రాముడు గొప్పవాడా ? రామనామం గొప్పదా ?

 

రాముడు గొప్పవాడా ? రామనామం గొప్పదా ?

సకల లోకంలో ఆదర్శగుణాలు రాశిగా పోస్తే మనకు కనిపించే దేవుడు రాముడు. రాముడు గొప్పవాడా? రామ నామం గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పదని చెప్పే కథలు చాలా ఉన్నాయి.


లంకానగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారథిని నిర్మిస్తూ ఉంది. రాయిపై 'రామ' అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తె అది తేలిపోతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి 'నా పేరు రాసిన రాయి తేలుతూ వుంది కదా, నేనే రాయి వేస్తే' అనే ఆలోచన కలిగింది.దాంతో శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి విసిరాడు. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. అది చూసిన రాముడు  ఆశ్చర్యానికి లోనై పక్కనే వున్న హనుమంతుడికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడు . అందుకు "రామ" అనే నామం రాసిన రాళ్ళే పైకితేలుతాయి. మీరు వేసిన రాయిపైన రామనామం లేదు కదా! అందుకే మునిగిపోయింది" అని హనుమంతుడు సమాధానం చెప్పాడు. అంటే రాముడి కంటే కూడా రామనామం ఎంత బలమైందో కదా!

రామాయణం కంటే బలమైన రామనామం
రావణాసురుని చంపిన తర్వాత అయోధ్యానగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేపట్టాక, అయోధ్యానగరంలో రామసభ కొలువుదీరి వున్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు. మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు. కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి వుండటం వల్ల విశ్వామిత్రుడి రాకను గమనించక నిలబడలేదు, నమస్కరించలేదు. దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో "రామా ! నీ సేవకుడు నన్ను అవమానించాడు. నీవు అతడిని శిక్షించు" అని రాముడిని ఆదేశించాడు.

విశ్వామిత్రుడి మాటను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుడిని శిక్షించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు 'రామ' నామాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు. 'రామ' నామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుడిని రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి. అలసిపోయిన శ్రీరాముడు పట్టుదల అధికంకాగా చివరకు బ్రహ్మస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగా నారదమహర్షి అక్కడకు చేరుకుని "మహర్షీ! హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించక నమస్కరించనంత మాత్రమున మీరు మరణదండన విధించమనాలా? 'రామ' నామ జపం హనుమంతుడిని రామ బాణాల నుంచి రక్షిస్తూ వుంది. ఇప్పటికైనా మీ ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకుని ఆజ్ఞను ఉపసంహరించండి" అని విశ్వామిత్రుడితో చెప్పాడు.

ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు. దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని అర్థమయింది. యుగయుగాలకు సర్వలోకాలను తరింపజేసిన మహిమాన్వితమైన నామం 'రామనామం.'

'రామత్తత్వో అధికం నామ
మితి మాన్యా మహేవయమ్
త్వయై కాతౌతారి తయోధ్యా
నామ్నుతు భువన త్రయమ్' 

అని స్వయంగా రామభక్తుడైన హనుమంతుడు పేర్కొన్నాడు. అంటే శ్రీరాముడి చేత అయోధ్య తరింపబడింది. రామనామం చేత మూడు లోకాలు తరించాయని అర్థం. 

'ఓం నమో నారాయణాయ' అనే అష్టాక్షరి మంత్రంలోని 'రా' అనే ఐదవ అక్షరం ' ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీ మంత్రంలోని 'మ' అనే రెండవ అక్షరం కలిస్తే ' రామ' అనే నామం అయింది. అంటే హరిహరతత్త్వాలు రెండింటిని ఇముడ్చుకున్న నామం రామనాయం!

'రామ' అనే పదాన్ని గమనిస్తే ర, అ, మ లు కలిస్తే 'రామ' అవుతుంది.'ర' అంటే అగ్ని. 'ఆ' అంటే సూర్యుడు, 'మ' అంటే చంద్రుడు అని అర్థం. అంటే 'రామ' అనే పథంలో విశ్వాసానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయని చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా 'రామ' అనే నామంలోని 'రా' అనే అక్షరం భక్తులను సంసారసాగరం నుంచి రక్షిస్తుందనీ 'మ' అనే అక్షరం భక్తుల మనోరథాలను నెరవేరుస్తుందని మహర్షులు పేర్కొనగా 'రామ' అనే పదంలోని 'రా' అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయనీ, 'మ' అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోనికి ప్రవేశించవని చెప్పబడుతుంది. అందువల్ల త్రిమూర్తులలో లయకారుడైన పరమశివుడు

'శ్రీరామ రామరామేతి రమే రామ మనోరమే
సహస్త్రనాయ తత్తుల్యం రామనామ వరాననే' అని పేర్కొన్నారు.

