వేళ్ళకు రింగుల హంగే వేరబ్బా...

 

వేళ్ళకు రింగుల హంగే వేరబ్బా...

 


చేతి వేళ్ళకు ఉంగరాలు పెట్టుకోవడం పాత ఫ్యాషనే. మన దేశంలో ఇలా వేళ్ళకు రింగులు పెట్టుకోవడం అనాదిగా వస్తోంది. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లలో అతివలు నాలుగైదు రింగులు పెట్టుకుని మురిసిపోవడం సర్వసాధారణం. ఈ ఫ్యాషనే ఇప్పుడు కొత్త లుక్‌లోకి మారిపోయింది. అదే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఇప్పటి యూత్ చేతి వేళ్ళకు రకరకాల రింగులు పెట్టుకుని ఫ్యాషన్‌బుల్‌గా కనిపిస్తున్నారు. చేతివేళ్ళకు ఉంగరాలు పెట్టుకోవడం అంత ముఖ్యమా అంటే... అవుననే అంటారు చాలామంది. తమ హోదాను చాటిచెప్పడానికి, ఫ్యాషన్‌బుల్‌గా కనిపించడానికి.. ఇలా రకరకాల కారణాలతో రింగులు పెట్టుకుంటారు. అందుకే చాలామంది ఈ ఫ్యాషన్‌ను ఫాలో అవుతారు. వేళ్లకు ఉంగరాలు ధరించడం చాలా ఈజీ. జస్ట్ వేలుకు సరిపోయేంత సైజ్ వుంటే చాలు. సెకన్లలో పెట్టేసుకోవచ్చు. ఇతర బంగారు ఆభరణాల్లాగా దీన్ని ధరించడానికి చాలా టైమ్ కూడా పట్టదు. ఉంగరాల వైపు చాలామంది మొగ్గు చూపడానికి ఇది కూడా ఒక కారణమే. అంతేకాదు మెడలో ఎంత బంగారమేసుకున్నా అంత లుక్ కనిపించదు. కానీ, వేలికి ఉంగరం పెట్టుకుంటే ఇతరుల దృష్టిని ఈజీగా ఆకర్షించవచ్చు. ఈ ఉంగరాలకు అంత ఆకర్షణ వుంటుంది మరి. ఇప్పటి ట్రెండ్ ప్రకారం యూత్ నాలుగైదు ఉంగరాలు పెట్టుకుంటున్నారు. కానీ, గతంలో మాదిరిగా అవి చాలా భారీగా వుండటం లేదు. జస్ట్ సింపుల్‌గా రింగ్ అంటే రింగ్‌లానే వుంటోంది. అది కూడా బంగారం మాత్రమే కాదు.. ప్లాటినం, సిల్వర్... ఇలా పలురకాల రింగులను ధరిస్తున్నారు.

 

ఇక ఇప్పటి అమ్మాయిలైతే చాలా సింపుల్‌గా ఉండే రింగులనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గోల్డ్ చెయిన్ల కంటే రింగులంటేనే ఇష్టమంటున్నారు. అందుకే మెడలో బంగారం గొలుసు లేకపోయినా చేతికి మాత్రం మస్ట్‌గా రెండు మూడు ఉంగరాలతో కనిపిస్తున్నారు. మార్కెట్లో రెడీమేడ్ ఉంగరాలు చాలా తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఇవి అందుబాటులో ఉంటున్నాయి. జస్ట్ వంద రూపాయలు పెడితే చాలు.. స్టైలిష్‌గా వుండే నాలుగైదు రింగులు మార్కెట్లో దొరుకుతున్నాయి. అందుకే ఇప్పుడు రింగులు పెట్టుకోవడం కొత్త ట్రెండు. ఇంకెందుకు ఆలస్యం... మీరూ ఓసారి ట్రై చేయండి. ట్రై చేయమన్నాం కదా అని ఎలా పడితే అలా పెట్టుకోకండి. వేలు పైభాగంలో రింగు పెట్టుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. మార్కెట్లో ఇవి చాలా రకాల స్టైల్స్‌లో అందుబాటులో వుంటున్నాయి. అవి కూడా బంగారం మొదలుకుని చాలా మెటల్స్‌లో దొరుకుతున్నాయి. వేలి పైభాగంలో ఉంగరాలు ధరించే నేటి ఫ్యాషన్‌లో మీరూ భాగమైపొండి.