Mother Tongue is more important
Mother Language Day Special
తెలుగు రాదని చెప్పడం ఆధునికత కాదు...
Mother Tongue is more important
ఫిబ్రవరి 21వ తేదీ ప్రపంచ మాతృభాషా(World mother tongue Day) దినోత్సవం. యునెస్కో ఈరోజును ''అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'' (International Mother Language Day)గా గుర్తించింది. ఎవరికి వారు తమ మాతృభాష అవసరాన్ని, ప్రాధాన్యతను తెలుసుకుని, గుర్తించి, గౌరవించాలనేదే ఈ ఉత్సవాన్ని జరుపుకోవడంలోని ఉద్దేశం, ఆంతర్యం, ఆవశ్యకత.
ఏ ఇద్దరు తమిళులు, బెంగాలీలు, మలయాళీలు కలిసినా తమ భాషలో హాయిగా, ఆనందంగా మాట్లాడుకుంటారు. కానీ ఇద్దరు తెలుగువాళ్ళు కలిస్తే మాత్రం ఇంగ్లీషో, హిందీనో మాట్లాడ్డం ఆనవాయితీ. మనలో చాలామందికి మన భాష గొప్పతనం ఏమిటో తెలీకపోవడం దురదృష్టం. ఈరోజుల్లో ఇంగ్లీషు రాకపోతే చాలా కష్టం, నిజమే! చదువు, ఉద్యోగం, ఇతర అవసరాలన్నీ ఆంగ్లంతోనే ముడిపడి ఉన్నాయి. దాన్నెవరూ కాదనలేరు. ఎక్కువ ప్రజలు మాట్లాడే ఇంగ్లీషు, హిందీ లాంటి భాషలు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. అప్పుడే జీవనం సాఫీగా సాగుతుంది. అభివృద్ధి సాధ్యమౌతుంది. అంతా నిజమే కానీ మన సొంత భాష ప్రాముఖ్యతను మాత్రం మర్చిపోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు.
మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి మాతృభాషను మించిన సాధనం ఇంకోటి లేదు. మాతృభాషను గానీ అందులోని వ్యాకరణాన్ని గానీ పనిమాలా ఎవరూ నేర్పనవసరం లేదు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు మాట్లాడుతోంటే దానంతటదే వచ్చేస్తుంది. చేపలకు ఈత, పక్షులకు ఎగరడం నేర్పాలా? శిక్షణ ఇవ్వాలా? సొంత భాష కూడా అలా సహజంగా అబ్బుతుంది. అందుకే ప్రాధమిక విద్య మాతృభాషలో నేర్పాలి అని ఎందరో మేధావులు హితవు చెప్తుంటారు. మనకూ ఆ సంగతి తెలుసు. నేర్చుకునే విషయం ఎటూ కొత్తది.. కనీసం నేర్పే మాధ్యమం అయినా పరిచయమైంది అయితే పిల్లలకు మరింత జటిలం కాకుండా ఉంటుంది. కానీ ఈ నిజానిజాలు తెలిసినా మనం లేనిపోని భయాలు, భేషజాలకు పోయి మాతృభాషను అశ్రద్ధ చేస్తున్నాం. ఓనమాలు దగ్గరనుంచి ఉన్నత విద్యల వరకూ ఆంగ్ల మాధ్యమంలోనే చదివిస్తున్నాం.
ఈ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకసారి మన తెలుగు భాష ఎంత అందమైందో, మహోన్నతమైందో గుర్తుచేసుకుందాం. తెలుగు మాట్లాడుతోంటే సంగీతం వింటున్నట్లు మధురంగా, ఆహ్లాదంగా, వీనులవిందుగా ఉంటుందని ఇతర భాషావేత్తలు కూడా అంటారు. సంస్కృత పదాలెన్నో కలిసిన తెలుగు వస్తే సంస్కృత శ్లోకాలు సైతం సునాయాసంగా అర్ధమౌతాయి. అందుకే, ''దేశ భాషలందు తెలుగు లెస్స'' అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. దాన్ని అపహాస్యం చేస్తూ ''దేశ భాషలందు తెలుగు లెస్సు'' అంటున్నారు కొందరు. ఇంతకంటే విషాదం ఉందా?! సి.పి. బ్రౌన్ (చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్) లాంటి మహా మేధావి తెలుగు గొప్పతనాన్ని అర్ధం చేసుకుని మనకో మహత్తరమైన నిఘంటువు తయారుచేశాడు. అత్యధిక అక్షరాలు ఉన్న భాష మనదే. ఎలాంటి ఉచ్చారణనయినా రాయడానికి వీలైన భాష మనది. ఇతర భాషల్లో అలాంటి సౌకర్యం, సౌలభ్యం లేదు. అన్నిటినీ మించి తెలుగులో రామాయణ, భారత, భాగవతాల దగ్గరనుంచి నవలలు, కథలు, కవితల వరకూ అపార సాహిత్యం ఉంది. ముఖ్యంగా పరవస్తు చిన్నయసూరి లాంటి మహానుభావులు అపూర్వ నీతికథలతో మన వాగ్మయాన్ని సుసంపన్నం చేశారు.
ప్రపంచం సువిశాలమైంది. ఇతర దేశాలు చూడాలి. వివిధ సంస్కృతుల గురించి తెలుసుకోవాలి. ఎందరితోనో మైత్రీబంధం పెంచుకోవాలి. అవసరమైన భాషలు నేర్చుకోవాలి. ఎక్కడ మంచి ఉన్నా నేర్చుకోవాలి. ఇతర భాషల్లో ఉన్న పదాలను మన భాషలో అర్ధవంతంగా కలుపుకోవాలి. అంతా నిజమే. కానీ ఎంత ఎదిగినా కన్నతల్లిని, మాతృభూమిని మర్చిపోకూడదు. అశ్రద్ధ చేయకూడదు. కన్నతల్లి అంత అపురూపమైంది కనుకనే స్వభాషను ''మాతృభాష'', ''mother language'' / ''mother tongue'' అన్నారు. తెలుగు రాదని చెప్పడం ఆధునికత కాదు, అల్పత్వం అనిపించుకుంటుంది. మన భాషను అశ్రద్ధ చేయొద్దు. వీలైనప్పుడల్లా తెలుగు మాట్లాడండి. మన సంస్కృతీ సంప్రదాయాలను తెలియజేసే ఇతిహాసాలు, కావ్యాలు, ఇతర సాహిత్యమూ చదవండి. పిల్లలతో చదివించండి.
మీ అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు!
International Mother Language Day, world mother tongue day, mother language day february 21, awareness of mother tongue, promotion and celebration of mother language