తంత్రమంటే నిజమైన అర్థమేమిటి??
తంత్రమంటే నిజమైన అర్థమేమిటి??
తంత్రం అనగానే చాలామంది ఉలిక్కిపడతారు. అదేదో అందరికీ చేటు చేసేది అనేది భయపడతారు. అదే అభిప్రాయాన్ని అన్ని చోట్లా వ్యక్తం చేస్తారు. కానీ తంత్రానికి అసలైన అర్థం చాలామందికి తెలియదు.
తంత్రమనే మాట ఎంతో ప్రాచీనకాలం నించీ ఉపయోగించబడిన పదం. నిఘంటువులు ఈ పదానికి చాలా అర్థాలు ఇచ్చాయి. తన్యత ఇతితంత్రం - తనువిస్తారే, విస్తరించబడునది అని వ్యుత్పత్తి ప్రధానంగా ఉంది. దీనికి సిద్ధాంతం, నూతి పడుగు, పరివారము అని అమరకోశం అర్ధాలిస్తుంది. ఇక 'వైజయంతీ నిఘంటువు' మాత్రం స్వరాష్ట్ర చింత అన్న అర్ధం ఇచ్చింది. ఈ అర్థాన్ని బట్టే 'స్వతంత్రము' మొదలైన శబ్దాలు ఉపయోగించబడు తున్నవి. భారతం ఆదిపర్వంలో ఒక దృశ్యం తంత్రంగా చెప్పబడింది.
ఉదంకుడనే మహర్షి గురుపత్ని కోరిన ప్రకారం పౌష్య మహాదేవి కుండలాలు తెస్తూ త్రోవలో తక్షకుడు వాటిని ఆపహరించగా వాడి వెంటబడి పాతాళానికి వెళ్లాడు. అక్కడ సితాసిత తంతు సంతానపటము నేస్తున్న యిద్దరు స్త్రీలను, ద్వాదశారచక్రము తిప్పుతున్న ఆరుగురు కుమారులను, అతి ప్రమాణతురగా రూఢుడైన ఒక దివ్యపురుషుణ్ణి చూచాడు. అదంతా ఒక దేవతా రహస్యం దాన్ని ఒక గొప్ప తంత్రంగా వ్యాసుడు వర్ణించాడు. ఈ విధంగా ఈ శబ్దం ఎంతో విశిష్టతను సంతరించుకొన్నది. అంటే మరొక కోణంలో ఆలోచిస్తే.. రహస్యం నిఘోడంగా మిలితమైపోయిన దాన్ని తంత్రం అని చెప్పవచ్చు.
మంత్రశాస్త్ర విశేషాలను చెప్పే గ్రంధాలు ఎన్నో ఉంటాయి. అలాంటి చాలా గ్రంథములకు తంత్రములు అనే పేరే పెట్టబడింది. ఎందుకంటే మంత్రాలలో ఉన్న రహస్యం అలాంటిది అని పురాణం పండితులు కూడా విశ్లేషణ ఇస్తారు. మంత్రాన్ని సిద్ధి పొందటానికి అవసరమయ్యే సామాగ్రి అంతా తంత్రం కిందికే వస్తుంది. చాలావరకు తంత్రంలో మంత్ర సిద్ధి పొందడానికి పూజలు, హోమాలు కూడా చేయాల్సి ఉంటుంది. వీటి కోసం మూలికలు, హోమద్రవ్యాలు, కుండ విశేషాలు, తర్పణవస్తువులు, వాటిని ఉపయోగించే విధానాలు ఇవన్నీ తంత్ర విధానంలోనే చెప్పబడి ఉంటాయి.
అందుకే చాలామంది మంత్రాలు చదువుతూ ఏదైనా పూజ లేదా హోమం చేస్తూ ఉన్నప్పుడు తంత్రమని చెప్పి భయపడుతూ ఉంటారు. అయితే తంత్రమనేది చెడ్డది కాదు. దీనివల్ల మంత్రసిద్ది, మంత్రం సిద్ధి వల్ల కొన్నిరకాల శక్తులు లభిస్తాయి. వీటిని సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే ఎంతో గొప్పపని చేసినవారు అవుతారు. కనుక ఇక్కడ తంత్రమనేది మంత్రసంబంధమైన సిద్ధిసాధనాలను వివరించే ప్రక్రియగా భావించవచ్చు. ప్రాచీన మంత్ర శాస్త్రవేత్తలు ఏ అర్థంలో ఉనయోగించారో ఆ అర్థాన్నే అనుసంధానించవచ్చు.
శాస్త్ర గ్రంథాలలో తంత్రశాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఇవ్వబడింది.
విష్ణుర్వరిష్ణో దేవానాం ప్రదానా ముదధిస్తధా
నదీనాంచ యథాగంగా పర్వతానాం హిమాలయః అశ్వత్థః సర్వవృక్షాణాం రాజ్ఞామింద్రోయధావరః తథా సమస్తశాస్త్రాణాం తంత్రశాస్త్రమనుత్తమం సర్వకామప్రదం పుణ్యం తంత్రం పై వేద సమ్మితం.
అని శాస్త్ర గ్రంథాలలో నిర్వచించారు.
దేవతలలో విష్ణువువలె, హ్రదములలో సముద్రము వలె, నదులలో గంగ వలె, కొండలలో హిమవంతము వలె, చెట్లలో రావివలె రాజులలో ఇంద్రునివలె, సమస్త శాస్త్రములలో తంత్రశాస్త్రము. శ్రేష్ఠమైనది, వేదసమ్మతమైనది. అని అర్థం. అంటే వేదాలు మంత్రాలతో నిండి ఉన్నవి, అంటే అవి కూడా తంత్రాల కోవలోకే వస్తాయి. అలాంటప్పుడు వాటిని చెడ్డవి అని అనలేం కదా. కాబట్టి తంత్రాలు అంటే మంత్ర సంబంధమైన సిద్ధి పొందడానికి మార్గాలు.
◆నిశ్శబ్ద.