శ్రీకృష్ణుడి జననానికి ముందు జరిగింది ఇదే!

 

శ్రీకృష్ణుడి జననానికి ముందు జరిగింది ఇదే!

దేవకీ వసుదేవుల పెద్దకొడుకు కీర్తిమంతుడు. వసుదేవుడు ఆ పసివాడ్ని. పుట్టినవెంటనే తీసుకువెళ్ళి కంసుడికి అప్పగించాడు. వసుదేవుని సత్యనిష్టకు సంతోషించి 'బావా! ఇతనివల్ల నాకు కలిగే అపాయమేమీ లేదు. వీడిని నువ్వు  తీసుకువెళ్ళు, మా సోదరికి కలిగే ఎనిమిదవ పిల్లవాడ్ని మాత్రం నాకు అప్పగిస్తే చాలు. అతడ్ని చంపి నేను నా చావును తప్పించుకుంటాను' అన్నాడు కంసుడు.

ఆ తరువాత ఒకసారి నారదుడు కంసుడి మందిరానికి వెళ్ళి వ్రేపల్లెలో వున్న నందుడూ అతని భార్యలూ, పుత్రులూ, బంధువులూ, వసుదేవాదులూ దైవాంశ సంభూతులనీ, విరాట్పురుషుడు వాసుదేవుడు రాక్షసులను సంహరించేందుకు దేవకి గర్భాన పుట్టబోతున్నాడనీ చెప్పాడు.

దాంతో కంసుడు కలవరపడ్డాడు. నేరుగా వెళ్ళి దేవకీ వసుదేవులను పట్టి బంధించాడు. అంతవరకు వాళ్ళకు కలిగిన బిడ్డలు ఆరుగురినీ నిర్దాక్షిణ్యంగా కత్తికి ఎరవేశాడు. యాదవుల మీద పగ పెంచుకుని యదుభోజాంధకులకు అధిపతి అయిన తన తండ్రి ఉగ్రసేనుడ్ని చెరసాలలో పెట్టి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. బాణుడు, భౌముడు, కేశి, ధేనుకుడు, బకుడు, ప్రలంబుడు, చాణూరుడు, ముష్టికుడు, పూతన, అరిష్టుడు వంటి క్రూరరాక్షసులు కంసుడికి అనుచరులయ్యారు. వాళ్ళందరూ కలిసి యాదవులను అనేక రకాల హింసించారు. ఆ బాధలు భరించలేక చాలామంది మధురాపురాన్ని వదలి నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల దేశాలలో తలదాచుకున్నారు. కొందరు కంసుడితో సఖ్యంగా వుంటూ అతనిని ఆశ్రయించి బతికారు.

దేవకి ఏడవసారి గర్భవతైంది. హరి అంశతో అనంతుడు దేవకీదేవి గర్భాన ప్రవేశించాడు. శ్రీహరి యోగమాయను పిలిచి 'భద్రా! దేవకీ వసుదేవులను కంసుడు అమితంగా బాధపెడుతున్నాడు. ఇప్పటికే వాళ్ళ బిడ్డలు ఆరుగురిని పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు అనంతుడు దేవకి గర్భాన వున్నాడు. అతనక్కడ పుట్టటం అపాయకరం. నందగోకులంలో వసుదేవుని మరో భార్య రోహిణి వుంది. దేవకి గర్భంలో అనంతుడనే పేరుతో వున్న నా తేజాన్ని రోహిణి గర్భాన ప్రవేశపెట్టు. నేను దేవకికి అష్టమగర్భాన నా నిజ అంశతో జన్మిస్తాను, అప్పుడు నువ్వు నందగోపుని భార్య అయిన యశోదకు కూతురుగా ప్రభవిస్తావు. నా మాట మేరకు వసుదేవుడు నన్ను యశోద వద్దకు చేర్చి, యశోద గర్భాన జనించిన నిన్ను దేవకికి పాపను చేస్తాడు' అని చెప్పాడు..

యోగమాయ శ్రీహరికి వినయంగా నమస్కరించి భూలోకానికి చేరింది. దేవకి గర్భంలోని అనంతుడి అంశను రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. ఆ వెంటనే దేవడికి గర్భం చ్యుతమయింది. అనంతుడి అంశతో రోహిణికి బలరాముడు జన్మించారు.

తరువాత కొంతకాలానికి భూభారాన్ని తొలగించేందుకు శ్రీమన్నారాయణుడు దేవకీదేవి గర్భాన ప్రవేశించాడు. దేవకీదేవికి అది అష్టమగర్భమన్న విషయం. కంసునికి స్ఫురణకు వచ్చింది. అశరీరవాణి పలుకులు యధార్థం కాబోతున్నాయని గ్రహించి నిలువెల్లా కంపించాడు. చెల్లెల్ని చంపటమా?? మానటమా?? అన్న సంశయం కూడా కలిగింది. ఆడదాన్ని వధించడమే పాపం.. అందులోనూ చెల్లెల్ని, పైపెచ్చు నిండు చూలాలిని చంపటంవల్ల సర్వసంపదలూ హరిస్తాయి కీర్తి నశిస్తుంది. స్త్రీ హత్యాపాతకానికి పాల్పడ్డవాడు బతికి వుండి కూడా చచ్చినవాడుగానే పరిగణింపబడతాడు' అని తలచి చెల్లెల్ని చంపకూడదని నిర్ణయించుకున్నాడు. దేవకికి ఈసారి పుట్టబోయే పిల్లవాడ్ని మాత్రం పురిటిలోనే చంపాలని తీర్మానించుకున్నాడు. అప్పటినుంచీ అనుక్షణం అప్రమత్తంగా వుండటం ప్రారంభించాడు.

దేవకికి నవమాసాలూ నిండాయి. ప్రసవసమయం ఆసన్నమైంది. అది గ్రహించిన బ్రహ్మరుద్రాదులూ, నారదాది మహర్షులూ దేవకీవసుదేవులు ఉన్న చెరసాలవద్దకు వెళ్ళి దేవకీగర్భస్థుడైవున్న శ్రీహరిని అనేక విధాల ప్రస్తుతించారు. దేవకీదేవిని ఉద్దేశించి 'అమ్మా! సాక్షాద్భగవంతుడు శ్రీహరి అనతికాలంలోనే నీకు కుమారుడై జన్మించబోతున్నాడు. కంసాది రాక్షసులను సంహరించటానికీ, యాదవులను రక్షించడానికీ, సర్వలోకాలకూ మేలు చేకూర్చడానికి శ్రీమన్నారాయణుడు నీ గర్భాన ఉదయించబోతున్నాడు. నువ్విక నిశ్చింతగా వుండు తల్లీ' అని దీవించి వెళ్ళారు.

ఆ తరువాత కొద్దిరోజులకే శ్రావణ బహుళంలో రోహిణీ నక్షత్రాన అష్టమి రోజున శ్రీమన్నారాయణుడు చిన్నికృష్ణుడై దేవకి గర్భాన జన్మించాడు. ఆ సమయంలో పుడమి పులకించింది. దేవ దుందుభులు మోగాయి. అప్సర కన్యలు నాట్యం చేశారు. దేవతలు పూలవాన కురిపించారు. ఇదీ కృష్ణుడి జననం..

                                 ◆నిశ్శబ్ద.