'రామ రామ రామ' అని మూడుసార్లు నామ జపం చేస్తే శ్రీవిష్ణుసహస్రనామం చేసినంత ఫలం లభిస్తుందట. అటువంటి మహిమాన్వితమైన రామనామ గొప్పదనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తాయి.

వాల్మీకిని కిరాతకుడిని చేసిన రామనామం
వాల్మీకి మహర్షి జీవితమే రామనామ మహిమకు చక్కని నిదర్శనం. నిజానికి ఆయన కిరాతకుడు. మహర్షులు చెప్పినట్లుగా 'మరా' అనే మాటను జపం చేస్తూ కొంతకాలానికి 'మరా' అనే పదం 'రామ' గా మారింది. ఆయనపై వల్మీకం (పుట్ట) పెరిగింది. చివరకు నారదమహర్షి ఉపదేశంతో వెలికి వచ్చి రామనామ గొప్పదనాన్ని తెలుసుకొని 'వాల్మీకి' ఆయి రామాయణాన్ని మనకు అందించాడు. రాముడికంటే రామనామం గొప్పది.

శనిబాధాలు చేరనివ్వని రామనామం
పూర్వం ఒకసారి శనేశ్వరుడు ఎలాగైనా హనుమంతుడిని ఆవహించి కష్టాలపాలు చేయాలని భావించి హనుమంతుడి వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ వున్నాడు. హనుమంతుడిని సమీపించి శనేశ్వరుడు తన మనస్సులోని కోరికను చెప్పగా "నేను ప్రస్తుతం రామనామజపంలో మునిగివున్నాను. రామనామ జపం ముగిసిన తర్వాత నీవు నన్ను ఆవహించు" అని సమాధానం ఇచ్చాడు. అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షించసాగాడు. రామనామజపాన్ని హనుమంతుడు ఎప్పుడు మిగిస్తాడా అని శనిదేవుడు ఆతృతగా ఎదురుచూడసాగాడు. గుండెల నిండుగా సీతారాములనే నింపుకున్న హనుమంతుడు రామనామం ఆపేదెన్నడు? చివరకు నిరీక్షించి విసుగు చెందిన శనిదేవుడు రామనామం జపించేవారి దరిచేరడం కష్టమని తెలుసుకుని వెనక్కు వెళ్ళిపోయాడు. అంటే శనీశ్వరుడి దరి చేరనీయని శక్తివంతమైన నామం 'రామనామం' కాబట్టి 'రామ' నామాన్ని జపించే వారి శనిబాధలతో పాటు ఎటువంటి గ్రహబాధలు వుండవని చెప్పబడుతుంది.

హనుమంతుని రక్షగా ఉంచే రామనామం
'యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలి
బాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతీం సమత రాక్షసాంతకం'

అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూ వుంటుందో అక్కడ కళ్ళునిండా ఆనందబాష్పాలు నింపుకుని తలవంచి నమస్కరిస్తూ నిలబడి వుంటారట రాక్షసులను దోమలలాగా నలిపి నశింపజేసే రామభక్తుడైన హనుమంతుడు. దీనిని బట్టి రామనామాన్ని జపించడం వల్ల హనుమంతుడు ఎప్పుడూ ప్రక్కనే వుంటాడు. మనలను రక్షిస్తూ వుంటాడు. అనగా రామనామ జపం కేవలం 'రాముడి కృపనే కాకుండా హనుమంతుడి కృపను కూడా ప్రసాదింపజేస్తుంది.

రామనామ సంకీర్తన
శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము
రామనామము రామ నామము రామ నామము రామ నామము
శ్రీమదఖిల రహస్తమంత్ర విశేషధామము శ్రీరామనామము
దారినొంటిగ నడుచువారికి తోడు నీడే శ్రీరామనామము...

ఇలా ప్రారంభమై సాగే రామనామసంకీర్తనను ప్రతిరోజూ 'ఉభయ' సంధ్యలలో పఠించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఎటువంటి సమస్యలైనా గట్టెక్కే ధైర్యం కలుగుతుంది. అంతేకాకుండా అనేకసార్లు విష్ణు సహస్త్ర నామ పారాయణం చేసిన ఫలం లభిస్తుంది. దీనిని ప్రతి ఒక్కరూ  చేయవచ్చు. వీలున్నవారు సామూహికంగా కూడా చేయడం మంచిది.

నామమంత్రం
'శ్రీరామ జయ రామ జయ జయ రామ' అనేది పదమూడు అక్షరాల నామ మంత్రం. దీనిని పఠించడం వల్ల కూడా విశేషమైన పుణ్యఫలాలు కలుగుతాయి. సమర్థరామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్లు జపించి శ్రీరాముడి ప్రత్యక్ష దర్శనాన్ని పొందినట్లు పురాణకథనం. వీలున్నప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ వుండడం శ్రీరామరక్ష.

రామకోటి
చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం
ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం
అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. 'రామకోటి' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమినాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు. రాసేవారు కొన్ని నియమాలను పాటిస్తే శ్రీరాముడి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.