రావణుడి అంతఃపురంలో హనుమంతుడిని ఆశ్చర్యపరిచిందేమిటి?
రావణుడి అంతఃపురంలో హనుమంతుడిని ఆశ్చర్యపరిచిందేమిటి?
హనుమంతుడు లంకలో నడుచుకుంటూ రావణాసుడి కోటకు వెళ్ళాడు. రావణాసురుడి అంతఃపురం. దానికి మొదటి కక్ష్యలో కొంతమంది గుర్రాల మీద కాపలా కాస్తుంటారు. రెండవ కక్ష్యలో ఏనుగుల మీద కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఆ వెనక కక్ష్యలో కొంతమంది కత్తులు పట్టుకొని తిరుగుతుంటారు. ఆ తరువాత కక్ష్యలో, ప్రభువు నిద్రలేవగానే ఒంటికి రాయడానికి కొంతమంది చందనం తీస్తుంటారు. తరువాత కక్ష్యలో ఆయన ధరించే పుష్పమాలికలు ఉంటాయి, ఆ వెనకాల ఆయనకి బాగా నిద్ర పట్టడానికి వాద్యపరికరాల మీద సన్నటి సంగీతాన్ని కొంతమంది వాయిస్తూ ఉంటారు.
"ఇంకా అందరూ నిద్రపోలేదు కనుక కొంతసేపయ్యాక రావణ అంతఃపురంలోకి వెళ్ళి చూస్తాను" అని హనుమంతుడు అనుకొని, బయటకి వచ్చి మళ్ళీ కొన్ని ఇళ్ళల్లోకి వెళ్ళి చూశాడు. ఆ ఇళ్ళల్లో ఉన్న రాక్షసులు లంకకి పూజ చేస్తూ శంఖాలు, భేరీలు, గంటలు మోగిస్తున్నారు. అక్కడ ఉన్న ఇళ్ళు చూసి ఇది ఇంద్రపురా, గంధర్వ నగరమా, పొరపాటున నేను స్వర్గలోకానికి వచ్చావా?. అసలు ఇంద్రుడికి ఎన్ని భోగాలు ఉన్నాయో అవన్నీ ఈ లంకా పట్టణంలో కనిపిస్తున్నాయి" అనుకున్నాడు.
అక్కడున్న ఇళ్ళల్లో ఎంత గొప్ప పండితుడైనా ఒక్క దోషాన్ని కూడా చూపలేడు. అంత అద్భుతంగా అక్కడి ఇళ్ళు ఉన్నాయి. దేవతలకి కూడా ఆ ఇళ్ళల్లోకి వస్తే పూజ చేసుకోవాలనిపిస్తుంది. అక్కడున్న కిటికీలు కూడా వజ్ర వైడుర్యాలతో అలంకరింపబడి చాలా అందంగా ఉన్నాయి. ఆ లంకా పట్టణం యొక్క శోభని హనుమంతుడు చాలా బలంతో చూశాడు (లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి, తాను వచ్చిన కార్యాన్ని మరిచిపోకుండా ఉండాలని, హనుమంతుడు ఆ నగరం యొక్క సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు సీతమ్మని కనిపెట్టాలనే విషయాన్ని మనస్సులో బలంగా పెట్టుకొని ఉన్నాడు). ఆ రాక్షసులు ఇళ్లన్నీ వెతికిన తరువాత హనుమంతుడు మెల్లగా రావణ అంతఃపురంలోకి ప్రవేశించాడు.
అప్పుడాయన రావణ అంతఃపురంలో ఉన్న పుష్పక విమానంలోకి ప్రవేశించాడు. (పుష్పక విమానాన్ని మొట్టమొదట విశ్వకర్మ నిర్మించి బ్రహ్మకి ఇచ్చాడు. కొంతకాలానికి కుబేరుడు బ్రహ్మని గురించి తపస్సు చేస్తే, బ్రహ్మదేవుడు కుబేరుడికి పుష్పక విమానాన్ని ఇచ్చాడు. కుబేరుడి తమ్ముడైన రావణుడు ఆయనని చావగొట్టి ఆ విమానాన్ని తెచ్చుకున్నాడు). ఆ పుష్పక విమానంలో కూర్చుని మనస్సులో ఒక ప్రదేశాన్ని ఊహించుకుంటే, అది వాళ్ళని కన్నుమూసి తెరిచేలోగా అక్కడికి తీసుకువెళుతుంది. ఆ పుష్పకానికి వజ్ర వైడుర్యాలతో నగిషీలు పెట్టబడి ఉంటాయి. అందులో సరోవరాలు, పద్మాలు, ఉద్యానవనాలు, బంగారంతో చెయ్యబడ్డ వేదికలు, కూర్చోవడానికి ఆసనాలు, పడుకోడానికి తల్పాలు, విహరించడానికి ప్రదేశాలు ఉంటాయి. అందులోకి ఎంతమంది ఎక్కినా, ఇంకా మనుషులు ఎక్కడానికి స్థలం ఉంటుంది.
అందులో ఉన్న తివాచి మీద ఈ భూమండలం అంతా చిత్రీకరించబడి ఉంది. ఈ భూమి మీద ఎన్ని పర్వతాలు ఉన్నాయో, అవన్నీ ఆ తివాచి మీద చెక్కబడి ఉన్నాయి. అలాగే ఏ పర్వతం మీద ఎన్ని చెట్లు ఉన్నాయో, అన్ని చెట్లు అందులో ఉన్నాయి. వాటితో పాటు ఆ చెట్లకి ఉన్న పువ్వులే కాకుండా ఆ పువ్వులలో ఉన్న కేసరములు కూడా చెక్కబడి ఉన్నాయి. దానికి కొంచెం పక్కనే లక్ష్మీదేవి పద్మములలో పద్మాసనం వేసుకొని, నాలుగు చేతులతో కూర్చున్నట్టుగా, రెండు ఏనుగులు బంగారు కలశములు పట్టుకొని, పద్మపు రేకులతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్టుగా అక్కడ ఒక చిత్రం ఉంది.
అప్పుడు హనుమంతుడు "మా అమ్మ ఇలాంటి స్థలంలో, ఇలా రాక్షసులతో మధ్యం సేవించి, ఆనందంగా ఉండదు. మా అమ్మ కన్నులవెంట వేడి నీరు కారుతూ వక్షస్థలం మీద పడిపోతూ ఉంటుంది, రాముడి చేత కట్టబడిన దీర్ఘమైన మంగళసూత్రం మా అమ్మ మెడలో మెరుస్తూ ఉంటుంది, మా అమ్మ కన్నులకు ఉన్న వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా ఉంటాయి, పరిపూర్ణమైన ప్రేమ కురిపించే కన్నులతో మా అమ్మ ఉంటుంది, వనంలో ఉన్న నెమలిలా మా అమ్మ ఉంటుంది" అనుకుంటూ, పుష్పక విమానం నుండి కిందకి దిగి, రావణాసురుడు పడుకున్న శయనాగారం వైపు వెళ్ళాడు.
◆వెంకటేష్ పువ్వాడ.