మాట గొప్పదనం తెలిపే అద్భుత విశ్లేషణ!
మాట గొప్పదనం తెలిపే అద్భుత విశ్లేషణ!
మాట అనేది మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. మాట ఒక ఆయుధం అవ్వగలడు, అదే మాట కొన్ని సమస్యలకు పరిష్కారము అవ్వగలదు, అదే మాట మనిషిని దిగజారేలా చేయగలదు. చిన్నప్పటి నుండి పిల్లలకు ఒక శ్లోకం నేర్పుతారు.
'తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్
బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా
నుక్తుల్ సుశబ్దంబుల్ శో
భిల్లం బల్కుము'
అంటూ సరస్వతీమాతను మన మనస్సులో నిల్పి స్పష్టంగా మాట పలికేట్టు చేయాలని ప్రార్థిస్తాం. ఎందుకంటే సరస్వతి 'వీణా వరదండ మండితకర' అంటే చేతుల్లో వీణ యొక్క శ్రేష్ఠమైన దండం కలది.
ఒకానొక వాయువు కదలిక నాభీమండలంలో ఉదయించి, వెన్నుపూస వెంట ప్రయాణించి, కంఠం చేరటం వల్ల ముఖావయవాల కదలిక చేత వాక్కు ఏర్పడుతుంది. వేదంలో సరస్వతి అగ్ని నుంచి జనించినట్టుంది. వాయువు కదలిక వల్ల శరీరంలో జనించే అగ్ని, వాక్కు శక్తిరూపంలో బయల్పడుతుంది. అంతఃప్రపంచం వాక్కు రూపంలో వెలువడితే బయట ప్రపంచం ఏర్పడుతుంది. వాక్కు లేకపోతే ప్రపంచమే లేదు. అందుకే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సైతం సరస్వతిని పూజిస్తారు. అటువంటి సరస్వతీదేవి అనుక్షణం మన శరీరంలో నిలుస్తూ, వాగ్రూపంలో బహిర్గతమౌతుంది. అందుకే మనం మాట్లాడే ప్రతి మాటా ఒక రకమైన భగవదార్చన వంటిదే. ఈ నిజం గ్రహిస్తే వ్యక్తి ప్రతి చిన్న విషయానికీ నోరు పారేసుకోడు. అనవసరంగా మాట్లాడడు. అందుకే యోగులు మౌనంగా ఉంటారు. మితంగా మాట్లాడతారు. తమలోని శక్తిని అనవసరంగా వ్యర్థం చేసుకోరు. వారెప్పుడూ ధ్యానంలో ఉంటూ ఆ భగవంతుడిని జపం చేసుకుంటూ ఉంటే ఆ జప మంత్రం నుండే వారిలోకి శక్తి వచ్చి చేరుతుంది. అదే తపఃఫలంగా భావించబడుతుంది.
ఎక్కువగా మాట్లాడని వ్యక్తి మాట్లాడే ప్రతి మాటనూ ప్రతివారూ గౌరవంగా వింటారు. ఆ మాటలకు విలువనిస్తారు, ఎందుకంటే ఆ వ్యక్తి మాట్లాడే మాటలో ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా మాట్లాడని వారు ప్రస్తావనకు కూడా తీసుకుని రారు. అందుకే ఎక్కువగా మాట్లాడని వ్యక్తి మాట్లాడే మాటల్లో కేవలం మంచి విషయాలు, ఉపయోగకరమైన విషయాలు మాత్రమే ఉంటాయి.
బడబడా వాగేవాడికి విలువ ఉండదు. ఇది మనకు అనుభవమే. అలా మాట్లాడేవారు ఎక్కడైనా ఉంటే సున్నితంగా అపమని చెప్పేవాళ్ళు కొందరు ఉంటే అది భరించలేక అక్కడి నుండి తప్పుకుని వెళ్లిపోయేవాళ్ళు కొందరు ఉంటారు. మనం మాట్లాడే ప్రతి మాట భగవంతుడి అర్చన లాంటిది కాబట్టే పోతన 'శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ' అన్నాడు. 'నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని' అన్నాడు.
మాట పవిత్రతను అర్థం చేసుకున్న తరువాత పలు మాటల ప్రోదిని తయారు చేసుకోవటం ముఖ్యమైనది. ఇదెలా చేసుకోవాలి అనే సందేహం గనుక వస్తే దానికోసం దిక్కులు చూడాల్సిన అవసరం లేదు. ఉత్తమ గ్రంథాలను పఠించాలి. ఉత్తమ కావ్యాలను పఠించాలి. మంచి పద్యాలను కంఠోపాఠం చేయాలి. ప్రాచీనకవులు పదాలను ఎంత శక్తిమంతంగా వాడారో గ్రహించాలి. వారు రాసిన వాటిలో సాహిత్యం మాత్రమే కాదు, భాష, ఆధ్యాత్మికత, అంతర్లీనంగా గొప్ప విషయం దాగుంటాయి.
◆నిశ్శబ్ద