Read more!

మాట విలువ గురించి ఆకట్టుకునే విశ్లేషణ!

 

మాట విలువ గురించి ఆకట్టుకునే విశ్లేషణ!

మనుషులకు దేవుడిచ్చిన అత్యద్భుతమైన వరం మాట. మనసులో చెలరేగే భావాలను వ్యక్తపరచేందుకు ఉపయోగపడుతుంది మాట. తన మనసులో కలిగిన భావాలను కప్పిపుచ్చుకుంటూ, ఎదుటి వ్యక్తిని తప్పు దారి పట్టించేందుకు ఉపయోగపడేదీ మాటనే. ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేసి, తన అదుపులోకి తెచ్చుకునేందుకు అవసరమయ్యేది మాటనే. మాట వల్ల ఎదుటి వ్యక్తి కంట నీరు తెప్పించవచ్చు, కంట అగ్నిని పొంగించవచ్చు. అందుకే మాటను పదునైన ఆయుధంతో పోలుస్తారు. మాటతో మనిషి ప్రేమ పొందవచ్చు. మాటతో ద్వేషాన్ని కొని తెచ్చుకోవచ్చు. మాటతో మనిషిలోని సున్నితభావనలు జాగృతం చేయవచ్చు. మాటతో మనిషిని పశువులా మార్చవచ్చు.

 కాబట్టి మానవ జీవితంలో మాట అత్యంత ప్రధాన పాత్ర వహిస్తుందని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే మిటంటే నిత్యజీవితంలో 'మాట' వాడకం గురించి.

మొత్తం రామాయణం, దశరథుడు కైకేయికి ఇచ్చిన 'మాట'పై ఆధారపడి ఉంది. ఈ కథ మనకు 'మాట' ఇచ్చేటప్పుడు పాటించాల్సిన విచక్షణను స్పష్టం చేస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం మన ధర్మం. కాబట్టి మాట ఇచ్చేటప్పుడే ముందు వెనుక తప్పనిసరిగా ఆలోచించాల్సి ఉంటుంది. మహాభారతంలో సైతం 'మాట' ప్రాధాన్యం అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. 

తల్లికి ఇచ్చిన 'మాట' ప్రకారం, అర్జునుణ్ని తప్ప మిగతా పాండవులను హతమార్చగలిగిన అవకాశం ఉండి కూడా వదిలేస్తాడు కర్ణుడు. అలాగే ద్రోణాచార్యుడి 'మాట'కు కోపగించి అతని మరణం వరకూ యుద్ధంలో పాల్గొనడు కర్ణుడు. 'సూతపుత్రు'డన్న మాట, కర్ణుడి నిర్ణయాలపై ఎంతో ప్రభావం చూపించింది. అలాగే అందరూ అవమానిస్తున్న సమయంలో తనను గౌరవించిన దుర్యోధనుడి వైపు కర్ణుడు మళ్ళటం కూడా, దుర్యోధనుడి మాటల వల్లనే. ఇలా మన పురాణాల్లో అడుగడుగునా మాటల ప్రాధాన్యాన్ని స్పష్టం చేసే సంఘటనలు, కథలు కోకొల్లలు. ఇవన్నీ మనుషులు తమ జీవితంలో మాటను ఎలా ఉపయోగించాలి?? మాటదగ్గర ఎలా ఉండాలి?? అనే విషయాన్ని స్పష్టం చేస్తాయి.

అందుకే సావిత్ర్యుపాఖ్యానంలో ఎఱ్ఱన్న సావిత్రి పాత్రతో ఇలా అనిపించాడు.

ఏడు మాట లాడిన యంత నెట్టివారు నార్యజనులకు జుట్టంబు లగుదు రనినఁ జిరసమాలాపసంసిద్ధి జేసి నీకు నేను జుట్టమనియు వేఱ యేల చెప్ప.

సావిత్రి యముడితో అన్న ఈ మాటలు ప్రతి ఒక్కరికి మార్గదర్శనం చేస్తాయి. ఎదుటివాడు మనకు వ్యతిరేకంగా ఉన్నా, మాట నేర్పుతో ముందరి కాళ్ళ బంధం వేసి పనులు సాధించే నేర్పరితనాన్ని నేర్పుతాయి.

సావిత్రి కథ అందరికీ తెలుసు. తన భర్త ప్రాణాన్ని కొనిపోతున్న యముడిని మాటలతో బోల్తా కొట్టించి మరీ పని సాధించింది. యముడు తన కర్తవ్యం నిర్వహిస్తున్నాడు. కానీ అందువల్ల తనకు నష్టం కలుగుతోంది. పైగా తీసుకున్న ప్రాణాన్ని తిరిగి ఇవ్వటం యమధర్మం కాదు. కానీ సావిత్రికి ఆమె భర్త ప్రాణం కావాలి. అంటే యముడితో అధర్మమైన పని చేయించాలి. ఈ పనికి నడుం కట్టిన సావిత్రి, తన తెలివి తేటలను ఉపయోగించింది. 'మాట' అనే తిరుగు లేని సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించింది. ఇదీ మాటకున్న శక్తి. మనుషులు కూడా మాటను సందర్భోచితంగా ఆచి తూచి మాట్లాడాలి. అంతేకానీ ఆవేశంలోనూ, కోపంలోనూ మాట్లాడి తరువాత బాధపడకూడదు.

                                        ◆నిశ్శబ్ద.