హనుమంతుడు సీతాన్వేషణకు వెళ్లినప్పుడు సముద్రం దాటాల్సి వస్తుంది. జాంబవంతుడు గుర్తు చేయగా తన శక్తులను గుర్తుచేసుకుని సముద్రాన్ని దాటేటప్పుడు వీరాంజనేయ స్వామి రూపంలో ఉంటాడు.  

వింశతి భుజం..

రామాయణ యుద్దంలో ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు తన శక్తిని పెంచుకోవడానికి ఇరవై ఆయుధాలను ఉపయోగించగల రూపాన్ని తీసుకున్నాడట. దీన్నే వింశతి భుజ ఆంజనేయస్వామి రూపం అంటున్నారు.

పంచముఖి..

రామ లక్ష్మణులను అపహరించిన తరువాత హనుమంతుడు అహిరావణ,  మహిరావణులను వధించడానికి పంచముఖి ఆంజనేయస్వామి రూపం తీసుకుంటాడు.

అష్టాదశభుజ..

రామాయణ యుద్దంలో రావణుడి పక్షం నుండి వచ్చిన అనేక  మంది వీరులలో లంక సైన్యాధిపతులలో ఒకరైన అతికాయ అనే రాక్షసుడి విల్లును విరగ్గొట్టడానికి ఆంజనేయస్వామి అష్టాదశభుజ అనే రూపాన్ని తీసుకున్నాడు

సువర్చలపతి..

హనుమంతుడు లక్ష్మణుడి ప్రాణాలను కాపాడటానికి సంజీవనిని తీసుకురావడం కోసం మేరు పర్వతాన్ని చేరుకుంటాడు.  ఆ తరువాత  మేరు పర్వతంలో ఒక భాగాన్ని పెకిలించి తీసుకువస్తున్నప్పుడు సువర్చలపతి రూపాన్ని తీసుకున్నాడట.

చతుర్భుజ ఆంజనేయుడు..

లంకప్రయాణంలో కరువుతో బాధపడుతున్న సైన్యానికి ఆహారం అందించడానికి హనుమంతుడు చతుర్భుజ రూపంలో అమ్మ అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో  సైన్యం ఆకలి తీరుస్తాడట.

ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి..

రామాయణ యుద్దంల రావణుడు గ్రహయుద్దంలో గ్రహాలను ఉపయోగిస్తున్నప్పుడు  గ్రహాలు లొంగిపోయేలా చేయడం కోసం భయంకరంగా,  ఉగ్రంగా ఉన్న ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి రూపం తీసుకున్నాడట.  ఈ రూపంలో గ్రహాలను లొంగదీసుకున్నాడట.

వానరాకార ఆంజనేయస్వామి..

హనుమంతుడు వానర రూపాన్ని లంకకు వెళ్లే మార్గాన్ని వెతుకుతున్నప్పుడు ధరించాడట. హనుమంతుడు వానరుడైనా ఆయన రూపం విశిష్టం. ఇతర వానరులకు విభిన్నంగా మానుష్యరూపంలో, వానర రూపం కలిసిపోయి ఉంటుంది.


                                              *రూపశ్రీ.