మనిషి జీవితానికి అర్థం, పరమార్థం ఎప్పుడు చేకూరుతుంది..

 

మనిషి జీవితానికి అర్థం, పరమార్థం ఎప్పుడు చేకూరుతుంది..

పుట్టుట గిట్టుట కొరకే - మహాయోగైనా, భోగైనా; మహారాజైనా, నిరుపేదైనా; మహాపండితుడైనా, పామరుడైనా... పుట్టిన ప్రతి ఒక్కరూ అనంత కాలగర్భంలో కలిసిపోవలసిందే! ఈ ప్రకృతి నియమానికి ఎవ్వరూ. అతీతులు కారన్నది మనకు తెలిసిన విషయమే! అయితే మనిషి పుట్టినప్పటి నుండీ చనిపోయేవరకూ ఎలా జీవించాడన్నదే ముఖ్యం గానీ, ఎలాగూ చనిపోతాం కదా జీవించినంతకాలం నిరాశతో క్రుంగి కృశించిపోవడానికి మాత్రం కాదు.

జీవితమంటే ఏమిటో, ఎలా జీవించాలో, ఈ జీవితానికి ఎలా ముగింపు పలకాలో నదీమతల్లి మనకు నేర్పుతుంది. ఎక్కడో పుట్టిన నది కొండకోనల్ని దాటుకుంటూ, పంట పొలాల్ని పరిపుష్టి గావిస్తూ, జనజీవనానికి ఆధారంగా నిలుస్తూ, ఉత్సాహంగా పరవళ్ళుతొక్కుతూ, ఆఖరికి ఆనందంగా అనంత సాగరంలో కలిసిపోతుంది. నదీమతల్లిలా మనం కూడా కష్టనష్టాలనే కొండకోనల్ని దాటుకుంటూ, మన జీవితాలను ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దుకుంటూ, మన చుట్టూ ఉన్నవారికి సహాయపడుతూ, చివరి వరకూ జీవనయానం సాగించి, కాలగర్భంలో కలిసిపోగలగాలి. 

చిరునవ్వుతో సమాజంలో జీవిస్తున్న మనుష్యులను నాలుగు రకాలుగా విభజిస్తూ భర్తృహరి 

'పరహితానికి పాటుపడేవారిని ఉత్తములనీ,

తమ హితాన్ని కోరుకుంటూ పరులకు తోడ్పడేవారిని మధ్యములనీ,

తమ ప్రయోజనాల కోసం పరులను ఉపయోగించుకునేవారిని అధములనీ, 

ఎప్పుడూ పరులకు కీడు తలపెట్టేవారిని మాత్రం ఏమని పిలవాలో తెలియదనీ..  అన్నాడు.

తాను తరిగిపోతూ సువాసనలు వెదజల్లే చందన వృక్షంలా, తాను కరిగిపోతూ వెలుగును ప్రసాదించే కొవ్వొత్తిలా కేవలం పరహితం కోసమే జీవించగలిగిననాడు ఈ భువియే దివిగా మారుతుంది. ఈ భూతలమంతా భగవాన్ బుద్ధుడు, స్వామి వివేకానందలాంటి మహాత్ములతో నిండిపోతుంది. అయినా పరుల కోసమే జీవించడం అందరికీ సాధ్యంకాదు. కాబట్టి మన హితాన్ని కోరుకుంటూ, పరులకు సహాయపడేలాగైనా జీవించగలగాలి. అప్పుడు మానవలోకం దానవలోకంగా మారకుండా ఉండేందుకు తోడ్పడే వారమవుతాం. ప్రస్తుత సమాజానికి మనమందరం చేయగల మహోన్నత ఉపకారం ఇదే!

జీవితంలో నిరాశా నిస్పృహలకు తావివ్వకుండా ఆసక్తికరమైన జీవితాన్ని గడపాలంటే 'ప్రతిరోజునీ మొదటి రోజులా భావించిననాడు  ఉత్సాహంగా జీవించగలం, కష్టపడి పనిచేస్తున్నకొద్దీ జీవితాన్ని మరింతగా ఆస్వాదించగలం'  అని బెర్నార్డ్ షా చెప్పిన మాటలను మననం చేసుకోవాలి.

మన జీవితాన్ని అర్థవంతంగా గడపాలంటే...

If in this hell of a world, one can bring a little joy and peace even for a day into the heart of a single person, that much alone is true… - Swami Vivekananda

 'నరకతుల్యమైన ఈ ప్రపంచంలో కనీసం ఒక్కరోజైనా, ఏ ఒక్కరి హృదయాన్నైనా శాంతి, ఆనందాలతో నింపగలిగిననాడు అదే నిజమైన జీవితం' అన్న స్వామి వివేకానందుని మాటల్ని ఆచరణాత్మకం చేయాలి. అప్పుడే ఈ కాల ప్రవాహంలో సాగే మన జీవన నౌకాయానానికి ఓ అర్థం, పరమార్థం చేకూరుతుంది.


                                         *నిశ్శబ్ధ.