Read more!

అనఘాస్టమీ వ్రతం ఏ రోజుల్లో చేయాలి ?

 

అనఘాస్టమీ వ్రతం ఏ రోజుల్లో చేయాలి ?

 

 

అనేక రూపాలు ధరించే గురుదత్తాత్రేయునకి ఒక గృహస్త రూపం కూడా ఉంది . అటువంటి గృహస్త రూప దత్తునకే "అనఘస్వామి" అని పేరు . ఆ స్వామి అర్ధాంగికి "అనఘాదేవి" అని పేరు.ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. అనఘాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనఘస్వామిలో  బ్రహ్మ, రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. అనఘుడు విష్ణు స్వరూపుడు, అనఘాదేవి లక్ష్మి స్వరూపము. ఈ దంపతులిద్దరూ నిత్యమూ తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు (అణిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం, కామావసాయితా, మహిమా) పుత్రులై అవతరించారు.

 

 

అనఘాదేవి యోగేశ్వరి, జగన్మాత, యోగంలో ప్రీతి గలది. గృహం, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది. కవితా శక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకే "మధుమతి" అనే పేరు కూడా ఉంది. ఈమె అనఘస్వామి భ్రూమద్య నుండి ఉద్భవించినది. దత్తాత్రేయుడు అనఘను వామభాగంలో ధరించి ఉన్న శాక్త రూపము . "అఘము" అంటే పాపము, ఇది మూడు రకాలు. అనఘము అంటే ఆ మూడు రకాల పాపాలను నశింపజేయడం. అనఘాస్టమీ వ్రతానికి ముఖ్యమైన రోజు మార్గశీర్షమాస కృష్ణపక్ష అష్టమి. ఈ రోజున ప్రతీ సంవత్సరం ఈ వ్రతం చేయడం చాల మంచిది .

 

 

అలాగే ప్రతీ నెలా కృష్ణపక్ష బహుళఅష్టమి రోజు కుడా చేయవచ్చు. ఈ వ్రతం ప్రతీ సంవత్సరం చేసుకొనే వారికి మూడురకాల పాపాలు తొలగి వారు "అనఘులు" గా అవుతారు. కాబట్టే ఈ వ్రతాన్ని "అనఘాస్టమీ వ్రతం" అంటారు. ఇది పురాణ ప్రసిద్ధమైన వ్రతం. వ్రత పీట తూర్పు ఈశాన్య దిక్కులో ఉండాలి. భందుమిత్ర సమేతంగా ఈ వ్రతం చేస్తే ఉత్తమం. వ్రత పూజ పూర్తైన తరువాత ఐదు అధ్యాయాల కధలను చదవాలి, వాటిని అందరూ శ్రద్ధతో వినాలి. ప్రతి అధ్యాయానికి చివర హారతి, కొబ్బరికాయ మరియు నైవేద్యం సమర్పించాలి.

 

 

స్వామివారికి నైవేద్యంగా వివిధ ఫలాలు, పంచకర్జాయం అర్పించవచ్చు. మహా నై వేద్యం (ఎవరు ఏదైతే తింటారో అదే మహా నై వేద్యం) కూడా సమర్పించవచ్చు. వ్రతం పూర్తైన మరుసటి రోజు స్వామివారిని  అర్చించి రూపాలను, మిగిలిన పూవులు, ఆకులను నదినీటిలో గాని , చెరువులో గాని విడవాలి. శ్రీ పాదుల వారు తమ భక్తులను ఈ వ్రతం ఆచరించ వలసిందిగా చెప్పేవారు. అనఘాస్టమీ వ్రతం గురు,శుక్ర మూఢమి రోజులలో కూడా చేసుకోవచ్చు. పనసచెట్టు లో అనఘ-దత్తాత్రేయులవారు వారి పుత్రులైన అష్టసిద్దులతోగూడి ఉంటారు. కాబట్టి అనఘాస్టమీ వ్రతం పనసచెట్టు క్రింద చేస్తే ఎంతో ప్రసస్థము.

పంచకర్జాయ ప్రసాదం తయారి విధానము:

కావాల్సిన పదార్ధాలు: 1.ఎండు కొబ్బరి 2. శోంఠి  3. నాలుగు పిప్పళ్ళు  4. మోడి పుల్లలు  5. వాము  6. దంచిన బెల్లం

తయారు చేసే విధానం:

ముందుగా పిప్పళ్ళు, మోడి పుల్లలు, వాము (ఈ మూడు ఆయుర్వేద కిరాణాషాప్ లలో దొరుకుతాయి)లను సన్నటి సెగ మీద కొద్దిగా వేయించాలి. తరువాత చల్లారబెట్టాలి. తర్వాత మిక్సీ లోగాని, రోటిలోగాని వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఎండుకొబ్బరిని చిన్నచిన్న ముక్కలుగా చెయ్యాలి. ఈ ముక్కలని తర్వాత మిక్సీలోగాని, రోటిలోగాని వేసి మెత్తగా పొడి చెయ్యాలి. అలాగే శోంఠిని చిన్నచిన్న ముక్కలుగా చెయ్యాలి. ఈ ముక్కలని తర్వాత మిక్సీలోగాని, రోటిలోగాని వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. బెల్లాన్ని దంచి పొడిచేసుకోవాలి. ఆఖరిగా తయారు చేసుకొన్న మూడు రకాల పొడులను దంచిన బెల్లంలో వేసి కలపాలి. ఇలా తయారైనదాన్నే పంచకర్జాయ ప్రసాదం అంటారు.