ఇంద్రజిత్ మాయా యుద్ధం ఎలా చేస్తాడు?

 

ఇంద్రజిత్ మాయా యుద్ధం ఎలా చేస్తాడు?

రావణుడు చెప్పగానే  ఇంద్రజిత్ 4 గుర్రములు పూన్చిన రథం ఎక్కి అనేకమంది సైన్యంతో యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు. ఆయన చుట్టూ సైన్యం మొహరించి ఉంది, కాని ఇంద్రజిత్ మాత్రం కొంతసేపు ఎవరికీ కనపడలేదు. 

(ఆ సమయంలో చుట్టూ మోహరించిన సైన్యం మధ్యలో ఉన్న ఇంద్రజిత్ సమిధలు, పుష్ప మాలికలు, ఎర్రటి వస్త్రాలతో అగ్నిహోత్రంలో హోమం చేస్తాడు. ఆ హోమం చేశాక ఆ హోమాగ్ని సుడులు తిరుగుతూ పైకిలేస్తుంది. అప్పుడు ఒక నల్ల మేకని పట్టుకొచ్చి తన పళ్ళతో దాని కంఠాన్ని కొరికి, మెడ చీల్చి, ఆ మేక మాంసాన్ని ఆ హోమాగ్నిలో వేస్తాడు (వీటిని అభిచారిక హోమాలు అంటారు, ఇవి చాలా ప్రమాదకరమైనవి). అప్పుడా పుష్పాలని, అక్షతలని తన ఆయుధముల మీద వేసి, ఎర్రటి వస్త్రాలు కట్టుకొని, రథం ఎక్కి మాయమయిపోతాడు, ఇంక ఎవరికీ కనపడడు. ఆ ఇంద్రజిత్ గుర్రాల చప్పుడు కాని, వాడి ధనుస్సు యొక్క శబ్దము కాని, వాడి బాణ ప్రయోగం కాని ఎవరికీ వినపడదు, అర్ధం కాదు. ఆయనకి అందరూ కనపడతారు, కాని ఆయన ఎవరికీ కనపడడు. ఒక్క విభీషణుడు మాత్రమే ఆయనని మాయా బలంతో చూడగలడు)

హోమాన్ని పూర్తి చేసిన ఇంద్రజిత్ రథం ఎక్కేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేసి, బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆవాహన చేసుకున్నాడు. ఆయన రథం ఎక్కగానే ఆ రథం ఎవ్వరికీ కనపడలేదు, అప్పుడాయన ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. మేఘాల మధ్యకి వెళ్ళిన ఇంద్రజిత్ దిక్కులని, విదిక్కులని మంచుతో కప్పేసి, ధనుష్టంకారం కూడా వినపడకుండా కొన్ని వేల బాణాలను ప్రయోగం చేసి హనుమంతుడిని, సుగ్రీవుడిని, ద్వివిదుడిని, మైందుడిని, అంగదుడిని, గంధమాదనుడివి. జాంబవంతుడిని, సుషేణుడిని, వేగదర్శిని, నీలుడిని, గావాక్షుడిని, కేసరిని మొదలైన అనేకమంది వానర వీరులని తన బాణములతో కొట్టి భూమి మీద పడేశాడు. అన్ని కోట్ల వానర సైన్యాన్ని బ్రహ్మాస్త్రం చేత కట్టి పడేశాడు. 

అప్పుడు వాడు పైనుండి ఒక పెద్ద నవ్వు నవ్వి రామలక్ష్మణులతో "ఒకసారి నాగ పాశాలతో మిమ్మల్ని కట్టాను, కాని మీరు విడిపించుకున్నారు. ఇవ్వాళ బ్రహ్మాస్త్రంతో మిమ్మల్ని కట్టేస్తాను, ఇవ్వాల్టితో యుద్ధం అయిపోతుంది" అన్నాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడితో "లక్ష్మణా! ఇవ్వాళ మనకి వేరొక దారిలేదు. వాడు బ్రహ్మగారికి చెందిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కొడుతున్నాడు. ఆ బ్రహ్మాస్త్ర బంధనం చేత మొత్తం వానర సైన్యం పడిపోయింది. ఎదురుగా ఉన్న వీరుడైతే మనం కొట్టచ్చు, కాని వాడు మాయా యుద్ధం చేస్తున్నాడు. కనుక మనం వాడిని కొట్టలేము. అందువల్ల వాడు కొడుతున్న బాణ పరంపరకి ఓర్చుకున్నంతసేపు ఓర్చుకో, తరువాత స్పృహతప్పినవాడు పడిపోయినట్టు రణభూమిలో పడిపో, అప్పుడు వాడు ఎన్ని బాణములు కొట్టాలో అన్ని బాణములతో మన శరీరాలని కొడతాడు. అలా కొట్టేశాక శత్రువు మరణించాడనుకొని, జయలక్ష్మిని పొందాననుకొని వాడు అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. ఆ తరువాత బతికుంటే చూద్దాము. ముందు వాడిని కొట్టెయ్యని" అన్నాడు.

అప్పుడు ఇంద్రజిత్ రామలక్ష్మణులిద్దరిని బాణాలతో కొట్టేశాడు. ఇద్దరి శరీరాల నిండా బాణాలతో దిగిపోయాయి, నెత్తురు వరదలై కారిపోయింది. వాడి బాణ పరంపరని తట్టుకోలేక రామలక్ష్మణులిద్దరూ భూమి మీద పడిపోయారు. అప్పుడు వాడు వికటాట్టహాసం చేసి చూసేసరికి ఆ యుద్ధ భూమిలో నిలబడి ఉన్నవాడు ఎవడూ లేడు, అందరినీ ఒక్కడే కొట్టేశాడు, మొత్తం 67 కోట్ల వానర సైన్యాన్ని ఇంద్రజిత్ ఒక్కడే కొట్టి అంతఃపురానికి వెళ్ళి రావణుడితో "రామలక్ష్మణులిద్దరినీ బ్రహ్మాస్త్ర బంధనం చేశాను, వారు పడిపోయి ఉన్నారు" అని చెప్పాడు.

                                      ◆నిశ్శబ్ద.