దేవుడికి ధూపదీపాలు ఎందుకు? (Why Dhoop sticks and Lights)
దేవుడికి ధూపదీపాలు ఎందుకు?
(Why Dhoopsticks and Lights)
దైవారాధనలో కొన్ని పనులను మొక్కుబడిగా, యాంత్రికంగా చేసేస్తాం. అందులో ప్రధానమైనవి పసుపు కుంకుమలు, పూవులు, అగరొత్తులు, దీపారాధన. వీటన్నిటి వెనుకా ఏ కారణమూ లేదు, ఏదో పైపై అలంకారము, కాలక్షేపం అనుకుంటే పొరపాటే. మరి ధూపదీపాల ఏర్పాటు వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం.
పూజా సమయంలో దేవునికి అగరొత్తులు వెలిగిస్తాం. సాంబ్రాణి పొడితో ధూపం వేస్తాం. ఇలా చేయడంలో మొట్టమొదటి కారణం మానసిక ప్రశాంతత. అగరొత్తులు, లేదా సాంబ్రాణి వేయడంవల్ల వచ్చే మధురమైన పరిమళం ఒక దివ్యమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. మనసులో ఎలాంటి ఆలోచనలు, అలజడులు లేకుండా చేసి ప్రశాంతతను చేకూరుస్తుంది. హాయిగా, ఆనందంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
ఇక ధూపం వల్ల కలిగే ప్రయోజనాల్లో రెండోది ఆరోగ్యం. సాంబ్రాణి లేదా, అగరొత్తుల నుండి వచ్చే పొగ కళ్ళకు మంచిది. శ్వాసకోశాల్లో ఉండే దోషాలను తొలగించి, వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
మంచి సువాసనలు పీల్చడం వల్ల మనసుకు బాగుండటమే కాదు, శరీరంలో చురుకుదనం ప్రవేశిస్తుంది. జీర్ణకోశం చక్కగా పనిచేసి, ఆకలి పెరుగుతుంది.
దీపం వెలిగించడంలో ఉండే ప్రయోజనాలు
దీపం ఎంత అందంగా, అపురూపంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కదా. వెలుగుతున్న దీపం ఒక అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది. మనసులో ఉన్న ఒత్తిడిని తగ్గించి, సంతోషానికి దారితీస్తుంది.
దేవతార్చనలో దీపం విధిగా వెలిగిస్తాం. ఆ దీపాన్ని నేతితో లేదా, నువ్వుల నూనెతో వెలిగిస్తాం. ఇలా వెలిగే దీపం వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. అణుశక్తి బాధను తొలగిస్తుంది.
కనుక, దేవునికి ధూపదీపాలు సమర్పించడంలో యాంత్రికత లేదు. ఇవి మనసును, శరీరాన్ని అలౌకిక ఆనందంలో ముంచెత్తుతాయి.