మాటల ప్రాధాన్యత గురించి సుమతీ శతక కర్త వివరణలు!!
మాటల ప్రాధాన్యత గురించి సుమతీ శతక కర్త వివరణలు!!
మనిషి మనసులోని భావాలను వ్యక్తపరిచే సాధనం మాట, ఒక వ్యక్తి గురించి ఎదుటివారు అతడు మాట్లాడే మాటలనుబట్టి అభిప్రాయం ఏర్పరచుకుంటారు. కాబట్టి మనం మాట్లాడే మాటలు మనకు సమాజంలో గౌరవాన్ని, అభిమానాన్ని సంపాదించిపెడతాయి. అందుకే సుమతీ శతకకారుడు 'మాట' ప్రాధాన్యాన్ని ఇలా వివరించాడు.
ఇమ్ముగ జదువని నోరును
నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ముల బిలువని నోరునుఁ గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ.
ప్రతి వ్యక్తి కొడుకు, అన్న, తమ్ముడు, భర్త, యజమాని, ఉద్యోగి వంటి పలు పాత్రలను నిత్యజీవితంలో నిర్వహించాల్సి ఉంటుంది. పాత్ర ఎటువంటిదైనా వ్యక్తి ముందుగా ఎదుటి వ్యక్తి పట్ల చూపవలసినవి అనురాగం, ఆత్మీయత, గౌరవం.
తనివితీరా చదవాలి. మొక్కుబడిగా కాదు. చిత్తశుద్ధితో, మనస్ఫూర్తిగా చదవాలి. పరస్త్రీలను సైతం నోరారా 'అమ్మా' అని పిలిచి గౌరవించాలి. తమ్ములను కూడా ప్రేమగా, గౌరవంగా సంబోధించాలి. 'ఒరే' అని పిలిచినా, ఆ పిలుపులో ఆత్మీయత, అభిమానాలు ఉండాలి. గమనిస్తే, ప్రేమగా అనే 'ఒరే' లోనూ, కోపంగా అనే 'ఒరే'లోనూ ఎంతో భేదముంటుంది. పదం ఒకటే అయినా భావం మారుతుంది. తల్లి ప్రేమగా 'పిచ్చి మొద్దు' అంటే, హృదయం ఉప్పొంగుతుంది. బయటివాడు 'పిచ్చి మొద్దు' అంటే ఒళ్ళు మండుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఏదో మొక్కుబడిగా, యాంత్రికంగా పలికే పదాలకు శక్తి ఉండదు. అవి కేవలం మామూలు పదాల్లా మిగిలిపోతాయి. ఆ పదాల వెనుక ఉండే వ్యక్తి వ్యక్తిత్వం ఆ పదాలకు ఒక శక్తినిస్తుంది. ఎదుటివారి మనస్సులపై ప్రభావం చూపిస్తుంది. ఈ విషయం మనం పసిపిల్లల స్పందనను బట్టి గ్రహించవచ్చు.
సాధారణంగా పసిపిల్లలు కొత్తవారిని చూసి ఏడుస్తారు. భయపడతారు. ఎవరెంత అనునయంగా చూసినా, ముద్దు చేసినా అందరి దగ్గరకూ పోరు. కొందరి దగ్గరకు పరుగెత్తుతారు. అలవాటవటం దీనికి ఒక కారణం. మరో కారణం... పిల్లలకు మాటలు అర్థాలు తెలియవు. కానీ వారు ఎదుటివారి మనఃస్థితిని గ్రహించగలరు. అందుకే పైకి ముద్దు చేస్తున్నా, మనస్సులో ఉండే క్రోధాన్ని గ్రహించి వారికి దూరంగా ఉంటారు. ఇది మనం కూడా సినిమాల్లో నటీనటుల నటనలోని నిజాయితీని బట్టి అనుభవిస్తాం. భారీ డైలాగులు పలికినా కలగని అనుభూతి ఒక్కో నటుడు ఒక్క పలుకుతో కలిగించగలుగుతాడు. కాబట్టి ఎదుటివారి పట్ల గౌరవం, అనురాగం చూపటమే కాదు మన మాటను శక్తిమంతం చేసే మరో అంశం నిజాయితీ.
మాటకు బ్రాణము సత్యము
కోటకు బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్
బోటికి బ్రాణము మానము
చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ,
చీటికి (ఆజ్ఞకు) సంతకం, కోటకు భటులు, పడతికి మానం, మాటకు సత్యం ప్రాణం వంటివి అంటాడు సుమతీ శతకకారుడు.
అందుకే తైత్తిరీయోపనిషత్తులో విద్యాభ్యాసం పూర్తయిన విద్యార్థికి, వీడ్కోలు మాటల్లో.... గురువు అందించే సందేశంలో ముందు 'సత్యం వద, ధర్మం చర' అనటం చూడవచ్చు. ధర్మపాలనకు ఎంత ప్రాముఖ్యముందో, సత్యం మాట్లాడటానికీ అంత ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే సత్యం పలకటమే మన ధర్మం కాబట్టి
మనుధర్మశాస్త్రం కూడా సత్యం పలకటం అనే విషయాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తుంది. "అన్యాయంగా అడిగినవాడు, అన్యాయంగా బదులు చెప్పినవాడు దోషి అవుతాడు. లేక విరోధాన్ని పొందుతాడు" అంటే మనం మాట్లాడే ప్రతి మాటకు "ప్రతిమాట" ఉంటుందని గ్రహించాలి. ఎదుటివాడు మన కన్నా చిన్నవాడా, పెద్దవాడా, తక్కువ స్థాయి వాడా అన్న దాంతో సంబంధం లేకుండా గౌరవంగా పలకరించాలి. గౌరవించి మాట్లాడాలి. గోడకు కొట్టిన బంతి అంతే వేగంగా వెనక్కు వచ్చినట్టు, మనం గౌరవిస్తే మనకు గౌరవం లభిస్తుంది. మనం మర్యాద పొందాలంటే, ఎదుటివాడు మర్యాదనివ్వటం కోసం ఎదురు చూడకుండా మనమే ముందుగా మర్యాదనివ్వాలి. మన మాటలో ఈ మంచితనాన్ని ప్రకటించాలి.
◆నిశ్శబ్ద.