Chinna Pillalaku Yerpade Pramaadalu
Chinna Pillalaku Yerpade Pramaadalu
చిన్న పిల్లలకు ఏర్పడే ప్రమాదాలు
చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పెద్దలు, పిల్లలను ఓ కంటకనిపెడుతూ ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చిన్నారులకు అపాయాన్ని గురించి ఆలోచించే వయస్సుండదు. అనుకోకుండా కొన్ని ప్రమాదాలు ఏర్పడితే, మరికొన్నింటిని ప్రమాదమేమో అని తెలియకుండా కొని తెచ్చుకునేవి కొన్ని.
పిల్లలకు ప్రమాదం కలిగితే పెద్దలు అతిగాభరా పడుతూ పిల్లల్లో భయాన్ని కలిగించకుండా, వెంటనే ప్రథమచికిత్స పద్ధతులను పాటించాలి. ఆ తర్వాత పిల్లల వైద్యునికి చూపించి, అవసమయితే చికిత్సచేయించాలి. మందులు వాడాలి. అందువల్ల, ఏ ప్రమాదానికి ఏవిధమైన ప్రథమ చికిత్స జరపవలసినదీ పెద్దలకు సరైన అవగాహన ఉండాలి
* జారిపడితే : పిల్లలు నేలమీద, మెట్లమీద నుంచి ఎత్తుగా ఉండే అరుగుల మీద నుండి జారిపడి దెబ్బలు తగుల్చుకోవచ్చు. దెబ్బ తగిలిన నొప్పికంటే, భయంతో పిల్లలు ఏడ్చేస్తారు. పిల్లల ఏడుపునకు కంగారు పడకూడదు. పిల్లలను భయపడవద్దని బుజ్జగిస్తూ, ఏం జరిగిందో, ఎక్కడ ఏవిధంగా పడిందీ, దెబ్బ ఎక్కడ తగిలిందీ తెలుసుకోవాలి. చర్మం చీరుకుపోయి రక్తం వస్తుంటే డెట్టాల్ నీటితో చర్మాన్ని శుభ్రంగా కడిగి, టించర్‌ను దూదితో అద్దాలి. రక్తం ఆగకుండా వస్తుంటే, తడిబట్టతో కొంతసేపు నొక్కి ఉంచాలి. ఆ తర్వాత వైద్యుని వద్దకు తీసుకువెళ్ళి వైద్య సలహా ప్రకారంగా కట్టుకట్టించడమో, మందులు ఇవ్వడమో చేయాలి.
* కాలినప్పుడు : చిన్నారులను వేడి వస్తువుల దగ్గరకు రానీయకుండా, వంటింట్లో పరుగులు తీయకుండా చూసుకుంటుండాలి. వేడి నీళ్ళతో ఆడాలని చేయి పెట్టినా చేతులు కాలి, లేత చర్మానికి బొబ్బలొస్తాయి.. వెంటనే పిల్లల చేతులు మీద ధారగా చన్నీళ్ళను పోయాలి. ఆ తర్వాత చల్లని నీళ్ళతో తడిపిన బట్టను చర్మం మీద ఉంచి, వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాలి. చిన్నపిల్లలకు అందనంత ఎత్తులో వేడి కుక్కర్‌ను, వేడి పాత్రలను, బాణలిలాంటి వాటిని ఉంచాలి. డైనింగ్ టేబుల్ మీద, టేబుల్ క్లాత్‌కు క్రిందకు వేలాడుతున్నట్లుగా వేయకూడదు. చిన్నపిల్లలున్న ఇంట్లో, ఆ టేబుల్ క్లాత్‌ను పిల్లలు లాగి, టేబుల్ మీద ఉం చిన పాత్రలను, వేడి పదార్థాలను మీద వేసుకునే ప్రమాదం ఉంటుంది. వారి చర్మం కాలే ప్రమాదముంటుంది. పిల్లలకు చర్మంకాలినప్పుడు చర్మం మీద చల్లటి నీటిని ధారగాపోయడమే సరైన పద్ధతి. తేనె పూయడం లాంటివి చేయకూడదు. డాక్టర్‌కు చూపించాలి. వెంటనే, బొబ్బలను చిదపకూడదు. చర్మాన్ని రబ్‌చేయకూడదు.
