మహాతాత్త్వికుడు హనుమంతుడు
మహాతాత్త్వికుడు హనుమంతుడు
హనుమంతుడు శ్రీరామచంద్రునికి నమ్మినబంటు. రామయ్యకే కాదు, సీతమ్మకూ ప్రియమైన పుత్రుడే. సీత చల్లని తల్లి. వారి ప్రేమాభిమానాల గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఎంత వర్ణించినా తక్కువే. సీతామాతను సేవింప అనేకమంది దాసదాసీలున్నారు. ఆమె సంజ్ఞామాత్రముచే ఏమైనా జరిగిపోతుంది. కానీ, దానివలన ఆమెకు సంతోషం కలుగలేదు.
హనుమంతునికి స్వహస్తములతో వండి తినిపించవలెనని ఆమెకు కోరిక కలిగినది. వివిధ పక్వాన్నములు తయారయ్యాయి. భుజించుటకు హనుమంతుడు కూర్చున్నాడు. “తల్లి చేతివంట ఎంత మధురముగా నున్నది?” అనుకుంటూ అతడు సంతోషంగా తినసాగాడు. ఎంత తిన్నదీ అతనికి తెలీడంలేదు. చేసిన వంట అంతా పూర్తి కావచ్చిననూ అతడు విస్తరి వద్దనుండి లేవలేదు. జానకీమాత ఆశ్చర్య సాగరములో మునకలు వేస్తున్నది. ఏమీ తోచక శ్రీరాముని స్మరించినది. తక్షణమే ఆమెకి హనుమంతుని వేషములో స్వయముగా శంకరభగవానుడే భుజించుచుట కనిపించినది.
మహాకాలునికే కాలుడైన హనుమంతుని ఉదరము ఈ పదార్దాలతో నిండుతుందా? ఆమె శ్రద్ధాభక్తులతో హనుమంతుని స్తుతించింది. హనుమంతుని వెనుకకు వెళ్ళి అతని శిరస్సుపై “ఓం నమశ్శివాయ”అని రాసి, శేషించిన స్వల్ప పదార్థములు వడ్డించింది. దానితో అతడు సంతృప్తి చెందాడు. ఆ విధంగా సీతామాత కూడ హనుమంతుని శివావతార మూర్తిగా అంగీకరించింది.
CLICK HERE FOR MORE Hanuman Gallery
శ్రీరామచంద్రునికి హనుమంతుడే సమస్త ఉపచారాలూ చేస్తున్నాడు. మరెవ్వరికీ ఎంతమాత్రమూ అవకాశం ఇవ్వలేదు. సేవాకార్యము లన్నీ జాగ్రత్తగా నిర్వర్తిస్తున్నాడు. భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు కూడ రామచంద్రునికి సేవ చేయాలని తహతహలాడుచున్నారు. చివరికి వారందరూ కలిసి రఘునాథునికొక కొత్త దినచర్య ఏర్పాటు చేశారు. అందులో, భగవానునికి ఏ సేవను ఎవరు చేయాలి అనే విషయము నిర్ణయము కావాలి. మనమంతా సమయ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. హనుమంతునికి అవకాశం ఇవ్వకూడదు- అనుకుని, ఆ సంగతి రామునికి నివేదించారు.
శ్రీరాముని ద్వారా ఆ సంగతి విన్న హనుమంతుడు "మీరందరూ సమ్మతించిన విషయాన్ని నేనెలా కాదనగలను?” అన్నాడు.
చివరికి శ్రీరాముడు ఆవులించు సమయమున చిటికెలు వేసే పని ఆంజనేయునికి దక్కింది. అలా ఆంజనేయుడు చిటికెల ఆంజనేయుడు అయ్యాడు. నిరంతరము రామసేవ చేసుకోసాగాడు.
భరతశత్రుఘ్నాదులందరికీ శ్రీరామచంద్రుడు హనుమంతునే అత్యధికముగా ప్రేమిస్తున్నాడన్నభావం ఏర్పడింది. అది నిజం కూడా. వారేమైనా ప్రభువుకు చెప్పదలస్తే హనుమంతుని ద్వారానే చెప్పవలసి వస్తోంది. హనుమంతుడు స్వయంగా సీతారాములను అడిగి సందేహాలు తీర్చుకునేవాడు. జీవాత్మ పరమాత్మల విషయమై తత్వజ్ఞానాన్ని పొందేవాడు. శ్రీరాముడు హనుమంతునికి అనేకసార్లు తత్వజ్ఞానం ఉపదేశించేడు. వేదాంత రహస్యములు హనుమంతునికి సంపూర్ణముగా వివరించాడు. ఆధ్యాత్మ రామాయణమందలి ప్రాధమిక ప్రసంగములు ఇలాంటివే. కృష్ణావతారంలో భగవానుడు అర్జున, ఉద్ధవులకు ఉపదేశించినట్లు బ్రహ్మాండ పురాణంలో ఉంది. హనుమంతుడు ‘జ్ఞానమూర్తి’ అనడానికి అనేక ప్రమాణాలు ఉన్నాయి.
నిరంతరం తనను సేవిస్తున్న హనుమంతునితో శ్రీరాముడు – “హనుమంతా! నీవు నా స్వరూపానివి. ఇంతగా సేవ చేయవలసిన అవసరమేమున్నది? విశ్రాంతిగా ఎందుకు ఉండవు?” అని ప్రశ్నించాడు.
అందుకు బదులుగా “ప్రభూ! మీరన్నది నిజమే. అయితే, మీకు సేవ చేసినంత మాత్రాన నేను నీ స్వరూపం కాకుండా పోతానా? మీకు సేవ చేస్తుంటే కూడా నాకు విశ్రాంతి తీసుకుంటున్నట్లే ఉంటుంది. నేను మీ సేవకుడిని. నా శరీరం ఎప్పుడూ మీకు, అన్నివిధాలా ఉపయోగపడాలి. నా జన్మకు ప్రయోజనం అదే! ఇక నేను వినవలసింది, చెప్పవలసింది, ఏముంది ప్రభూ?!” అన్నాడు హనుమంతుడు.
హనుమంతుని తాత్విక దృష్టికి, నిరాడంబరత్వానికి ఎంతో సంతోషించాడు శ్రీరాముడు.
CLICK HERE FOR MORE Hanuman Gallery