సూర్యారాధన చేస్తే కలిగే అద్భుత ఫలితాలు ఇవే..
సూర్యారాధన చేస్తే కలిగే అద్భుత ఫలితాలు ఇవే..
ఆది దేవుడు అని, ప్రత్యక్ష దైవమని సూర్యుడిని పిలుస్తారు. లోకానికి అంతటికీ వెలుగు ప్రసాదించి జీవుల ఉనికికి కారణం అవుతున్నది సూర్యుడే.. సూర్యుడిని దేవుడిగా కొలిచే ఆచారం కేవలం మన భారతదేశంలోనే కాకుండా మరికొన్ని దేశాలలో కూడా ఉంది. అయితే భారతీయులు సూర్యుడికి ఇచ్చే ప్రాధాన్యత, సూర్యుడి ప్రాముఖ్యత చాలా గొప్పవి. సూర్యుడి గురించి ఓ శ్లోకం ఇలా ఉంటుంది..
గ్రహనక్షత్ర యోగాశ్చరాశయః కరణానిచ
ఆదిత్యా వసవో రుద్రా అశ్వినౌ వాయు వోనలః శక్రః ప్రజాపతిః సర్వే భూర్భువః స్వస్థ దైవచ
లోకాః సర్వేనగాః సరితః సాగర స్తథాః
భూత గ్రామస్య సర్వస్య స్వయం హేతు ర్దివాకరః
గ్రహాలు, నక్షత్రాలు, రాసులు, వసు, రుద్ర, ఆదిత్య, అశ్వినులు, వాయువు, అగ్ని, ఇంద్రుడు, ప్రజాపతులు, వ్యాహృతలు, సమస్తలోకాలు, పర్వతాలు, సర్పాలు, భూమి, నదులు, సముద్రాలు, జీవులు, గ్రామాలు, మొదలైనవన్నీ ప్రత్యక్ష పరమేశ్వర స్వరూపుడైన శ్రీ సూర్యభగవానుడే!
సూర్యుణ్ణి ఆరాధించే పద్ధతులెన్నో ఉన్నాయి. అర్చన, జపం, ప్రదక్షిణ, నమస్కారం, అర్ఘ్యం, ధ్యానం, నిష్ఠ అనే ఆరు పద్ధతుల ద్వారా సూర్యుణ్ణి ఆరాధించి కృతకృత్యులు కావచ్చు. సూర్య భగవానుడు ప్రత్యక్ష త్రిమూర్తి స్వరూపుడు. ప్రతి రోజూ వేళ తప్పకుండా జపం, అర్ఘ్యం, ప్రదక్షిణం, నమస్కారం, స్తోత్రం సూర్య ప్రీతిగా నిర్వహించే వారికి సర్వకార్యాలూ సిద్ధిస్తాయి.
దేహారోగ్యానికి సూర్యారాధనను మించినది వేరే లేనే లేదు. ఆయుర్వేదం ఇదే విషయాన్ని నొక్కి చెబుతుంది. 'ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్' అని సూక్తి. ముఖ్యంగా నేత్ర రోగాలకు సూర్యారాధన దివ్యౌషధం. పురుషులతోపాటు స్త్రీలు కూడా సూర్యారాధన చేయవచ్చు. అయితే దీన్ని పగలే చేయాలి. ఇంటి మధ్యభాగంలో ఈశాన్య, ఆగ్నేయాలలో ఏదో ఒక చోటున సూర్యార్చన చేయవచ్చు. 40 రోజులు కానీ, 20 రోజులు కానీ, లేదా 12 దినాలు కానీ నిర్వహించవచ్చు.
సూర్య నమస్కారాలు ప్రతి దినం చేసేవారికి అన్ని వ్యాధులూ నివారణ అవుతాయి. పవిత్రులైన విప్రులు మూడు వేళలా జరిపే గాయత్రీ మంత్ర జపానికి మూలదైవం సవితా రూపుడైన సూర్య భగవానుడే. సంధ్యావందనానికి ఉన్న ప్రాశస్త్యం ఏమిటంటే అందులో సూర్యోపాసన ప్రాముఖ్యం వహించింది. సూర్యుడు ఉన్నంతసేపూ జీవితం ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆయన కనుమరుగైతే సంభవించే చీకటి భయ కారణం.
వనవాసం చేస్తున్న ధర్మరాజు సూర్యుణ్ణి ప్రార్థించి ఎప్పటికీ ఖాళీ కాని అక్షయపాత్రను పొందాడు. సకల శత్రువులను సంహరించేలా వేయి సంవత్సరాలు సూర్యభగవానునిచే నిర్మితమైన చక్రాయుధాన్ని శ్రీమహావిష్ణువు పొందాడు. ఆ చక్రమే కాలచక్రంగా పేర్కొనబడింది.
ఉత్తరాయనంలో సూర్యుడు బలవంతుడు అవుతాడు, కనుక అది అన్ని కార్యాలకూ శుభప్రదం, పుణ్యప్రదం. సూర్యార్చన వల్ల పూర్వజన్మ పాపకర్మలన్నీ నశిస్తాయి. సమస్త వ్యాధులూ నివారింపబడి, ఆరోగ్యం సమకూరుతుంది. మనోభీష్టాలు నెరవేరతాయి. అపమృత్యు భయం ఉండదు. ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలు అంతరిస్తాయి. విజ్ఞానాభివృద్ధికీ, సుఖ, సంతోషాలకూ సూర్యార్చన అత్యంత విశిష్టమైనది. కాబట్టి సూర్యుడిని ప్రతిదినం ఎంతో భక్తిపూర్వకంగా ఆరాధిస్తే జీవితానికి మంచి మార్గం లభిస్తుంది.
◆నిశ్శబ్ద.