చౌడేశ్వరి దేవి ఆవిర్భవించింది ఈ ముని కోసమే...
చౌడేశ్వరి దేవి ఆవిర్భవించింది ఈ ముని కోసమే...
ఈ లోకాలను పాలించే శక్తిని స్త్రీ మూర్తిగా అభివర్ణిస్తూ లోకానికి రక్షణ ఇచ్చి, దుష్టులను శిక్షించే అమ్మగా అందరూ కొలుస్తారు. ఈ స్త్రీ అవతార రూపాలు చాలా ఉన్నాయి. మహావిష్ణువు తన దశావతరాలతో ఈ లోకాన్ని ఎలా ఉద్ధరించాడో.. అలాగే అమ్మవారు కూడా వివిధ రూపాలలో ఆవిర్భవించింది. వాటిలో ముఖ్యంగా చౌడేశ్వరి దేవి రూపం చాలా ప్రముఖమైనది. శక్తి దేవతలలో ఒకరిగా ఉండే చౌడేశ్వరీ దేవి గురించి, ఆ అమ్మ ఆవిర్భావం గురించి, ఆ సమయంలో దేవల మహర్షి కాలగతుల గురించి తెలుసుకుంటే…
ఆషాఢ అమావాస్య అర్ధరాత్రి అంత్యకాలములో శ్రీ చౌడేశ్వరీదేవి ఆవిర్భవించింది. ఈ అమ్మ శ్రీ దేవల మహర్షి వివాహానికి ముందే అవతరించినది. దేవలుని వివాహము శ్రీ రుధిరోద్గారి నామ సంవత్సర వైశాఖ మాసం. దీనికి ముందరి సంవత్సరమైన కాళయుక్తి సంవత్సర ఆషాఢమాస అమావాస్య అర్ధరాత్రి సమయంలో చౌడేశ్వరీ దేవి ఆవిర్భవించినది. ఆమె ఆవిర్భవించినప్పుడు ఆమె కిరీటము వెదజల్లు కాంతికి రాక్షసులు స్థంభించిపోయారు. అమ్మవారి ఆవిర్భావమునకు 7 గ్రహములు కర్కాటక రాశిలోనే ఉన్నాయి. ఇది సృష్టిలోనే అద్భుత విషయం. మొదలు, చివరి గ్రహాల మధ్యలో 7 గ్రహాలు స్తంభించిపోగా అవన్నీ కర్కాటక రాశిలోనే ఉండిపోయాయి.
అప్పుడు ప్రసన్నురాలైన ఆ మహాదేవిని దేవలముని ఎంతో భక్తిపూర్వకంగా స్తుతించాడట. ఆయన ఆ అమ్మను స్తుతించిన విధానము ఎలా ఉందంటే…
"అన్ని లోకముల వారిచే పూజింపబడు ఓ లోకనాయాకీ నీకు నమస్కారము. శివుని దేహంలో సగభాగము కలిగిన ఓ దుర్గా చండికా నీకు నమస్కారము. పుణ్యమూర్తివైన అమ్మా! నీకు నమస్కారము. సర్వేశ్వరివి అయిన దేవీ! నీకు నమస్కారము. దైత్యులను సంహరించునట్టి దేవీ! నీకు నమస్కారము. పాపాత్ములగు ఈ రాక్షసులను జయించు. నన్ను కాపాడు తల్లీ! భక్తవత్సురాలా! నీకు నమస్కారము తల్లీ.." అని భక్తిపూర్వకంగా అమ్మను వేడుకోగా.. ఆ దేవి "దేవలా! నాయనా! నీవు భయపడవద్దు, ఒక ముహూర్తములోపల అనగా 24 నిముషములు లోపల నా బలము నీకు తెలుస్తుంది అని ఓదార్చింది.
అప్పుడు చౌడేశ్వరి దేవి ఈ విధముగా చెప్పినట్టు దేవల మహర్షి చరిత్రలో ఉంది.
"నా ఈ మహాశూలముచేత ఈ దుర్మార్గులైన రాక్షసులను అందరినీ కొట్టెదను. కొందరిని తరిమి వేస్తాను. కొందరిని సంహరిస్తాను. వాళ్ళ అంతు చూసి వారి రక్తమును త్రాగుతాను" అని చెప్పింది.
అమ్మవారు నాలుగు భుజములతో పెద్ద నాలుక కలిగి, ఎంతో ఎరుపెక్కిన కన్నులతో మహా బలముగల ఆ దేవి హహ్హహ్హ అని అట్టాట్టహాసము చేస్తూ. శూలము, చక్రము, గద ఖడ్గమును చేతబట్టి భయంకరమైన ఆయుధములను కలిగి ఉంది. అమ్మవారు కాటుకవంటి మిక్కిలి నలుపు వర్ణముగల శరీరము కలిగి కోటి సూర్యుల కాంతిని ఇచ్చే కిరీటమును శిరస్సున ధరించి ఆ రాక్షసులను ధ్వంసం చేయుటానికి తన శూలమును త్రిప్పుతూ ఉంటుంది.
ఎంతో ఉగ్ర రూపములో వున్న చండికను చూచి ఈ మహా శక్తితో పోరు తమకు అసాధ్యమని గ్రహహించలేకపోయారు రాక్షసులు. ఏ విధముగానైనా ఆ చండికా మహాశక్తిని నాశనము చేయాలని తలంపు కలిగి వుండుట వలన వారి వద్దనున్న సకల ఆయుధములను సేకరించుకొని యుద్ధానికి సిద్ధపడిరి. అయితే ఆ మహాశక్తి ముందు రాక్షసుల ఆటలు సాగలేదు.
◆నిశ్శబ్ద.