హనుమంతుడి శక్తి గురించి జాంబవంతుడి మాట!
హనుమంతుడి శక్తి గురించి జాంబవంతుడి మాట!
ఇంద్రజిత్ బాణములు ప్రయోగించకముందే విభీషణుడు యుద్ధ భూమినుండి పారిపోయాడు. హనుమంతుడికి ఉన్న వరం వలన ఆయనని ఏ అస్త్రము బంధించలేదు. ఆ విభీషణుడు హనుమంతుడిని కలుసుకొని "అసలు మన సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద వీరులు ప్రాణాలతో ఉన్నారా?? ప్రాణాలు విదిచిపెట్టేశారా వెతుకుదాం పదా!!" అని ఒక కాగడా పట్టుకొని ఆ యుద్ధ భూమిలో వెతికారు. (ఇంద్రజిత్ అందరినీ కనురెప్పలు కూడా తెరవడానికి వీలులేకుండా బాణాలతో కొట్టాడు).
అలా వెతుకుతుండగా వాళ్ళకి జాంబవంతుడు కనిపించాడు, విభీషణుడు "జాంబవంత! నీకు స్పృహ ఉందా, మేము మాట్లాడుతుంది నీకు అర్ధం అవుతుందా??" అని అడిగాడు.
అప్పుడు జాంబవంతుడు మెల్లగా కనురెప్పలు పైకి ఎత్తి అన్నాడు " నాయనా, నీ కంఠం చేత గుర్తుపట్టానయ్య, నువ్వు విభీషణుడివి కదా. హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా?" అని అడిగాడు.
అప్పుడు విభీషణుడు "నువ్వు పెద్దవాడివి, వానర యోధులకందరికి కూడా నువ్వు తాతవంటి వాడివి. అటువంటి నువ్వు రామలక్ష్మణులు బతికి ఉన్నారా అని అడగకుండా హనుమంతుడు జీవించి ఉన్నాడా అని ఎందుకు అడిగావు" అన్నాడు.
అప్పుడు జాంబవంతుడు అన్నాడు "మొత్తం వానర సైన్యం అంతా మరణించని, హనుమంతుడు ఒక్కడు బతికుంటే మళ్ళి వీళ్ళందరూ బతుకుతారు. మొత్తం వానర సైన్యం బతికి ఉండని, హనుమంతుడు ఒక్కడు చనిపోతే అందరూ చనిపోయినట్టే. హనుమ శక్తి ఏమిటో నాకు తెలుసు, హనుమ ఉన్నాడా?" అని అడిగాడు,
వెంటనే హనుమంతుడు జాంబవంతుడి పాదాలు పట్టుకొని "తాత! హనుమ నీకు నమస్కరిస్తున్నాడు" అన్నాడు.
అప్పుడు జాంబవంతుడు "అందరినీ రక్షించగలిగినవాడివి నువ్వే. ఆలస్యం చెయ్యకుండా ఉత్తర క్షణం బయలుదేరి హిమాలయ పర్వతాలకి వెళ్ళు, అక్కడ కైలాశ పర్వతం పక్కన ఓషది పర్వతం ఒకటి ఉంది. దానిమీద ఉండే మృతసంజీవని (దీని వాసన చూస్తే చనిపోయిన వారు బతుకుతారు), విశల్యకరణి (దీని వాసన చూస్తే, శరీరంలో బాణపు ములుకులు గుచ్చుకుని ఉంటే అవి కింద పడిపోతాయి), సంధానకరణి (దీని వాసన చూస్తే విరిగిపోయిన ఎముకలు అతుక్కుంటాయి), సౌవర్ణకరణి (దీని వాసన చూస్తే, మూర్చపోయిన వాళ్ళకి తెలివి వస్తుంది) అనే నాలుగు ఓషదులని తీసుకురా" అన్నాడు. జాంబవంతుడు ఈ మాట చెప్పగానే హనుమంతుడు ఒక పర్వతాన్ని ఎక్కి, మెరుపు వెళ్లినట్టు ఆ పర్వతాన్ని తొక్కేసి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు.
హనుమంతుడు చాలా వేగంతో హిమాలయ పర్వతాలని చేరుకొని, ఓషది పర్వతం ఎక్కడుందని చూస్తుండగా ఆ హిమాలయాల మీద ఆయనకి బ్రహ్మగారి ఇల్లు కనపడింది. అక్కడే పరమ శివుడు తన ధనుస్సుని పెట్టే ఒక పెద్ద అరుగు కనపడింది. అక్కడే హయగ్రీవుడిని ఆరాధన చేసే ప్రదేశం కనపడింది, సూర్య భగవానుడి కింకరులు ఉండే ప్రదేశం కనపడింది, అక్కడే ఇంద్రుడు ఉండే గృహం, కుబేరుడు ఉండే గృహం కనపడింది, అక్కడే సూర్య భగవానుడిని విశ్వకర్మ చెక్కిన వేదిక కనపడింది.
తరువాత ఆయన ఆ ఓషది పర్వతం కోసం వెతికాడు. ఆ ఓషది పర్వతంలోని ఓషదులు తమని ఎవరో తీసుకుపోడానికి వస్తున్నారని, అవి తమ ప్రకాశాన్ని తగ్గించేసి లోపలికి అణిగిపోయాయి.
ఆ ఓషదులను చూసిన హనుమంతుడు "ఆ ఓషదులని నాకు కనపడకుండా దాస్తార, రామ కార్యానికి సాయం చెయ్యరా" అని ఆ పర్వత శిఖరాన్ని పీకి, చేతితో పట్టుకొని వాయు వేగంతో ఆ శిఖరాన్ని తీసుకొనివచ్చి యుద్ధ భూమిలో పెట్టాడు.
◆నిశ్శబ్ద.