అష్టాదశ భుజాంజనేయ అవతారం
అష్టాదశ భుజాంజనేయ అవతారం
ఈ అవతారంలో ఆంజనేయునికి పద్దెనిమిది చేతులు, పద్దెనిమిది ఆయుధాలుంటాయి. స్వామి, తన పద్దెనిమిది చేతులతో శక్తి, పాశం, ఈటె, గొడ్డలి, నాగలి, చిల్లకొల్ల, డోలు, శంఖము, చక్రం, త్రిశూలం, రోకలి, గద, కత్తి, ఇనుపకర్ర, ధనుస్సు, చర్మం, పద్మం, ఖడ్గం అనే పద్దెనిమిది ఆయుధాలను ధరించి దర్శనమిస్తూంటాడు. ఈ స్వామిని దుర్వాసమహర్షి పూజించి, స్వామి కృపకు పాత్రుడై, ఆ స్వామి దివ్యదర్శనాన్ని పొందేడట. అష్టాదశ భుజాంజనేయ స్వామివారి మహిమ సుదంతుని కథ ద్వారా తెలుస్తోంది.
పూర్వం రేవానదీ తీరంలోనున్న గాంధర్వపట్టణంలో సుదంతుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు కామక్రోధాది అరిషడ్వర్గాలను జయించిన జితేంద్రియుడు. అయినప్పటికీ అతని జీవితం కడు దుర్భలంగా ఉండడంతో, అనేక మంది రాజులను ఆశ్రయించి యాచిస్తుండేవాడు. అయినా ఎటువంటి ఫలితం కనిపించలేదు. అనంతరం పల్లెపల్లెకూ, గ్రామగ్రామానికీ తిరిగాడు. ఎంతగా యాచించినప్పటికీ ఫలితం లేకపోవడంతో, తన దుస్థితికి తననే నిందించుకుంటూ, కంటపడిన వారందరినీ కూడా తిడుతుండేవాడు. కొంతమంది అనవసరంగా తమను తిడుతున్నందుకు, అతడిని వెంటబడి కొట్టేవారు. మరికొంతమంది అతడిని పిచ్చివానిగా జమకట్టి రాళ్ళతో కొడుతుండేవారు. పోనీ ఏదైనా పని చేసుకుంటూ బ్రతుకీడ్చుదామంటే అతని ఏపని చేపట్టినప్పటికీ నిష్ఫలమవుతుండేది. అలా ఆకలి దప్పులతో అల్లాడుతున్న సుదంతుడు, చివరికెలాగో భరద్వాజ ఆశ్రమానికి చేరుకున్నాడు.
అతను భరద్వాజాశ్రమానికి చేరుకునేసరికి మధ్యాహ్న సమయమైంది. అక్కడ అతిథులకు గౌరవ మర్యాదలు జరుగుతున్నాయి. దురదృష్టవంతునకి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కష్టాలే ఎదురవుతాయన్నట్లు, సుదంతునికి భరద్వాజ ఆశ్రమంలో స్వాగతం లభించలేదు. అతన్ని చూడగానే భరద్వాజ మహర్షి 'వెళ్ళిపోమంటూ కసిరాడు. అప్పడు సుదంతుడు, భరద్వాజ మహర్షితో "మునిశ్రేష్ఠా! ఆకలి బాధను తట్టుకోలేక నేను పిచ్చిపట్టినట్లు తిరుగుతున్నాను. ఎంతమందిని ఎంతగా వేడుకుంటున్నప్పటికీ, నా ఆకలి తీరేందుకై ఎవరూ పట్టెడన్నం పెట్టడం లేదు. నా దురదృష్టం కాకపోతే, ఎన్నో వేలమందికి ఆతిథ్యమిస్తున్న మీరు కూడనన్ను గెంటేస్తున్నారు. నాకు మాత్రమే ఎందుకిలా జరుగుతోంది? నేను కూడ వేదశాస్త్రాలను చక్కగానే అభ్యసించాను.
సంసారతాపత్రయ వలయంలోపడి దేశాటన చేస్తూ నిరర్థకంగా తిరుగుతున్నానే తప్ప, మీవంటి ముని శ్రేష్ఠులను సేవించి జ్ఞానార్జనం చేయలేకపోతున్నాను. నేనేం పాపం చేశానని నాకీ శిక్ష? నాదుష్కృతికి నిష్కృతికి ఏమిటి? పోయిన జన్మలో ఏం పాపం చేయడం వలన నాకీ గతి పట్టింది? మహాత్మా! మీరు మహాతప్పస్సంపన్నులు. జ్ఞానులు మీ జ్ఞాన దృష్టితో, నా ఈ పతనావస్థకైన కారణాన్ని చెప్పండి మీ పాదాలకు ప్రణమిల్లుతున్నాను. నాకు జ్ఞాన భిక్షపెట్టండి. జ్ఞానధనా! నా దీన చరిత్రను ఆలకించి, అందుకు తగిన తరుణోపాయాన్ని సెలవ్వివ్వండి" అని పరిపరివిధాలుగా ప్రార్థించాడు. సుదంతుని దీనగాథను విన్న భరద్వాజ మహర్షి క్షణకాలం ఆలోచించి, జ్ఞానదృష్టితో అతని పూర్వ జన్మవృత్తాంతాన్నంతా తెలుసుకున్నాడు.