బరువూ బరువూ ఎట్లా నీతో…. అంటున్నారా?

బరువూ బరువూ ఎట్లా నీతో…. అంటున్నారా?


ఇదేదో సినిమాలో పాట కాదు. కొత్తగా వచ్చిన స్లోగన్ అంతకన్నా కాదు. అధికబరువు సమస్య ఉన్న ప్రతి ఒక్కరి మనసులో ఉన్న ఇంటెన్షన్. ఏంటి నిజమేనా కాదా?? బయటకు అధిక బరువు వల్ల తమకేమీ ఇబ్బంది అనిపించట్లేదులే అనే అభిప్రాయం కలిగించేలా ఉన్నా అధిక బరువు ఉన్న ప్రతి ఒక్కరి మనసులో అందరికీ ఈ బరువు వల్ల చెప్పలేని చావొచ్చింది అనే ఫీలింగ్ తప్పకుండా ఉంటుంది. అయితే అధిక బరువు ఉన్న వాళ్ళు చాలామందిలో ఫుడ్ విషయంలో చాలా అపోహలు ఉంటాయి. మరీ ముఖ్యంగా వాళ్ళూ, వీళ్ళు చెప్పే సలహాలు, అక్కడా ఇక్కడా చూసిన చిట్కాలు అన్నీ ఫాలో అవుతూ ఉంటారు. ఎక్కువ మందిలో బరువు తగ్గాలి అంటే చపాతీ తినాలి అనే అపోహ  ముఖ్యమైనది.

మొదట అందరూ తెలుసుకోవలసినది. మన శరీరం ఎత్తుకు తగిన బరువు ఉందా లేదా అనేది. ఎత్తు, ఎత్తుకు తగిన బరువు ఉన్న వారిలో ఇతర ఆరోగ్య సమస్యల ముప్పు తక్కువగా ఉంటుంది. కానీ ఎత్తుకు తగిన బరువు కంటే ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా కూడా ప్రమాదమే… ఈ బరువును బట్టి మాస్ ఇండెక్స్ తో కొలుస్తారు. ఇది మహిళలలో 30 కంటే ఎక్కువ ఉండకూడదు, అలాగే 23 కంటే తక్కువ ఉండకూడదు. ఆ రెండింటి మధ్య ఉన్నవారు సహజంగానే ఎత్తుకు తగిన బరువు కానీ దాని అటు ఇటుగా కొద్దిగా తేడాతో కానీ ఉండవచ్చు.

ఇక చాలామందిలో ఉండే ముఖ్యమైన ఆలోచన చపాతీ తింటే బరువు తగ్గుతారా అని. అయితే చపాతీ అయినా, అన్నం అయినా వేరే ఏ టిఫిన్ అయినా దానిని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఏ ఆహారం అయినా ఎంత తింటున్నాం అనే దానిమీదనే ప్రతి ఒక్కరి బరువు ఆధారపడి ఉంటుంది. సాధారణంగా చాలామంది చపాతీ సూచించడానికి గల కారణం ఏమిటంటే వాటిని లెక్కపెట్టుకుని ఇన్ని అని తినచ్చు. అదే అన్నం అయితే ఒకటికి మూడు రకాల కూరలు ఉన్నప్పుడు ఎంత తక్కువ తిన్నా మూడింటితో కలిపి సుమరుగానే కడుపులోకి వెళ్ళిపోతుంది. 

బరువు తగ్గాలి అనుకునేవారు చేయాల్సింది అన్నం మానేయడం, చపాతీ తినడం వంటి చిట్కాలు పాటించడం కాదు. బరువు తగ్గాలి అంటే తీసుకునే ఆహారంలో నూనెలు, తీపు, ఉప్పు, కారం, మసాలా దినుసులు మొదలైనవి తగ్గించుకోవాలి. తీపి తినాలని అనిపించినప్పుడు బెల్లం కానీ, తేనె కానీ, తీపిని ఎక్కువగా కలిగి ఉండే ఖర్జురం, కిస్మిస్, అంజీర్ వంటి ఎండు ఫలాలు కానీ చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి. అలా చేస్తే బరువు అనేది ప్రశ్నే కాదు.

బయటకు వెళ్ళినప్పుడు అనుకోకుండానే మనస్సు ఫాస్ట్ ఫుడ్ వైపుకు వెళ్తుంది. అందుకే సాయంకాలాలలో అందరితో కలిసి అలాంటి చోటికి వెళ్లకుండా పార్కులు, గుడులు వంటి ప్రదేశాలకు వెళ్ళాలి. అలా వెళ్తే అక్కడ ఎంతో ప్రశాంతత లభిస్తుంది.

పాలు పెరుగు తింటే లావు అవుతాము ఏమో అనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ వాటిని తీసుకోకపోతే కాల్షియం లోపిస్తుంది. కాబట్టి పాలు పెరుగు వాటి ఇతర ఉత్పత్తులు తీసుకోవాలి. ఓట్స్, సోయా, ఫైబర్ అధికంగా  ఉన్న వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా సహజంగా లభించే విటమిన్స్, ప్రోటీన్స్ ను శరీరానికి అందేలా చేయాలి. ఇలా చేస్తే బరువు బరువు నీతో ఎలా అని ప్రశ్న వేసుకునే బదులు బరువు బరువూ ఇదిగో ఇలా అని దానికి ఒక దారి చూపించేయవచ్చు.

                                    ◆నిశ్శబ్ద.