మహిళల ఆర్థిక ప్రగతికి బీజం వేసిన యోధురాలు!

మహిళల ఆర్థిక ప్రగతికి బీజం వేసిన యోధురాలు!

 

స్వాతంత్ర పోరాటంలో కదం తొక్కిన మహిళలు లెక్కకు మిక్కిలి ఉన్నారు. వారిలో ఉన్నవ లక్ష్మీబాయమ్మ చెప్పుకోదగినవారు. భారతీయ మహిళగా సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తూనే స్వాతంత్ర్యం కోసం పోరాడిన, మహిళల అభ్యున్నతికి పాటుపడిన మహిళ ఉన్నవ లక్ష్మీభాయమ్మ.

1926-27 ప్రాంతాలలో ఒకనాడు శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ.. గుంటూరు కొత్త పేటలో వున్న తమ పరిచయస్తులు శ్రీమతి గోళ్ల మూడి రాజ్యలక్ష్మమ్మ యింటికి వెళ్లారు. బయట హాలులో ఆ కాలపు అలవాటును పట్టి కుమారీ శతకం, సుమతి శతకంలో పద్యాలు గడగడ ప్రైవేటు మాస్టరుకు అప్ప చెపుతున్నది ఒక ఆరేళ్ల అమ్మాయి "పతి భుజియించిన మెతు కొక్కటి మిగల కుండ" అని ఆ అమ్మాయి చదువుతునే ఉంది. అది విన్న లక్ష్మీభాయమ్మ 'ఛీఛీ యేమిటా చదువు మీ అమ్మ లేదూ యింట్లో' అని ఒక్క కేక పెట్టింది.

 బిత్తరపోయిన అమ్మాయి 'అమ్మా ఉన్నవ అత్తయ్య వచ్చారు' అంటు తల్లిని పిలుస్తు లోపలికి వెళ్లింది. పై సంఘటన గురించి వినిన వాళ్లెవరూ ఆమె నుదుట పెద్ద కోలబొట్టు, మెళ్లో పసుపుతాడు, చేతులకు వెండి గాజులు, కాళ్లకు మట్టెలు అంటదువ్వి చుట్టుకున్న చిన్న కొండిచుట్ట, మోచేతులవరకు వున్న తెల్ల ఖద్దరు రవికె, కాశపోసి కట్టుకున్న ముతక తెల్ల ఖద్దరు చీర, జీరాడే పమిటెతో వూహించుకోలేరు. కాని వేరే యే అలంకారాలు, ఆభరణాలు లేని ఈ నిరాడంబర వేషంతోనే శ్రీమతి లక్ష్మీబాయమ్మ సభలు సమావేశాలు, పెళ్లిళ్లు పేరంటాలు అన్నీ సలక్షణంగా జరిపించేవారు. ఆమె అక్షరాలా పురాణి. పురాతన పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, వేషభాషలు చదువు సంస్కారాలు అభిమానిస్తారు. కాని పాతవే అయినా స్త్రీల అభ్యున్నతికి అడ్డువచ్చేవి, అభిజాత్యానికి అడ్డువచ్చేవి అంటే మాత్రం సహించరు. మహాకాళిగా మారిపోతారు.

 సభలు సమావేశాల సమయంలోనైనా సరే స్త్రీలకు తగిన గౌరవం ఇవ్వకపోతే ఎవరిని లెక్కచెయ్యకుండ లేచి వెళ్లి పోయేవారు.  ఆమెలో వున్న విప్లవ భావన, పరతంత్ర శృంఖలాలను ఛేదించి పారవేయాలన్న తపన ప్రతి ఒక్క విషయంలోను కనిపిస్తుంది.

1920-40ల మధ్య గుంటూరులో శారదా నికేతనం వార్షికోత్సవాలు పౌరులను వివరీతంగ ఆకర్షించేవి. పదేళ్లలోపు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయకుండా మూడో యెక్కమైనా ముచ్చటపడి నేర్చుకోకుండ అత్తవారిళ్లకు పంపే ఆ రోజల్లో శారదా నికేతనంలో అమ్మాయిలు తళతళలాడే మఖమల్ జరీబుటా దుస్తులు ధరించి సంస్కృత నాటకాలు కూడ ప్రదర్శించేవారు, కన్నుల పండుగగా పదేసిమంది పిల్లలు రకరకాల వాయిద్యాలతో పాట కచ్చేరీ చేస్తువుంటే రాత్రి తొమ్మిదయినా ప్రేక్షకులు కదిలేవారు కాదు.

ఆ రోజుల్లో శారదా నికేతనం విశ్వకవి రవీంద్రుని శాంతి నికేతనాన్ని స్ఫురింపచేసేది. అక్కడ తెలుగు, సంస్కృతం, సంగీతం, చిత్రలేఖనం, లేసు అల్లికలు, పూవులు, లతలు కుట్టటం, నూలువడకటం వంటి జాతీయ విద్యలెన్నో నేర్పేవారు. జాతి, కుల, మత, భేదం లేకుండ ఆడపిల్లలకు ఉచితంగా విద్య నేర్పటమేకాక ఉచితంగా హాస్టలు సదుపాయాలు కూడ కల్పించేవారు. ఇవన్ని నేర్చి అమ్మాయిలు విజ్ఞానవంతులు కావాలి, తమగౌరవాన్ని తాము కాపాడుకోగలగాలి, అవసరమైన పరిస్థితులలో కొంత డబ్బు సంపాదించుకోగలగాలి తమకు తమ స్త్రీజాతికే కాక తమ మాతృదేశానికి సేవచేయాలి అన్న తలంపుతోనే శ్రీ ఉన్నవ దంపతులు శారదా నికేతనం స్థాపించారు. 

బాల్య వివాహాలవల్ల స్త్రీ మానసికంగా యెదగకుండానే గృహవిధులకు, కష్టాలకు లోనవుతున్నది. ఇక బాలవితంతుల గోడు చెప్పనే అవసరంలేదు. ఈ పరిస్థితిలో చైతన్యం స్త్రీలలోనే కలిగించాలనే ఉద్దేశంతో సంస్థాపించి గురుకుల వాతావరణంలో నడిపించసాగారు. ఆంధ్రపర్యటనకు వచ్చినప్పుడు గుంటూరులో ఎంత తక్కువకాలం గడిపినా గాంధీజీ ఒకసారో రెండుసార్లో శారదానికేతనానికి వచ్చి, అక్కడి వారందరిని ఆశీర్వదించి, వుద్బోధించి తీరవలసిందే. రెల్లు కప్పు వేసిన గుండ్రటి వేదికలు అనేకం వుండేవి. వాటిమీద కూర్చుని గాంధీజీ మాట్లాడుతుంటే సభికులు తామెక్కడున్నారో మరచి పరవశించేవారు.

ఇంతటి గొప్ప వ్యక్తిత్వం, గొప్ప లక్ష్యాలు కలిగిన ఉన్నవ లక్ష్మీభాయమ్మ ప్రతి మహిళకూ స్ఫూర్తి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పైపెచ్చు లక్ష్మీభాయమ్మ చెప్పినట్టు ప్రతి మహిళా సొంతంగా సంపాదించుకోవడంలో ఆ మహిళ అస్తిత్వం దాగుంటుంది.

                                      ◆నిశ్శబ్ద.