ధ్యానానికి, దేవుడి పూజకు శుభ్రత అవసరమా!
ధ్యానానికి, దేవుడి పూజకు శుభ్రత అవసరమా!
దేవుడి పూజకు, ధ్యానానికి శారీక శుభ్రత అవసరమే లేదు, మానసికంగా శ్వచ్చత ఉంటే సరిపోతుందని కొందరు వాదిస్తారు. అయితే మనం సాధారణంగా పూజ గదిలోకి స్నానం చేసి, ఉతికిన బట్టలు ధరించి వెళతాం. పూజ గది లేకపోతే గదిలోనే ఒక భాగం ప్రత్యేకంగా కేటాయించుకుంటాం. అలా చేయడం వల్ల మూడు నెలల కాలంలో కొన్ని ఆధ్యాత్మిక తరంగాలు ఉత్పాదితమ అక్కడకు వెళ్ళిన ప్రతిసారి ఒక ఉత్తుంగ భావం జనిస్తుంది. మీరు ఆ గదిలో ఏమి చేసినా సరే, చివరకు నవ్వినా, విలపించినా, ఆ పనిని భగవంతునితో అనుసంధానం చేసేందుకు ప్రయత్నించండి. ఆ విధంగా, మీరు ఆ గదిలో ప్రవేశించినప్పుడు, మీకు తెలియకుండానే ఏదో స్ఫూర్తి పొందుతారు.
స్నానం చేస్తే ఒక పవిత్రభావం జనిస్తుంది. వీలు కాకపోతే ఫరవాలేదు. శారీరక శుభ్రత ఎలాగున్నా, భగవంతుణ్ణి స్మరించేటంత పవిత్ర భావం కలిగి ఉండాలి. ఎంతో కొంత శారీరక శుభ్రత మాత్రం ఆవశ్యకం. ఉదయం లేవగానే భగవంతుని స్తోత్రాలు, నామాలు ఉచ్చరించండి. నిద్ర లేచిన వెంటనే సమయం అంతా మీ అధీనంలోనే ఉంటుంది. సంధ్యాకాలం కొంచెం కష్టం. ఎందుకంటే, ఆఫీసులో రాత్రి వరకు పని చేయవలసి రావచ్చు. లేదంటే, ఇంటికి బంధుమిత్రులు, అతిథులు రావచ్చు. కనుక సాయంత్రం ఎప్పుడు ధ్యానం చేయగలమన్నది కొంచెం అనిశ్చితం. ఏది ఏమైనా, కనీసం ఇరవై నిమిషాలు ఇందుకు వినియోగించాలి సుమా!
ఉదయం, సాయంత్రం ధ్యానం హడావిడిగా కాక ప్రశాంతంగా చేయాలి. ధ్యాన సమయంలో మనస్సు అతి చంచలంగా ఉంటే, జపం చేయాలి. . మంత్రం కనీసం 108 సార్లు జపించాలి. లేకపోతే చాంచల్యం అధికమవుతుంది. జపం, ధ్యానం చేయాలని ఉన్నా, లేకపోయినా చేయవలసినదే.
ధ్యానం కన్నా జపం సులభం. ఒక అరగంట ధ్యానం చేసినా, చాంచల్యం తగ్గకపోతే ఏదైనా పవిత్ర గ్రంథం చదవాలి.
మనస్సును మరీ నిర్బంధించకూడదు. దాన్ని బుజ్జగించాలి. అనునయించాలి. క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే, మనస్సు త్వరగా ఏకాగ్రమవుతుంది. మీకు భోజనానికి ఒక వేళ ఉంటుంది. ఆ సమయానికల్లా మనస్సు 'తిందాం' అంటుంది కదా! ఆ విధంగానే ప్రతి దినం ఒకే సమయానికి ధ్యానానికి ఉపక్రమిస్తే, మీ దేహం, మనస్సు చక్కగా సహకరిస్తాయి. ధ్యానం చేయాలనే ఆశ ఉండీ, ధ్యానం చేయలేక, మనస్సును నిలపలేక సతమతమయ్యే వారు పైన చెప్పుకున్న విషయాలను గుర్తుంచుకోవాలి. ఇలా చేస్తే ధ్యానం, దాని వల్ల అద్భుత ఫలితాలు సొంతమవుతాయి.
*నిశ్శబ్ద.