శ్రీకృష్ణుని వైశిష్ట్యం!
శ్రీకృష్ణుని వైశిష్ట్యం!
శ్రీ కృష్ణుడు వసుదేవ నందనుడు. 'వాసుదేవ' అనే శబ్దం ఎంతో మధురమైనది. వాసుదేవ శబ్దాన్ని గురించి సంజయుడు ధృతరాష్ట్రునకు మహాభారత ఉద్యోగపర్వంలో ఇలా వివరిస్తాడు.
శ్వాసనాత్ సర్వభూతానాం వసుత్వాత్ దేవయోనిః ।
వాసుదేవస్తతో వేద్యో బృహత్త్వాత్ విష్ణురుచ్యతే ॥
ఆయన సమస్త ప్రాణులకు నివాస స్థానం అవడం వలన, దేవతలు అందరూ ఆయనలోనే నివసించడం వలన "వాసుదేవ" అనే నామం సార్ధకమైనదని సంజయుడు వివరిస్తాడు.
ఈయన సర్వవ్యాపకుడు కాబట్టి 'విష్ణువు' అనే పేరు కలిగిందని అంటాడు. క్రీ.పూ. 6వ శతాబ్ధం నుండి వాసుదేవ తత్త్వము భారత దేశములో ప్రచారానికి వచ్చింది. పాణిని ని, పతంజలిని వాసుదేవుని భగవత్ స్వరూపులుగా పేర్కొనిరి. భగవంతుని చరిత్ర కాబట్టి భాగవతమని కొందరు భావిస్తే, "భగవతి రతాః భాగవతాః" భాగవతులన విష్ణుభక్తులని, వారి చరిత్ర భాగవతమని మరికొందరు భావించారు.
దేవకీదేవి గర్భశుక్తి ముక్తాఫలమైన శ్రీ కృష్ణుని జీవిత ఘట్టాలను వివరించేది పై శ్లోకం. దానిని శ్రీకృష్ణ లీలామృతం అని కూడా పేర్కొన్నారు. బాల్యంలోనే పూతన జీవితాపహరణం. గోవర్ధనోద్ధరణం చేసిన ఉద్దండ పిండం మనం చిన్ని కృష్ణయ్యగా పిలుచుకునే కృష్ణ భగవానుడు. పెరిగి పెద్దయి, ధర్మ రక్షణకు దీక్షా కంకణుడై కంసాది రాక్షసులను సంహరించి కుంతీ కొడుకులను పాలించాడు. మధ్యలో ఎన్నో లీలలు. ఇవన్నీ కలిస్తే కృష్ణ తత్త్వమవుతుంది. "కృష్ణ శబ్దం ఋగ్వేదంలో కూడా కనిపిస్తుంది. అది విష్ణుతత్త్వ వివరణము.
"ఇంద్రస్య యుజ్యస్తఖా" అని అంటారు. దాని అర్థం ఏమిటంటే అతడు ఇంద్రునకు యుద్ధమున సహాయపడ్డాడు అని, ఇంద్రునకు స్నేహితుడు అని భావము. ఋగ్వేద వర్ణనలను గమనిస్తే ఇంద్రునిది నీలదేహమని వివరించారు. దానిని అనుసరించే బహుశా విష్ణువు యొక్క అవతారములగు రామావతారము తరువాత కృష్ణావతారములలో కూడా స్వామిది నీలదేహముగా వాల్మీకి, వ్యాసులచే వర్ణింపబదిందేమో అనిపిస్తుంది. విష్ణువు రక్షకుడుగా కీర్తింపబడే వేద మంత్రములలో అనేక చోట్ల 'గోప్త' 'గోప' శబ్దములు వాడబడటం గమనించవచ్చు. ఆ మంత్రాలే భాగవతాది పురాణములలో "గోపాలకుడు" గా వర్ణించారు.
ఛాందోగ్యము మొదలయిన ఉపనిషత్తులలో విష్ణువు దివ్య పురుషునిగా, సూర్యమండలాంతర్వర్తి అయిన పరమేశ్వర స్వరూపముగా వర్ణింపబడెను. అది విష్ణుతత్త్వము. తరువాత పురాణేతి హాసములలో ప్రసిద్ధమైన కృష్ణ తత్త్వమునకు అదే మూలమని భావించవచ్చును. ముండకోపనిషత్తులో "అగ్నిర్మూర్గా చక్షుషీ చంద్ర సూర్యౌ, దిశ శ్రోత్రే" వంటి ఇతర వర్ణనలు శ్రీ కృష్ణుని విశ్వరూప సందర్శన వర్ణనకు దగ్గరగా ఉండటం గమనింపదగినది. ఇతిహాసములలో భారతమునందు, పురాణములలో భాగవతమునందు, తరువాత కావ్యములలో ఎఱ్ఱన రచించిన, హరివంశము, మొదలగు గ్రంథములందు శ్రీ కృష్ణుని గాధలు చాలా గొప్పగా వర్ణించబడ్డాయి. అయితే భాగవతము దశమ స్కంధములో శ్రీ కృష్ణ జన్మ వృత్తాంత శైశవ క్రీడలు విస్తారముగా వర్ణింపబడ్డాయి.
నిజానికి శ్రీకృష్ణుని శైశవ క్రీడలు, ఆయన బాల్యమే చాలామందికి నచ్చుతుంది. ఆ బాల్య క్రీడలలో తెలిసీ తెలియకుండానే ఆయన దుష్ట శిక్షణ చేసిన విధం అందరి మనసులూ కట్టిపడేస్తుంది. మన్ను తిన్న చిన్నవాడిలా, వెన్న దొంగగా, గోకులాన్ని పావనం చేసే చిన్ని కృష్ణుడంటే అందరికీ చెప్పలేని తాదాత్మ్యం కలుగుతుంది. ఇదే కృష్ణుని బాల్యంలో ఉన్న అందం.
◆నిశ్శబ్ద.