సీతమ్మ విషయంలో హనుమంతుడి పొరపాటు!

 

సీతమ్మ విషయంలో హనుమంతుడి పొరపాటు!

హనుమంతుడు నేరుగా రావణాసురుడు పడుకున్న మందిరానికి వెళ్ళాడు. ఆ మందిరంలో గోడలకి కాగడాలు పెట్టబడి ఉన్నాయి. ఆయన పడుకున్న తల్పము బంగారంతో చెయ్యబడింది, అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణములు ఎర్రటి బంగారంతో చెయ్యబడినవి, రావణాసురుడు పెట్టుకున్నవి బంగారంతో చెయ్యబడిన ఆభరణములు. గోడలకి ఉన్న కాగడాల నుండి వస్తున్న కాంతి, అక్కడ ఉన్న స్త్రీల ఆభరణముల నుండి వస్తున్న కాంతితో కలిసి, ఏదో మండిపోతుందా అన్నట్టుగా ఒక ఎర్రటి కాంతి ఆ ప్రదేశాన్ని ఆవరించింది. అక్కడ వెలుగుతున్న కాగడాలు అటూ ఇటూ కదలకుండా అలాగే నిలబడి వెలుగుతున్నాయి. ఆ కాగడాలని చూస్తుంటే, జూదంలో ఓడిపోయినా కాని ఇంటికి వెళ్ళకుండా, పక్కవాడి ఆటని దీక్షగా చూస్తున్న జూదరిలా ఉన్నాయి.

 అక్కడ పడుకున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని, ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేకుండా పడుకొని ఉన్నారు. అందరి ముఖాలు పద్మాలలా ఉన్నాయి. అలా కొన్ని వేల స్త్రీలు మదవిహ్వలులై, రావణాసురుడితో కామోప భోగాన్ని అనుభవించి, విశేషమైన మధ్యపానం చేసి, మత్తెక్కి, అలసిపోయి నిద్రపోతున్నారు. అక్కడ ఉన్న వేల స్త్రీలు తక్కువ జాతిలో జన్మించినవారు కాదు, ఎవరూ సౌందర్యం తక్కువైనవారు కాదు, ఇంతకముందు వేరొక పురుషుడిని పొందినవారు కాదు, నడువడి తెలియనివారు కాదు, వీళ్ళందరూ రావణుడిని కోరుకుని వచ్చినవారు.

రావణుడు పడుకున్న తల్పం బంగారంతో చెయ్యబడింది, దానికి వైడుర్యాలతో మెట్లు కట్టబడి ఉన్నాయి. పడుకుని ఉన్న రావణుడికి చామరం వేస్తున్న ఉత్తమమైన స్త్రీలు ఆ చామరంలోకి అనేకరకములైన పరిమళద్రవ్యాలని చేర్చి, జాగ్రత్తగా వీస్తున్నారు. ఆ తల్పం మీద, ఉత్తమమైన పరుపు మీద రావణుడు పడుకొని ఉన్నాడు. హనుమంతుడు రావణుడి తల్పం దగ్గరికి వెళితే, రావణుడి రోమ కూపాల నుండి కొడుతున్న బ్రహ్మతేజస్సు చేత హనుమంతుడు అవతలకి తొలగతోయబడ్డాడు. అప్పుడు హనుమంతుడు దూరంగా వెళ్ళి ఒక వేదిక మీదనుండి రావణుడిని చూస్తే, ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక నల్లటి మబ్బు భూమి మీదకి దిగిపోయి తల్పం మీద పడుకుంటే ఎలా ఉంటుందో, రావణుడు అలా ఉన్నాడు. ఆయన పెట్టుకున్న కుండలములు ప్రకాశిస్తున్నాయి. ఆయన అనుభవించి సుఖము చేత, తాగిన మధ్యము చేత తిరుగుడుపడుతున్న ఎర్రటి నేత్రములతో ఉన్నాడు. అరమోడ్పు కన్నులతో (సగం మూసిన కన్నులతో), పెద్ద చేతులతో, ఉత్తమమైన వస్త్రములు కట్టుకొని నిద్రపోతున్నాడు.

దేవేంద్రుడి వాహనమైన ఐరావతం తన దంతములచేత కుమ్మితే ఏర్పడిన గాయములు రావణుడి శరీరం మీద కనపడుతున్నాయి. అలాగే శ్రీ మహావిష్ణువు తన చక్రం చేత కొట్టినప్పుడు ఏర్పడిన మచ్చలు ఉన్నాయి, దేవేంద్రుడు తన వజ్రాయుధం చేత కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు కనపడుతున్నాయి. ఆ రావణుడు బాగా బలిసిన భుజాలతో ఉన్నాడు. ఆయన చేతి గోళ్ళు ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయి. ఆయన ఆ తల్పం మీద పడుకొని ఉన్న పాములా ఉన్నాడు, ఆయన చేతులు పరిఘలలా ఉన్నాయి. ఆయన చేతులకి ఉన్న వేళ్ళు రెండు అయిదు తలల పాముల్లా ఉన్నాయి.

తరువాత హనుమంతుడు అక్కడ పడుకొని ఉన్న స్త్రీలని వెతికాడు. అక్కడ పడుకుని ఉన్న స్త్రీలలో ఒకామె మృదంగాన్ని గట్టిగా పట్టుకొని పడుకుంది. ఒకామె వేణువు ఊదుతూ నిద్రపోయింది. ఒకామె వీణ వాయిస్తూ నిద్రపోయింది. ఒకామె పక్కన ఉన్న స్త్రీ మీద చీరని తీసి తన మీద దుప్పటిగా కప్పుకుంది. ఆ స్త్రీలు అక్కడున్న సంగీత వాయిద్యాలని గట్టిగా కౌగలించుకొని, వాటిని రావణుడిగా భావించి చుంబిస్తున్నారు. అక్కడ ఒక్క స్త్రీ ఒంటి మీద ఆభరణము కాని, వస్త్రము కాని సరిగ్గా లేదు. అలా పడుకొని ఉన్న స్త్రీలందరినీ హనుమంతుడు చూసుకుంటూ వెళ్ళాడు. రావణుడికి కొంత దూరంలో, బంగారు తల్పం మీద అపారమైన సౌందర్యపతి అయిన ఒక స్త్రీ పడుకొని ఉంది. ఆవిడ రావణుడి భార్య అయిన మండోదరి. ఆవిడని చూడగానే 'ఈవిడే సీతమ్మ' అని హనుమంతుడు అనుకొని, తన భుజాలని కొట్టుకుని, తోకని ముద్దు పెట్టుకుని, విచిత్రమైన పాటలు పాడి, పిల్లిమొగ్గలు వేసి, గెంతులు వేసి, స్తంభాల పైకి ఎక్కి, కిందకి దూకి తన కోతి బుద్ధిని బయట పెట్టుకున్నాడు. 

కొంతసేపటికి ఆయన  "మా అమ్మ సీతమ్మ, రాముడు పక్కన లేనప్పుడు ఇటువంటి పట్టు పుట్టం కట్టుకొని, పక్కన రావణుడు ఉండగా ఇంత హాయిగా నిద్రపోతుందా. అరరే నా బుద్ధి ఎంత వైక్లవ్యాన్ని పొందింది. ఈమె సీతమ్మ కాదు" అనుకొని ముందుకి సాగిపోయాడు.

◆వెంకటేష్ పువ్వాడ.