నేటి కాలంలో అసంబద్ధ వాదన ఎలా ఉంటోంది?
నేటి కాలంలో అసంబద్ధ వాదన ఎలా ఉంటోంది?
ఈ ప్రపంచంలో మార్పులకోసం వాదించేవారు కొందరు ఉంటారు. తాము చెప్పేదే నిజమని వేర్వేరు కోణాల్లో విరుద్ధంగా వెళ్లి ఒక లంకెను పట్టుకుని వాదిస్తారు. అలాంటిదే ఇది కూడా…..
యే భోగ్ భీ ఏక్ తపస్యా హై
తుమ్ త్యాగ్ కీ మారే క్యాజానో? ||
అవమాన్ రచయితా కా హోగా
రచనా కో అగర్ రుక్రావోగే!
త్యాగాన్నే గొప్పగా భావించే మీరు భోగాలను అనుభవించటం కూడా ఒక తపస్సు లాంటిదేనని అర్థం చేసుకోలేరు. రచనను తిరస్కరించటం రచయితను అవమానించినట్టే అవుతుంది. ఈ ప్రపంచం భగవంతుడి రచన. కాబట్టి ప్రపంచంలోని సుఖదుఃఖాలు, ఆనంద విషాదాలు అనుభవించకుండా, ఏవీ తాకకుండా నిర్మోహి అయి తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలనుకోవటం, భగవంతుడి రచనను తిరస్కరించి అతడిని అవమానించినట్టే అవుతుంది. కాబట్టి 'తపస్సు', 'గిపస్సు' బ్రహ్మచర్యం వంటి మాటలు కట్టిపెట్టి జీవితాన్ని అనుభవించాలన్నమాట.
శక్తిమంతమైన వాదమిది!
ఏ భగవంతుడిని చేరుకోవటం కోసం సర్వసుఖాలను త్యాగం చేయటమంటే, భగవంతుడి రచనను కాదని ఆయనను అవమానపరచటమేనంటే, మొత్తం లక్ష్యం దెబ్బతినే సాధన చేస్తున్నారన్న భావన కలుగుతుంది. జీవితాన్ని అనుభవించకపోవటం నేరం అనిపిస్తుంది. ఎటువంటి వారి మదిలోనైనా సందేహం జనిస్తుంది.
అవును! ప్రపంచంలో ఇన్ని రకాల ఆనందాలను, అందాలను భగవంతుడు సృజించాడు. వాటిని అనుభవించకుండా కాదనటం వల్ల లాభం ఏముంటుంది? కరిగిన కాలం తిరిగి రాదు. అటువంటప్పుడు కాలాన్ని వ్యర్థం చేసుకుని, అన్ని సుఖాలను త్యజించటం వల్ల ఒరిగేదేముంది? పైన భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు. స్వర్గం ఉందో లేదో ఎవరు చూశారు, కాబట్టి ఉన్నదో లేదో తెలియనిదాని కోసం ఉన్నదాన్ని చేజార్చుకోవటం ఎందుకు? బ్రహ్మచర్యం పేరుతో, తపస్సు పేరుతో జీవితంలో అమూల్యమైన ఆనందాలను అందించే అంశాలను కాదనటం ఎందుకు?
ఈ వాదానికి తోడుగా యుగాన్ని బట్టి మారే ధర్మాలను పట్టుకొని పాపపుణ్యాలను ఎలా నిర్ణయిస్తారు? అంటూ జరిపే వాదాన్ని జోడిస్తే, జీవితాన్ని అనుభవించటమే మానవుడి పరమలక్ష్యం అన్న భావన స్థిరపడుతుంది. ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాసం అంటూ విచక్షణను ప్రదర్శిస్తూ యమనియమాలను పాటించటం మూర్ఖత్వం అన్న ఆలోచన కలుగుతుంది. ఒకరకంగా చూస్తే, ఇటువంటి వాదాలు, ఆలోచనల వల్ల నీతినియమాలు పాటిస్తూ క్రమబద్ధమైన జీవితం గడిపేవాడు కూడా ఛాందసుడయ్యాడు. అపహేళన పాత్రుడయ్యాడు.
