మోతా మారుతి.. భారతదేశంలో ఇలాంటి విగ్రహం చాలా అరుదు.. ఇదెక్కడుందంటే..!

 

మోతా మారుతి.. భారతదేశంలో ఇలాంటి విగ్రహం చాలా అరుదు.. ఇదెక్కడుందంటే..!


హనుమంతుడు మహా బల సంపన్నుడు. బుద్ధి బలానికి, దైర్యానికి,  సకల విద్యలకు హనుమంతుడు పెట్టింది పేరు. ఆయనను వాక్య కోవిదుడు అని అంటారు. అంత గొప్ప హనుమ కూడా తాను రాముడి బంటును అని పిలిపించుకోవడానికే ఇష్టపడతాడు.  అయితే భారతదేశంలో హనుమంతునికి సంబంధించి ఎన్నో విశిష్టమైన ఆలయాలు ఉన్నాయి. కానీ మోతా మారుతి ఆలయం మాత్రం చాలా ప్రత్యేకం. ఇక్కడి హనుమంతుడి విగ్రహం చాలా విశిష్టమైనది,  భారతదేశంలో ఎంతో అరుదైనది కూడా.. అంతేకాదు.. సాక్షాత్తూ ఇక్కడి హనుమంతుడి పాదాల  వద్ద శనేశ్వరుడు ఉంటాడని కూడా చెబుతారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడి ప్రత్యేకతలు ఏంటి? తెలుసుకుంటే..

మోతా మారుతి ఆలయం..

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా, లోనార్  పట్టణంలో మోతా మారుతి హనుమాన్ ఆలయం ఉంది.  ఈ ఆలయం చాలా పురాతనమైనది.  ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవులతో కూడి ఉండేది. హనుమంతుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడనే పురాణ కథనం ఉంది.  అందుకే ఇక్కడ హనుమంతుడు శయన రూపంలో దర్శనం ఇస్తాడు.

శయన విగ్రహ ప్రత్యేకత..

సాధారణంగా హనుమంతుడు ఏ ఆలయంలో అయినా వీరాసనం లేదా ధ్యాన ముద్రలో లేదా నిలబడి ఉన్నట్టు దర్శనం ఇస్తుంటాడు. కానీ ఈ ఆలయంలో మాత్రం నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటున్నట్టు శయన రూపంలో దర్శనం ఇస్తాడు.

మోతా మారుతి శయన విగ్రహం కూడా అయస్కాంత లక్షణాలు ఉన్న శిలతో తయారైందని స్థానికుల విశ్వాసం.  దీనికి తగ్గట్టే ఒకప్పుడు ఈ విగ్రహం ఇనుప వస్తువులను విపరీతంగా ఆకర్షించేదట.  దీన్నిస్థానికులు కథలుగా చెబుతారు. పైగా ఈ శయన విగ్రహం కూడా చాలా భారీ పరిమాణంలో ఉంటుందట.  అందుకే దీన్నిమోతా..అంటే పెద్ద పరిమాణం కలిగిన మారుతి ఆలయం గా చెబుతారు.

శనిదేవుడి నమ్మకం..

సాధారణంగా శనిదేవుడు హనుమకు కట్టుబడి ఉంటాడని చెబుతారు. పురాణాలలో దీనికి సంబంధించిన ఎన్నో కథలు కూడా ఉన్నాయి.  హనుమంతుడిని ఆరాధించే వారికి శని ప్రబావం ఉండదని కూడా చెబుతారు.  ఇక్కడ మోతా మారుతి ఆలయంలో హనుమ శయన విగ్రహం పాదాల దగ్గర శనిదేవుడు సేవకుడిగా ఉంటాడని చెబుతారు. పురాణాలలో దీని గురించి ఎలాంటి ఆధారాలు లేకపోయినా స్థానిక భక్తులు,  ప్రజలు చెబుతారు.

మోతా మారుతి ఆలయంలో హనుమంతుడిని దర్సిస్తే..  ఏలినాటి శని,  శని దోషాలు,  అర్ధాష్టమ శని వంటి దోషాలు తొలగిపోతాయని చెబుతారు.  

                                            *రూపశ్రీ.