* కోసుకుంటే : పెద్దల నిర్లక్ష్యం, అశ్రద్ధ, మతిమరుపు వల్ల కూడా చిన్నారులకు పదునైన వస్తువులు కోసుకునే ప్రమాదం వుంది. కూరలు తరిగే కత్తిపీట, చాకు, కత్తెర, బ్లేడు లాంటి పరికరాలను వాడిన తర్వాత, వాటిని పిల్లలకు అందుబాటులో లేకుండా జాగ్రత్తగా ఉంచాలి పిల్లలు ఆడే ఆట వస్తువుల వల్ల కూడా వారికి చర్మం కోసుకుని లోతుగా దిగే ప్రమాదం ఏర్పడ వచ్చు. పదునుగా వుండే ఆట వస్తు వులు, రేకు లున్న ఇనుప బొమ్మలు, మేకులు, స్క్రూలు లాంటివి ఉన్న బొమ్మలు పిల్లలకు ఆటవస్తువులుగా కొనకూడదు. ఇవ్వకూడదు. గాజు సీసాలు, గాజుపాత్రలు పిల్లలకు అందనంత ఎత్తులో ఉంచాలి. పొరపాటుగా పిల్లలు కోసుకుని నెత్తురు కారుతుంటే, చల్లటి నీటితో తడిపిన బట్టను చుట్టాలి. లేదా ఐస్ ముక్కలను బట్టలో ఉంచి రక్తం కారుతున్న ప్రదేశంలో ఒత్తిపెట్టి ఉంచితే రక్తం కారటం ఆగిపోతుంది. లోతుగా కోసుకుంటే! ఆ భాగాన్ని ఎత్తుగా వుంచి, చల్లటినీటితో తడిసిన బట్టను ఉంచాలి. రక్తస్రావం ఆగిపోయిన తర్వాత, పరిశుభ్రమైన బట్టతో తెగిన ప్రదేశంలో చర్మాన్ని కప్పి, ఒదులుగా చుట్టి, ఆ తర్వాత వైద్యుని వద్దకు తీసుకువెళ్ళి చూపించి, వైద్య సలహా తీసుకోవాలి. అవసరమైన చికిత్సను చేయించాలి.
* కీటకాలు కుడితే : కొన్ని రకాల కీటకాలలో కొంత విషపదార్థం ఉంటుంది. అటువంటి విషకీటకాలు కుడితే పిల్లలకు ఎలర్జీ కలిగి, ఆ తర్వాత కుట్టిన చర్మం మీద అమిత బాధకలుగుతుంది. గొంగళి పురుగులు లాంటివి కుడితే, చర్మం మీద పాకితే దురదలు, దద్దుర్లు వచ్చి పిల్లలకు బాధ కలుగుతుంది. అప్పుడు, గోరువెచ్చని నీటితో స్నానం చేయించి, దద్దుర్లు, దురద తగ్గటానికి గొంగళిపురుగు పాకిన ప్రదేశంలో విభూదిని బాగా రుద్దాలి. కొన్ని విషకీటకాలు కుడితే ఎలర్జీ ఏర్పడటమే కాకుండా, మరికొన్ని తీవ్రమైన మార్పులు వస్తాయి. దద్దుర్లు ఎర్రగా మారినప్పుడు, ఊపిరి పీల్చుకోవడంతో ఇబ్బంది కలిగినప్పుడు పెదాలు నల్లబడటం, నాలుక తడారిపోవడం లాంటి లక్షణాలు ఏర్పడితే ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లలను వైద్యుని వద్దకు తీసుకెళ్ళాలి. అవసరమైన వైద్య సహాయాన్ని పిల్లలకు అందించాలి.
* మందులు, రసాయనాలు : మందులు, క్లీనింగ్‌లోషన్స్ పిల్లలకు అందనంత ఎత్తుగా ఉంచాలి. పిల్లలు ఏమైనా మందులు తాగినా, మందుబిళ్ళలు తిన్నా వాటిని కక్కించాలని, ఉప్పునీళ్ళు త్రాగించడం, మంచినీళ్ళు ఎక్కువగా త్రాగించడం చేయకూడదు. అలా చేసినట్లయితే కడుపులో చేరిన మందులు, వెంటనే రక్తంలో చేరే ప్రమాదం ఉంది. బిడ్డకు ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు. ఇటువంటివి జరిగినప్పుడు, తక్షణమే వైద్య సహాయం పొందడం చాల అవసరం. కీటకాలను సంహరించే మందులను అమిత భద్రంగా ఉంచాలి. మందును స్ప్రే చేసినప్పుడు పిల్లలను ఆ ప్రదేశానికి దూరంగా ఉంచాలి. దోమలు, నల్లులు, ఎలుకలు, బొద్దింకలు చీమల సంహారక మందులను పిల్లలు నిద్ర పోయిన తర్వాత ఉపయోగించి, పిల్లలు నిద్రలేవకుండా క్లీన్ చేసేయ్యాలి.
వాటిని పిల్లలకు తెలియకుండా దాచాలి. పిల్లలకు ఏర్పడే కొన్ని ప్రమాదాలకు తక్షణ ప్రథమచికిత్స చేయాలి. మరికొన్ని ప్రమాదాలకు ఎంతమాత్రం ఆలస్యం జరగకుండా వైద్య చికిత్స జరగాలి. ముఖ్యంగా, పిల్లలకు ప్రమాదాలు జరిగినప్పుడు పెద్దలు, ఆందో ళన, గాభరా పిల్లల ఎదుట ప్రదర్శించకూడదు. పనులు చేసే టప్పుడు చిన్న పిల్లలున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరుపు, అ శ్రద్ధ, నిర్లక్ష్యం లేకుండా ప్రవర్తించాలి. పిల్లలకు జరిగే ప్రమాదాలు ప్రాణా పాయ స్థితికి చేరకుండా తక్షణమే, చర్యలు తీసుకోవాలి.