Read more!

ఆనందమైన కుటుంబానికి మహిళలు ఎలా కారణం అవుతారు?

ఆనందమైన కుటుంబానికి మహిళలు ఎలా కారణం అవుతారు?


ఈ సమాజంలో ఓ ఇల్లు, ఆ ఇంట్లో వారు సంతోషంగా ఉండటం వెనుక కారణం  ఏమై ఉంటుంది. చాలా మంది వారికి ఆర్థిక బాధలు లేవని, అనారోగ్యాలు లేకుండా ఉన్నారని, డబ్బు పుష్కలంగా ఉంటుంది లెమ్మని ఇలా బోలెడు కారణాలు చెప్పుకుంటారు. కానీ దానికి అవేవి కారణాలు కాదు. వాటన్నిటికంటే ముందు ఆ కుటుంబం, ఇల్లు సంతోషంగా ఉండటానికి కారణమయేది ఆ ఇంటి మహిళ. 


శాంతియుత వాతావరణమే ఒక ఇంటిని అసలైన ప్రశాంత నిలయంగా చేస్తుంది. స్త్రీలు శాంతియుతమైన, సమర్థమైన, ఆనందమయమైన గృహ జీవితాన్ని ఏర్పరచుకునే జ్ఞానం కలిగి ఉండాలని కొందరు చెబుతారు. గృహ కార్యకలాపాల్లో అనురాగం, అంకితభావాలు సమర్థంగా పనిచేస్తాయి. పూర్వీకులు చెప్పినట్లు ఇల్లు అంటే ఒక రాతి కట్టడం కాదు. శాంత స్వభావురాలైన స్త్రీనే ప్రేమానురాగాలతో తన ఇంటిని ఆనందనిలయంగా మలచుకుంటుంది. ఇంటిని ఆనందనిలయంగా ఉంచుకునే మహిళలు సమాజానికి చాలా అవసరం. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు వర్ధిల్లడానికి గృహశాంతి ఎంతగానో తోడ్పడుతుంది. వ్యక్తిగత శాంతి, సహనం నుంచి సామాజిక శాంతి సిద్ధిస్తుంది. 

భారతీయ మహిళలకు ఈనాడు విజ్ఞానార్జనకూ, మేధావికాసానికీ ఎన్నో అవకాశాలు, సౌకర్యాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తూ విద్యావంతులైన కొంతమంది మహిళలు సాటివారితో పోల్చుకుని అవసరాల్నీ, ఖర్చుల్నీ పెంచుకుంటున్నారు. ఈర్ష్య అసూయలకులోనై మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఆధ్యాత్మిక అవగాహన పెంచుకోవడం ద్వారా వారు ఈ సమస్యను అధిగ మించగలరు. బాహ్యసౌందర్యానికి ప్రాధాన్యాన్ని తగ్గించి, అంతఃసౌందర్యం పెంపొందించు కోవాలి. ఇది మన చేతుల్లోనే ఉంది. నిర్మలమైన మనస్సు, మాతృప్రేమ, నిరంతర శ్రమ, భక్తిప్రపత్తులు ద్వారా అంతఃసౌందర్యం ప్రతిబింబించేలా చేసుకోవచ్చు. 


వనితా లోకం వాక్ సంయమనం, భావ సంయమనాల ద్వారా తమ సామర్థ్యాన్నీ వృద్ధి పరచుకోవచ్చు.


 యోగస్య ప్రథమం ద్వారం వాణ్నిరోధః అని వివేక చూడామణిలో ప్రస్తావించారు. యోగానికి తొలిమెట్టు వాక్ సంయమనం అన్నారు ఆది శంకరాచార్యులు. ఇంటా బయటా కలిగే సమస్యలకు ఒక ప్రధాన కారణం. స్త్రీల అనియంత్రిత వాగ్ధోరణి.  భారతీయుల దృష్టిలో వాగ్దేవతే బుద్ధి దేవత కూడా. మన వాక్కును నియంత్రించు కొని, స్వచ్ఛంగా ఉండటం ద్వారా మనం వివేకాన్ని సాధించవచ్చు. శాంతి సంతోషాలను అనుభవించవచ్చు. కానీ చాలామంది మహిళలు తమ మాటతీరు విషయంలో చాలా గట్టిగా ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని సమస్యగా గొంతు విప్పి చెబుతారు. అంటే ఆడవారు గొంతెత్తి మాట్లాడకూడదని కాదు ఇక్కడ చెప్పేది. ఇంటి విషయాన్ని వీధిలోకి వచ్చి మాట్లాడటం సమంజసం కాదు కదా.. చాలామంది అదే తప్పు చేసేస్తారు. మాట్లాడటం తమ స్వేచ్ఛ కదా అంటారు. దీనికి మగవారు కూడా అతీతం కాదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్టుగానే.. మాట అదుపులో ఉంటే మనిషి కూడా ప్రశాంత జీవనాన్ని పొందగలుగుతాడు. 


కాబట్టి మహిళలు తమ మాట ఎంత పొదుపుగా, జాగ్రత్తగా వాడితే వారికి అంత ప్రశాంతత. వారు ఎంత ప్రశాంతంగా ఉంటే వారి కుటుంబం కూడా అంత బాగుంటుంది. 

     
                                          ◆నిశ్శబ్ద.