సిందూర ప్రియుడు ఆంజనేయుడు

 

సిందూర ప్రియుడు ఆంజనేయుడు

వైశాఖమాసం బహుళదశమి మధ్యాహ్న సమయము 'వైధృతీయోగమున' రుద్ర స్వరూపుడు, స్వామిభక్తి పరాయణుడు, నిగ్రహాను గ్రహ సమర్థుడు, రామాయణ మహామాలకు నాయక మణిరత్నము వంటివాడు అయిన ఆంజనేయుడు జన్మించిన పవిత్ర పుణ్య పర్వదినమే 'హనుమజ్జయంతి' సువిశాల భారతదేశంలో 'హనుమత్ మూర్తి' లేని గ్రామమే లేదు. అటువంటి స్వామి మనకు ప్రసన్నాంజనేయుడుగా, దాసాంజనేయుడుగా, వీరాంజనేయుడుగా, సీతారామలక్ష్మణ, భరతశత్రుఘ్ను సమేతుడుగా ఇలా పలురూపాలలో దర్శనమిస్తాడు. ఈ విధంగా స్వామి వెలసియున్న ప్రతిచోట, ఆయన విగ్రహ ఆకారాన్ని కనుక పరిశీలిస్తే శరీరము నిండా ఆపాదమస్తకము 'సిందూరపు పూత' తో దర్శనమివ్వడం విశేషం. దీని వెనుక ఒక కథ ఉంది.

హనుమ సిందూర పూత కథ
ఒకమారు ఆంజనేయుడు నిత్యకృత్త్యాలైన పనులు చేసుకుంటూ శ్రమపడినవాడై, మంచి ఆకలితో తన స్వామి అర్థాంగియైన సీతామాతను భోజనము వడ్డించమని అడిగాడు. అప్పుడే స్నానాధికాలు ముగించుకొన్న జానకీదేవీ 'హనుమా! కొద్దిసేపు ఆగు. మొదట పాపిటలో సిందూరము ఉంచుకుని తరువాత వడ్డిస్తాను' అని అన్నది. అప్పుడు హనుమంతుడు 'అమ్మా ! పాపిటలో సిందూరం ఎందుకమ్మా' అని ప్రశ్నించాడు. "దీనిని నేను నీ ప్రభువు కళ్యాణ నిమిత్తమై పాపిట పెట్టుకొంటున్నాను సింధూరము సౌభాగ్య వృద్ధిని కలిగిస్తుంది. దీనిని ధరించిన వారి  భర్తలు చిరాయువులై వర్థిల్లుతారు" అని సీతమ్మ జవాబు చెప్పింది.

ఈ మాటవిన్న హనుమంతుడు అక్కడ నుండి వెళ్ళిపోయి కొద్దిసేపు తర్వాత తిరిగి వచ్చాడు ఆయన నఖశిఖ పర్యంతము సింధూరము పూసుకొని ఉన్నాడు. సీతమ్మ ఆశ్చర్యపడి 'హనుమా ! శరీరమంతా సింధూరం ఎలా పూసుకొన్నావు ?' అని అడిగింది. అంత మారుతి వినమ్రుడై 'సిందూరము ధరిస్తే స్వామికి కళ్యాణ ప్రదమై ఉంటుందని నీవే అన్నావుగదా అమ్మా! నా ప్రభువు ఎల్లప్పుడు కళ్యాణప్రదంగా ఉండాలని నేను సిందూరము పూసుకొన్నానని' సమాధానం ఇచ్చాడు.

హనుమంతుని సమాధానం విన్న సీత ఆనందపరవశ నేత్రాలతో, అతని ప్రభు భక్తికి సంతోషంతో హృదయ పూర్వకంగా ఆశీర్వదించింది. ఆంజనేయుని ప్రభుభక్తి పరాయణతకు ఇది నిలువెత్తు నిదర్శనము. ఈ కథ రామాయణంలో కనబడదు గానీ, భక్తుల గాథల్లో ప్రసిద్ధి పొందింది.

సిందూర పూతతో గ్రహశాంతి
పావనికి పరమ ప్రీతికరమైన సిందూరంతో పూజించుట వలన సకల గ్రహదోషాలు తొలగిపోతాయి. ఇంకను విపరీతమైన కష్టాలు, దరిద్రము తొలగిపోతుంది. ఆంజనేయస్వామి ఉపాసన వల్ల జాతకంలోని దోషాలు కూడా చాలా వరకు తొలగిపోతాయి. మంగళ, శనివారములు 'మారుతి' కి పరమప్రీతికరమైన దినములు. విశేషించి కుజ దోషం గల ఆడపిల్లలు, వివాహంకాని వారు, భర్తచే అనాదరణకు గురైన స్త్రీలు, భర్తతో తగవు, ఎడబాటు కలవారు తమలపాకులతో హనుమంతుని పూజించి, అప్నాలు నివేదించి 'సిందూరం' నొసట ధరించడం వల్ల మేలు కలుగుతుంది.

శనిదోషం కలవారు శనివారం నాడు ఆంజనేయుని ప్రార్థించి, వేయించిన శనగ గుగ్గిళ్ళు నివేదించడం వల్ల దోషం తొలుగుతుంది. పసిపిల్లలకు అనారోగ్య సమస్యలు కలిగినా, నిద్రలో భయపడి త్రుళ్ళినా, ఆంజనేయ మంత్రం జపించి నుదట విభూతిని గాని, 'సిందూరమును' గాని పెట్టినచో క్షణంలో బాగవుతుంది.

విద్యార్థులు 'హనుమాన్ చాలీసా' పారాయణ చేయుట వలన జ్ఞాపకశక్తిని పొంది చదువు బాగా వస్తుంది. అలాగే ఉద్యోగులు సైతము 'చాలీసా' పారాయణ చేయుట సర్వవిధాలా ఉత్తమము. ఈ విధంగా 'హనుమంతుని' ఆరాధించి ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చు.