లక్ష్మణుడు ఇంద్రజిత్ ను ఎలా సంహరించాడు?
లక్ష్మణుడు ఇంద్రజిత్ ను ఎలా సంహరించాడు?
లక్ష్మణుడిని తీసుకెళ్ళి ఇంద్రజిత్ ని సంహరిస్తాను అని విభీషణుడు చెప్పేసరికి రాముడు లక్ష్మణుడిని ఆశీర్వదించి, హనుమ మొదలైన వీరుల్ని సాయంగా పంపారు.
విభీషణుడు లక్ష్మణుడిని ఇంద్రజిత్ హోమం చేసుకునే చోటుకి తీసుకు వెళ్ళాడు. వారు అక్కడికి వెళ్ళేసరికి ఇంద్రజిత్ ఆ హోమం చెయ్యడం కోసం సిధ్ధపడుతున్నాడు. తన హోమాన్ని ఎవరూ పాడుచెయ్యకుండా చుట్టూ సైన్యాన్ని కాపు పెట్టాడు.
అప్పుడు విభీషణుడు "లక్ష్మణా! నువ్వు ఒకపక్క నుండి సైన్యాన్ని బాణాలతో కొట్టి కాకావికలం చెయ్యి, అప్పుడు ఇంద్రజిత్ కనపడతాడు. అదే సమయంలో హనుమ వెళ్ళి రాక్షస సైన్యాన్ని తుదముట్టించెయ్యాలి. అంతమంది అక్కడ పడిపోతుంటే వాడు అక్కడ కూర్చుని హోమం చెయ్యలేడు. కాబట్టి రథం ఎక్కి వస్తాడు, అప్పుడు నువ్వు వాడిని కొట్టాలి'" అన్నాడు.
వెంటనే లక్ష్మణుడు బాణ ప్రయోగం చేశాడు. అప్పుడా సైన్యం పక్కకి తప్పుకుంది. వారు పక్కకి తప్పుకోగానే ఆ మర్రి చెట్టు కనపడింది. వెంటనే హనుమంతుడు అరవీరభయంకరుడై ఆ రాక్షసుల పని పట్టాడు. హనుమ ప్రతాపం ముందు ఆ రాక్షన సైన్యం నిలబడలేక పెద్ద హాహాకారాలు చేశారు. ఆ హాహాకారాలు విన్న ఇంద్రజిత్ హోమాన్ని ఆపి "ముందు హనుమంతుడిని సంహరించి, అప్పుడు హోమం చేస్తాను" అని అనుకొని రథం ఎక్కాడు. అప్పుడాయన ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని హనుమంతుడి మీద ప్రయోగిద్దామని ఆ అస్త్రాన్ని అభిమంత్రిస్తుండగా లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు. ఆ టంకారానికి ఇంద్రజిత్ లక్ష్మణుడి వైపు చూశాడు.
అప్పుడు లక్ష్మణుడు "దుర్మార్గుడా, హనుమతో యుద్ధం ఎందుకు, నీతో యుద్ధం చేయడానికి నేను వచ్చాను. పౌరుషం ఉంటే నాతో యుద్ధం చెయ్యి" అన్నాడు.
"ఇంతకముందు నిన్ను రెండు మూడుసార్లు కొట్టాను, అయినా బుద్ధి లేకుండా మళ్ళి వచ్చావు. చూడు నీకు ఎటువంటి యుద్ధం చూపిస్తానో ఇవ్వాళ" అని ఇంద్రజిత్ అన్నాడు. వాళ్ళిద్దరూ యుద్ధం మొదలుపెట్టారు.
లక్ష్మణుడి పక్కన ఉన్న విభీషణుడిని చూసి ఇంద్రజిత్ "నువ్వు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగావు. నువ్వు స్వయానా నా తండ్రికి తమ్ముడివి, నాకు పినతండ్రివి. నీ కొడుకు వరసైన నన్ను చంపడానికి ఇవ్వాళ శత్రువులతో చేతులు కలిపావే నీకు ఇలా చేయడానికి సిగ్గుగా లేదా శత్రువులతో చేతులు కలిపి తనవారిని చంపినవాడు చివరికి ఆ శత్రువుల చేతులలోనే చనిపోతాడు" అన్నాడు.
"మీ నాన్న వైపు, నీ వైపు పాపం ఉంది కనుక నేను మిమ్మల్ని విడిచి ధర్మాత్ముడైన రాముడి పక్కకి వచ్చాను" అన్నాడు.
ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి ఘోరమైన యుద్ధం జరిగింది. ఇద్దరూ ఒకరిని ఒకరు బాణాలతో కొట్టుకున్నారు. లక్ష్మణుడు వేసిన బాణాలకి ఇంద్రజిత్ ధనుస్సు ముక్కలయిపోయింది. తరువాత ఇంద్రజిత్ బాణాలతో లక్ష్మణుడి కవచాన్ని పగలగొట్టాడు. ఇద్దరూ సింహాలలా యుద్ధం చేశారు. విభీషణుడు ఆ రాక్షసుల మీద బాణాలని వేసి వాళ్ళని సంహరించాడు.
ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి 3 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగినది. ఆఖరికి ఇంద్రజిత్ యొక్క సారధిని లక్ష్మణుడు కొట్టాడు. అప్పుడా ఇంద్రజిత్ ఒక చేతితో సారధ్యం చేస్తూ లక్ష్మణుడితో యుద్ధం చేశాడు. నలుగురు వానర వీరులు ఆ రథం గుర్రాలని కిందకి లాగేసి ఆ రథాన్ని నాశనం చేశారు.
లక్ష్మణుడు ఎన్ని అస్త్రాలని వేసినా ఇంద్రజిత్ సంహరించబడకపోయేసరికి విభీషణుడు లక్ష్మణుడితో "ఆ ఇంద్రజిత్ పౌరుషం పెరిగిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ ఇంద్రజిత్ ని సంహరించు" అన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు రెండు కోరలు కలిగిన సర్పంలాంటి ఒక బాణాన్ని తీసి, వింటినారికి తొడిగి "మా అన్న రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, దశరథుడి కొడుకే అయితే, పౌరుషం ఉన్నవాడే అయితే నా ఎదురుగా నిలబడిన ప్రతిద్వంది అయిన ఇంద్రజిత్ నిగ్రహింపబడుగాక" అని బాణ ప్రయోగం చేశాడు. ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్ కంఠానికి తగలగానే ఆయన శిరస్సు శరీరం నుండి విడిపోయి కింద పడిపోయింది. ఇంద్రజిత్ మరణించాడు.
◆నిశ్శబ్ద.