పొద్దున్నే లేచి వ్యాయామం (యోగ) చేసేవాడిని వెక్కిరిస్తారు. కాలేజీకి వెళ్లి బుద్ధిగా చదువుకోవాలనుకునేవాడిని, ఇతర మిత్రులంతా కలిసి ఆటపట్టిస్తారు. అమ్మాయిలతో స్నేహం చేసి, వారి గురించి జోకులు వేయని యువకుడు జీవితాన్ని అనుభవించటం తెలియని వాడవుతాడు. క్లాసులు ఎగగొట్టటం, సినిమాలు చూడటం, జులాయిలా తిరగటం మాత్రమే జీవితాన్ని 'ఎంజాయ్' చేయటం అన్న భావన బలంగా నాటుకుంది. ఇందులో భాగమే, పెద్దల మాట వినకపోవటం, సంప్రదాయాన్ని తిరస్కరించటం, పద్ధతులను, నియమాలను కాదని విశృంఖలంగా ప్రవర్తించటం వంటి అంశాలు.
ఆధునికయుగంలో 'సెక్స్ ఎడ్యుకేషన్' ఓ ప్రధానాంశంగా మారింది. ప్రతి ఒక్కడూ ఈ ముసుగు వేసుకొని రకరకాలుగా సమాజంలో విషాన్ని వెదజల్లుతున్నారు. గోప్యంగా, పవిత్రంగా, ఇద్దరు మనుషులకు మాత్రమే పరిమితంగా ఉండాల్సిన అనేక అంశాలను బహిరంగంగా చర్చిస్తూ, మానవులలోని అధమస్థాయి లక్షణాన్ని ఉత్తేజపరచి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వివాహేతర సంబంధాలను ప్రోత్సహిస్తూ, విశృంఖలత్వాన్ని సమర్థిస్తూ, నియమాలను, నియంత్రణలను త్రోసిరాజంటున్నారు. గుప్త జ్ఞానాన్ని బహిరంగపరచి అభ్యుదయవాదుల్లా చలామణి అవుతున్నారు. ఇది కూడా సమాజంలో విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. కృత్రిమపద్ధతుల ద్వారా స్వయంతృప్తి సాధించటం, అక్రమపద్ధతుల ద్వారా కామతృప్తి పొందటం సబబేనన్న వీరి వాదం ప్రజలను తప్పు దారి పట్టిస్తోంది. 'లైంగిక స్వేచ్ఛ' పరమానందమన్న ప్రచారం వల్ల వ్యాపారులకు లాభాలు అధికంగా ఉండటంతో, ప్రతి ఒక్కరూ అదే పాట పాడుతున్నారు.
తమ వాదానికి సంప్రదాయ మద్దతు కోసం వీరు ఖజురహో శిల్పకళకు వికృతభాష్యం ఇస్తున్నారు. వాత్స్యాయనుడి కామసూత్రాలను కాచివడబోసినట్టు మాట్లాడుతూ, మన పూర్వికుల గురించి అసంబద్దవ్యాఖ్యలు చేస్తూ కాలర్లెగరేస్తున్నారు.
ఇటువంటి ఉద్ధృతమైన ప్రచారప్రవాహంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమాజంలో నియమ నిబంధనలు, శాశ్వత ఆలోచనలు, దూరదృష్టి అన్నవి అదృశ్యమవటంలో ఆశ్చర్యం లేదు. ఇటువంటి ప్రచారప్రభావంతో ఎదుగుతున్న పసిపిల్లల మెదళ్లు ఆవేశాలకు లోనుగావటం సాధారణం అవుతుంది. ఎవరన్నా గౌరవం లేకపోవటం, జీవితంపై చులకన భావం ఉండటంలో ఆశ్చర్యం ఉండదు. అందుకే ప్రేమ నేటి సమాజంలో అత్యంత వికృతరూపంతో దర్శనమిస్తోంది.
◆నిశ్శబ్ద.