కామానికి లొంగడం వల్ల ఎలా దిగజారుతారు?

 

కామానికి లొంగడం వల్ల ఎలా దిగజారుతారు?

మనిషిలో మార్పు అనేది సహజం. అయితే మనిషి ఆధ్యాత్మిక ప్రయాణం సజావుగా సాగాలి అంటే తప్పనిసరిగా మనిషి ఏ ప్రలోభాలకు లోనూ కాకూడదు. ఇలాంటి వాటికి మన భారతీయ పురాణాలలో బోలెడు ఉదాహారాలు ఉన్నాయి. 

'సారంగు తమ్మయ్య' అన్న కవి 'విప్రనారాయణ చరిత్ర' అనే కావ్యం రాశాడు. ఆ కావ్యంలో ఒక పద్యంలో కామప్రలోభంలో పడ్డ వ్యక్తి ఎలా దిగజారుతాడో అత్యంత అద్భుతంగా వర్ణించాడు.

ఆ విప్రోత్తము వజ్రపంజర నిభంబై నిశ్చలంబైన స

ద్భావం బంగన సాహచర్య గుణ సంపర్కంబునన్ లోహమై

గ్రావంబై దృఢదారువై తరుణవృక్షంబై ఫలప్రాయమై

పూవై తన్మకరందమై కరగె బోబో నీళ్ళకున్ బల్చనై.

విప్రనారాయణుడు విష్ణుభక్తుడు. పరమ నిష్ఠాగరిష్ఠుడు. ఒక వ్యక్తి అంత గొప్పగా  జీవించటం కూడా ఒక తపస్సు వంటిదే. చాలామంది తపస్సు అంటే తాము సినిమాలలో, టీవీ లలో చూసేవి గుర్తుతెచ్చుకుని అలా కదలకుండా ఉండటమే తపస్సు ఏమో అనుకుంటారు.  తపస్సు చేయటం అంటే అడవిలోకి వెళ్ళి ముక్కు మూసుకుని కూర్చోవటం కాదు.  సుళ్ళు తిరిగే సామాజిక జీవనస్రవంతిలో ఉంటూ కూడా, తామరాకును నీటి బొట్టు తాకనట్టే, సమాజ ప్రవాహగతిని కొట్టుకుపోకుండా నిశ్చలంగా నిలచి తన విధ్యుక్త కర్మలను నిర్మోహంగా నిర్వహించటం తపస్సే. 

భగవంతుడిపై అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండటం ఒక తపస్సే. అటువంటి విప్రనారాయణుడి తపస్సును భగ్నం చేస్తానని 'దేవదేవి' అనే వేశ్య ప్రతిజ్ఞ చేస్తుంది. తన అందచందాల రంగుల పంజరంలో విప్ర నారాయణుణ్ని బందీ చేసుకొంటుంది.

విప్రనారాయణుడు ఎటువంటివాడంటే 'వజ్రపంజరనిభంబై, నిశ్చలంబైన సద్భావం' కలవాడు. 'సద్భావం' అంటే సద్విషయకమైన భావం. భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. సత్ అంటే ఉన్నది. అది తప్ప మిగిలినవేవీ లేవని అర్థం. 'సద్భావం' అంటే పరమేశ్వరసంబంధమైన భావం. అది ఒక్కటే నిత్యమైంది, సత్యమైంది. నిశ్చలమైన పరమేశ్వరభావానికి మరో పేరు బ్రహ్మచర్యం! స్త్రీ సంయోగం వల్ల బ్రహ్మ భావన చెడుతుంది. మనిషి దృష్టి బ్రహ్మభావనను వదలి భౌతిక సుఖావేశపరవశ మవుతుంది. అయితే విప్రనారాయణుడి బ్రహ్మచర్యభావన వజ్రంతో కట్టిన అభేద్యమైన పంజరం లాంటిది. అంటే అంత దృఢమైనదన్నమాట. 

కానీ 'అంగన సాహచర్య గుణసంపర్కం'తో అంటే స్త్రీ సాహచర్యమనే గుణం కలవటంతో 'వజ్రం' లాంటి సంకల్పం కాస్తా లోహమైంది. లోహం రాయి అయింది. రాయి గట్టి కొయ్యగా మారింది. అది లేతమొక్కంత మెత్తనైపోయింది. మొక్క గట్టితనం 'పండు' అంత మెత్తగా అయిపోయింది. చివరికి పూల వలె, వాటిలోని మకరందంగా కరిగి, ద్రవం అంత పలచన అయింది. ఇలా పలచబడుతూ చివరికి నీళ్ళ కన్న పలుచనైపోయింది.

ఎంత అద్భుతమైన వర్ణన! వజ్రం అంత కఠినమైంది చివరికి నీరై 'పారి'పోయింది. బ్రహ్మచర్యంలోని ఔన్నత్యం, కామానికి లొంగటం వల్ల దిగజారే 'అధమత్వం' ఇంత కన్న సరళంగా, అందంగా, అద్భుతంగా చెప్పటం కుదరని పని.

                                                ◆నిశ్శబ్ద.