మనిషిని అనుబంధాల ప్రపంచం గురించి అన్నమయ్య చెప్పిన మాట..

 

మనిషిని అనుబంధాల ప్రపంచం గురించి అన్నమయ్య చెప్పిన మాట..
 

 

మనిషి బంధాలలో, బాధలలో పడి కొట్టుకుపోవడానికి ప్రధాన కారణం అజ్ఞానమే! తెలుసుకోవలసిన విషయాన్ని. తెలుసుకోకుండా, అనవసరమైన పరిజ్ఞానాన్నీ, పరివారాన్నీ పోగేసుకుంటున్నాం,  పొగిలి పొగిలి విలపిస్తున్నాం. ఈ దృశ్య ప్రపంచాన్ని, ఓ సాక్షీభూతంగా వీక్షించే విజ్ఞత లోపించడం వల్లనే మన మనస్సు అనుక్షణం అలజడికి లోనవుతుంది. సుఖానికి పరవశిస్తుంది. దుఃఖానికి విలపిస్తుంది. నిజానికి మన అనుభవాలు, అనుభూతులన్నింటినీ ఏకాంతంగా ఉండి సింహావలోకనం చేసుకుంటే ఏదీ శాశ్వతమైన ఆనందాన్ని కానీ, ఏదీ శాశ్వతమైన విషాదాన్ని కానీ ఇవ్వలేదు. అన్నీ ఒక కలలా వస్తాయి,  కలలా వెళ్ళిపోతాయి. అయితే మనం మాత్రం వాటిని అనుభవించే క్షణాల్లో తీవ్ర ఉద్విగ్నతలకు, ఉద్రిక్తతలకు గురవుతూ ఉంటాం. 


 మనుషులందరూ అష్టపాశాల ద్వారా బంధింపబడి ఉన్నారు.  దయ, జుగుప్స, మోహం, భయం, సంశయం, కులం, బలం, శీలం మొదలైనవన్నీ బంధనాలే! వీటిలో నుంచి బయటపడినప్పుడే  సర్వస్వతంత్రులు కాగలరు. ఈ పరమసత్యాన్ని తెలుసుకున్న వ్యక్తే ఘనుడు, తత్త్వమతి, యోగి, ధీరుడు, వివేకి, ధన్యుడు అంటూ… 


'తెలిసితే మోక్షము తెలియకున్న బంధము...' కీర్తనలో పదకవితా పితామహుడు అన్నమయ్య తన కీర్తనలో ఎంతో అధ్బుతంగా వర్ణించాడు. అలా సుఖదుఃఖాలు, పాపపుణ్యాలనే ద్వంద్వాలకు అతీతంగా స్థితప్రజ్ఞుడిగా, ఆ గరుడవాహనుడి గతప్రాణుడిగా తరించమంటున్నాడు.


కనిపించే ఈ ప్రపంచంలో ఏదీ స్థిరం కాదు.  కాల భ్రమణంలో ఓ భ్రమలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఈ కఠోరవాస్తవాన్ని తెలుసుకుంటే అదే మోక్షమనీ, తెలియకుంటే ఈ బాహ్యప్రపంచమే బంధమై అల్లుకుంటుందనీ బోధపరుస్తూ...


తెలిసితే మోక్షము తెలియకున్న బంధము

కల వంటిది బతుకు ఘనునికిని... అని ఆలపిస్తాడు అన్నమయ్య. 


ఇలా ఘనమైన బుద్ధి కలిగిన వ్యక్తి ఈ బతుకును ఓ కలలా భావిస్తాడు. సాక్షిగా సావధానంతో అవలోకిస్తాడు. కానీ చాలా సందర్భాల్లో మనిషి కళ్ళు, మనిషి మనస్సే మనుషుల్ని  మోసం చేస్తుంది. మాయతెరలు కమ్మేస్తూ ఉంటుంది. మహానగరాలే మొండిగోడల్లా మిగిలిపోతున్నాయి. మహామహుల కీర్తిప్రభలే కాలగర్భంలో కర్పూరంలా కరిగిపోతున్నాయి. అందుకే ముందు ఈ అస్థిరత్వాన్ని గుర్తెరిగి శాశ్వతమైన దాని కోసం తపించమంటున్నాడు తాళ్ళపాక అన్నమాచార్య. 


శ్రీరామచంద్రుడు కూడా ఒకసారి తీవ్ర వైరాగ్య భావనతో...


యచ్ఛేదం దృశ్యతే కించిజ్జగత్ స్థావర జంగమమ్ | తత్సర్వమస్థిరం, బ్రహ్మన్! స్వప్న సంగమ సన్నిభమ్ || 


'కనబడే స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తంతా కూడా స్వప్న సంగమంలా అస్థిరమైనదే కదా!' అని తన గురువు వశిష్ఠ మహర్షితో అంటాడు. 


దీనిని బట్టి చూస్తే మనిషి క్షణకాలంలో చెందే  అనుభూతి, భావోద్వేగాలు అన్నీ కలలాంటివి. కానీ మనుషులు తాత్కాలిక ఆ ఆనుభూతుల కోసమే తాపత్రయపడుతుంటారు. ఈ నిజాన్ని తెలుసుకున్ననాడు మోక్షం లభిస్తుంది. లేకపోతే భావోద్వేగాలలో, బంధాలలో చిక్కుకుని ఉంటారు.


                                      *నిశ్శబ్ద.