20 చేతులతో లక్ష్మణుడిని ఎత్తలేకపోయిన రావణుడు?

 

20 చేతులతో లక్ష్మణుడిని ఎత్తలేకపోయిన రావణుడు?

"నేను విష్ణు అంశని" అని స్మరిస్తూ స్పృహ కోల్పోయిన లకమణుడిని తన రథంలో లంకకి తీసుకు వెళదామని అనుకొని పరుగు పరుగున వచ్చి తన 20 చేతులతో లక్ష్మణుడిని ఎత్తబోయాడు రావణుడు. ఏ చేతులతో మేరు పర్వతాన్ని, మందర పర్వతాన్ని ఎత్తాడో, ఏ చేతులతో హిమవత్ పర్వతాన్ని కదిపాడో  ఆ చేతులతో లక్ష్మణుడిని ఎత్తలేకపోయాడు రావణుడు. (లక్ష్మణుడు పడిపోయేముందు నేను విష్ణు అంశవి అని పడిపోయాడు కాబట్టి రావణుడు ఎత్తలేకపోయాడు). ఇంతలో హనుమంతుడు మూర్చనుండి తేరుకుని చూసేసరికి, రావణుడు రథం దిగి లక్ష్మణుడిని పైకెత్తడానికి ప్రయత్నిస్తూ కనపడ్డాడు. అప్పుడు హనుమంతుడికి ఎక్కడలేని కోపం వచ్చి "నీ దిక్కుమాలిన నీ చేతులతో లక్ష్మణుడిని ముట్టుకుని, ఎత్తి తీసుకు పోదామనుకుంటున్నావా" అనుకొని, పరుగు పరుగున వచ్చి తన కుడి చేతితో రావణుడి వక్షస్థలంలో ఒక పోటు పొడిచాడు. ఆ దెబ్బకి రావణుడి చెవుల నుండి, ముక్కు నుండి, కనుగుడ్ల పక్కనుండి కూడా రక్తం కారి, మోకాళ్ళ మీద కిందకి పడిపోయి, మళ్ళి స్పృహలోకి వచ్చి గబగబా తన రథంలోకి వెళ్ళి కూర్చుండిపోయాడు.

అప్పుడు లక్ష్మణుడిని హనుమంతుడు పరమభక్తితో, రక్షించుకోవాలనే భావనతో ముట్టుకునేసరికి ఆయన దూదిపింజలా హనుమంతుడి చేతుల్లోకి ఒదిగిపోయాడు. హనుమంతుడు లక్ష్మణుడిని తీసుకెళ్ళి రాముడికి భక్తిగా అప్పగించారు. వెంటనే లక్ష్మణుడు స్పృహలోకి వచ్చి " బ్రహ్మగారి శక్తిని నా మీదకి ప్రయోగించాడు అన్నయ్యా, అప్పుడు నేను విష్ణు అంశని స్మరించాను. నాకు ఏ ఉపద్రవం లేదు" అని చెప్పాడు.

లక్ష్మణుడి మాటలు విన్న రాముడు కోపోద్రిక్తుడై గబగబా అడుగులు వేసుకుంటూ యుద్ధానికి బయలుదేరాడు. వెంటనే హనుమంతుడు వచ్చి "స్వామీ! ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు గరుగ్మంతుడి మీద కూర్చొని యుద్ధం చేస్తాడో, అలా మీరు నా వీపు మీద కూర్చొని యుద్ధం చెయ్యండి. ఆ రావణుడు రథంలో కూర్చుంటే మీరు నేల మీద నిలబడి యుద్ధం చెయ్యడమేమిటి స్వామీ, నా మీద కూర్చొని యుద్ధం చెయ్యండి" అన్నాడు.

అప్పుడు రాముడు హనుమ మీద కూర్చొని యుద్ధానికి వెళ్ళి "దురాత్ముడా, ఆచారభ్రష్టుడా, పర స్త్రీని అవహరించినవాడా! ఈ రోజు నువ్వు అంతఃపురంలోకి వెళ్ళవు. ఇవ్వాళ నీ పదితలకాయలు కొట్టేస్తాను" అని రాముడు చెబుతుండగా, రావణుడు ప్రత్యేకమైన బాణాలను  ఆపకుండా వరుసగా హనుమంతుడి మీద కురిపించాడు. ఆ బాణపు దెబ్బలకి హనుమంతుడి శరీరం అంతా నెత్తురు వరదలై కారిపోసాగింది. అలా ఉన్న హనుమని చూసిన రాముడికి పట్టరాని కోపం వచ్చి, అర్థచంద్రాకార బాణములు, నారాచ బాణములు, వంకరలు లేని బాణములు రావణుడి మీద ప్రయోగించాడు.

 అవి బాణాల, మెరుపులా? అని రావణుడు ఆశ్చర్యంగా చూస్తుండగా, ఆ బాణ పరంపరకి రావణుడి గుర్రాలు పడిపోయాయి, సారధి చనిపోయాడు, ధ్వజం పడిపోయింది, చక్రాలు ఊడిపోయాయి, రావణుడు తూలి భూమి మీద నిలబడ్డాడు. ఆ రావణుడి చేతిలో కోదండము, ఖడ్గము ఉన్నాయి. అప్పుడు రాముడు రావణుడి భుజంలోకి బాణాలు కొట్టాడు, కోదండాన్ని బాణాలతో కొట్టి విరిచేశాడు, ఆ ఖడ్గాన్ని విరిచేశాడు. ఆ రావణుడి శరీరమంతా  బాణాలతో కొట్టాడు. ఆ దెబ్బలకి నెత్తురు వరదలై కారిపోయింది. తరువాత రాముడు బాణములతో రావణుడి కిరీటాన్ని కొడితే అది దొర్లి కింద పడిపోయింది. ఈ సర్గని మకుట భంగ సర్గ అంటారు.


                                   ◆నిశ్శబ్ద.