నిరాశ అందరిలోనూ ఉంటుందనడానికి హనుమంతుడే సాక్ష్యం!

 

నిరాశ అందరిలోనూ ఉంటుందనడానికి హనుమంతుడే సాక్ష్యం!

హనుమంతుడు రావణాసుడి అంతఃపురం నుండి  ముందుకి వెళ్ళగా, రకరకాలైన బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మణిమాణిక్యాలు పొదిగిన పాత్రలు, పువ్వులనుండి తీసిన సుర, పళ్ళనుండి తీసిన సుర, తేనెనుండి తీసిన సురలు మధురమైన వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అక్కడ తాగేసిన పాత్రలు, సగం తాగి కిందపడేసిన పాత్రలు, స్త్రీ పురుషులు ఒకరిమీద ఒకరు ఉండకూడని విధంగా మత్తులో పడి ఉన్నారు. హనుమంతుడు వాళ్ళందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అప్పుడాయన అందరూ ఆహారం తీసుకునే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నెమళ్ళ మాంసం, కోళ్ల మాంసం, మేకల మాంసం, గొర్రెల మాంసం, అడవిపందుల మాంసం అలా రకరకాలైన పదార్థాలు ఉన్నాయి. హనుమ ఆ ప్రాంతాన్నంతటినీ వెతికారు. 

మళ్ళీ పుష్పక విమానంలోకి వెళ్ళి, అందులో వెతికి కిందకి దిగుతూ అనుకున్నారు "ఈ లంకా పట్టణం అంతా వెతికాను, ఇందులో వెతకని ఇల్లు లేదు. ఇక్కడ గంధర్వ, యక్ష, కిన్నెర స్త్రీలు, రాక్షసులు కనపడుతున్నారు కాని సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేకపోయాను" అని బాధ పడ్డాడు. కాని వెంటనే "ఎవడు శోకమునకు లొంగిపోడో, ఎవడు నిరంతరము ఉత్సాహముతో ఉంటాడో, వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకమునకు లొంగను, మళ్ళీ సీతమ్మని అన్వేషిస్తాను, మళ్ళీ ఈ లంకా పట్టణం అంతా వెతికేస్తాను" అని ఉత్సాహాన్ని పొంది లంకా పట్టణం అంతా వెతికి కూర్చున్నాడు.

"ఇంత లంకా పట్టణాన్ని 4 అంగుళాలు కూడా వదలకుండ నేను వెతికాను, అయినా నాకు సీతమ్మ దర్శనం కాలేదు. బహుశా ఒంటి మీద వస్త్రము లేని స్త్రీలని ఎందరినో ఈ లంకా పట్టణంలో నేను చూశాను, అందువలన నాయందు ధర్మమునకు లోపం వచ్చిందేమో. నేను వెతుకుతున్నది. సీతమ్మని, ఆమె ఒక స్త్రి. అందువలన ఆమెని వెతుకుతున్నప్పుడు సీతమ్మో కాదో అని ఆ స్త్రీల వంక చూశాను. ఆ స్త్రీలని అలా చూశాను కాని, నా మనసులో ఎటువంటి వికారము కలగలేదు. నాకు ఎవరూ గుర్తులేరు. నేను పవిత్రముగానే ఉన్నాను" అని అనుకున్నాడు.

 ఆ తరువాత హనుమంతుడు తన మనస్సులో భావన చేసి, "నేను సీతమ్మ దర్శనం చెయ్యలేకపోయాను. ఇప్పుడు నేను వెనక్కి వెళితే అక్కడ ఉన్న వానరాలు నన్ను సీతమ్మ దర్శనం చేశావా?' అని అడుగుతారు. నాకు సీతమ్మ జాడ తెలియలేదు అని చెప్తాను. సీతమ్మ జాడ తెలీకుండా వెనక్కి వెళితే సుగ్రీవుడు చంపేస్తాడని అందరూ ప్రాయోపవేశం చేస్తారు. నేను వెళ్ళి ఈ మాట సుగ్రీవుడికి చెబితే, మిత్రుడైన రాముడికి సహాయం చెయ్యలేకపోయానని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. ఉన్న స్నేహితుడు కూడా వెళ్ళిపోయాడని రాముడు కూడా ప్రాణము వదిలేస్తాడు. రాముడు లేనప్పుడు లక్ష్మణుడు ఉండడు. అప్పుడు అక్కడున్న వానరకాంతలందరూ ప్రాణములు వదిలేస్తారు. తదనంతరం వానరులందరు మరణిస్తారు. ఈ వార్త అయోధ్యకి చేరి కౌసల్య, కైకేయి, సుమిత్ర, భరతుడు, శత్రుఘ్నుడు మరణిస్తారు. తరవాత అయోధ్యలో అందరూ మరణిస్తారు. నేను పట్టుకెళ్ళే వార్త వలన ఇంత మంది మరణిస్తారు. ఈ వార్తని నేను తీసుకువెళితే ఎంత వెళ్ళకపోతే ఎంత. 

బహుశా రావణుడు సీతమ్మని తీసుకువస్తున్నప్పుడు, ఆయన ఒడిలో కొట్టుకుంటున్న సీతమ్మ జారి సముద్రంలో పడిపోయి ఉంటుంది, కాదు కాదు, సీతమ్మ అంత పిరికిది కాదు. తన పాన్పు చేరడంలేదని, రావణుడే సీతమ్మని ముక్కలుగా నరికి ఫలహారంగా తినేసుంటాడు, కాదు కాదు. కాముకుడైనవాడు తాను కామించిన స్త్రీని సంహరించడు. లేకపోతే రాక్షసులు సీతమ్మని తినేసుంటారు. కాదు కాదు, రావణుడు కామించిన స్త్రీని తినగలిగే ధైర్యం రాక్షసులకు ఉండదు. రాముడికి సీతమ్మ జాడ తెలియకూడదని రావణుడే అమ్మని ఎక్కడో దాచి ఉంటాడు. కాబట్టి నిద్రపోతున్న రావణుడి పది తలలు గిల్లేసి, వాడి మృతకళేబరాన్ని రాముడి పాదాల దగ్గర పడేస్తాను, లేదా ఈ లంకని పెల్లఘించి పట్టుకుపోతాను. కాదు కాదు, సీతమ్మ జాడ చెప్పలేనప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళడం ఎందుకు, అందుకని నేను అసలు వెనక్కి వెళ్ళను, సీతమ్మ జాడ దొరికేవరకు వానప్రస్థుడిలా ఉంటాను, లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను, లేదా నీటిలోకి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను" అనుకున్నాడు.

 ఇలా ఎంతో గొప్ప బుద్ధిశాలి అయిన హనుమంతుడిలో కూడా ఒకానొక సమయంలో నిరాశ చోటు చేసుకుంది.

◆వెంకటేష్ పువ్వాడ.