అద్భుతమైన సూర్య నమస్కారాల రహస్యం!

అద్భుతమైన సూర్య నమస్కారాల రహస్యం!

భారతీయ జీవన విధానంలో ఒకప్పుడు యోగా ప్రాధాన్యత అధికంగా ఉండేది. దురదృష్ట వశాత్తు యోగా క్రమంగా మరుగున పడి పాశ్చాత్యుల పోకడలతో జిమ్ లు వచ్చి పడ్డాయి. అయితే భారతదేశంలో ఉన్న కొందరు గురువులు యోగ ప్రాధాన్యతను తెలియజేస్తూ ఎన్నో విషయాలను మరెన్నో మార్గాలను వ్యాప్తి చేయడం వల్ల యోగాకు మళ్ళీ ఆదరణ పెరిగింది. ముఖ్యంగా సూర్య నమస్కారాలు అనేవి ఎంతో శక్తివంతమైనవి మరియు విశిష్టత కలిగినవి. 

యోగాసనాలు, ప్రాణాయాముల కలయికయే సూర్య నమస్కారాలు. ఇది యోగాసనాలు, వ్యాయామాలకు మధ్యస్థంగా ఉంటుంది. యోగసాధనకు కావలసిన శారీరక స్థితిని సూర్యనమస్కరాలు కలిగిస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఈ సూర్య నమస్కారాలు చేయాలి. 

సూర్య నమస్కారాలు చేసేముందు సూర్యునికి ఎదురుగా నిలబడి ఈక్రింది మంత్రాలు చదువుతూ చేయాలి.

హిరణ్మయేణ పాత్రేణ, సత్యస్యాపిహితమ్ ముఖం 
| తత్ త్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే ।
 సత్యాన్ని చేరటానికి నీ స్వర్ణకాంతి మమ్మల్ని నిలువరిస్తూ ఉంది. ఓ సూర్యదేవా! మా దారిని సుఖమయంచేసి సత్యాన్ని చేరుకోనీయుము. అని అర్థం. 

ఇకపోతే సూర్యనమస్కారాలు రెండు విధాలుగా చేస్తారు. మొదటి విధానంలో 12 స్థాయిలుంటాయి. రెండో విధానంలో 10 స్థాయిలు మాత్రమే ఉంటాయి. ప్రతి స్థాయి ప్రారంభానికి ముందు బీజాక్షరమైన “ఓంకార” మంత్రంతో జతచేసిన సూర్యనామాన్ని జపిస్తూ సూర్యనమస్కారాన్ని ఆచరించాలి. ఆ వరుస ఇలా సాగుతుంది. 

ఓం హ్రాం మిత్రాయ నమః 

 ఓం హ్రీం రవయే నమః

ఓం హ్రూం సూర్యాయ నమః

 ఓం హ్రీం భానవే నమః

 ఓం హౌం ఖగాయ నమః 

ఓం హ్రః పూష్టియే నమః

 ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః 

 ఓం హ్రీం మరీచయే నమః

 ఓం హ్రూం ఆదిత్యాయ నమః 

 ఓం హ్రీం సవిత్రే నమః 

 ఓం హ్రూం అర్కాయ నమః

 ఓం హ్రః భాస్కరాయ నమః

ప్రతిస్థాయిలోనూ గాలిని ఆపాలి. మొదటి విధానంలోని 12 స్థాయిలతో కూడిన సూర్యనమస్కారం ఇలా చేయాలి.

వీటిని ఎలా చేయాలంటే...

◆ నిటారుగా నిలబడి కాళ్లు, చేతులు దగ్గరగా పెట్టాలి. చేతులను తలమీదకి తీసుకువచ్చి నడుముని వెనక్కి వంచాలి. గాలిని బాగా పీల్చాలి.

◆శరీరాన్ని ముందుకు వంచాలి. అరచేతులను కాళ్లకు రెండు ప్రక్కల నేలకి ఆనించాలి. ఇప్పుడు గాలిని బాగా వదలండి.

ఈ దశలో, కుడికాలిని వెనక్కి తీసుకురావాలి. ఎడమ మోకాలిని ముందుకి తీసుకోవాలి. ఇప్పుడు పైకి చూస్తూ గాలి బాగా తీసుకోవాలి. పిరుదుల్ని మడమలకి తగిలించాలి.

 ఎడమకాలు కూడా వెనక్కి తీయాలి. అరచేతులు, మునివేళ్లపైన మాత్రమే నిలబడాలి. నేలకు 30° కోణంలో తలనుండి తిన్నగా శరీరాన్ని ఉంచాలి. గాలి బయటకు విడవాలి.

ఇప్పుడు, చేతులు, కాళ్లు, కదపకుండా మోకాళ్లు వంచుతూ భూమికి మోపాలి. నుదురుని నేలకు తాకించాలి. శ్వాస తీస్తూ నెమ్మదిగా వెనక్కు కదిలి, శ్వాస విడవాలి. ఇలా చేసేటప్పుడు మడమలపై ఒత్తిడి కలిగించకూడదు.

చేతులూ, వ్రేళ్లూ కదలక గుండెలను ముందుకు తెచ్చి, నుదురు భూమికి తగిలించాలి. ఇది సాష్టాంగ నమస్కార ముద్ర. నుదురు, రొమ్ము, అరచేతులు, మోకాళ్లు, కాళ్లు ఇలా 8 అంగాలూ నేలను తాకుతూ ఉంటాయి. పిరుదులు పైకి లేచి ఉంచాలి. శ్వాసతీసుకోకుండా కొంతసేపు ఉండాలి.

గాలి పీల్చుకొని తల ఎత్తి చేతులు, కాళ్లు ఏమాత్రం కదలకుండా వెన్నును పాములా వంచాలి. మోకాళ్లు నేలను తాకకూడదు.

తరువాత గాలి విడవాలి. పిరుదులు లేపుతూ తలను నేలకి వంచాలి. అరచేతులూ, పాదాలూ భూమికి తాకుతూ ఉండగా వంచిన విల్లులాగా ఉండండి.

5వ పద్ధతినే తిరిగి చేస్తూ గాలి పీలుస్తూ విడవాలి.

  గాలి పీల్చి కుడికాలిని రెండు చేతుల మధ్యకు తీసుకోవాలి. చేతులు, కాళ్లు మూడూ ఒకే వరుసలో ఉండాలి. 

3వ పద్ధతిలోలాగ వెన్నెముక వంచాలి.

 గాలి విడుస్తూ ఎడమకాలిని కూడా చేతులమధ్యకు తీసుకువచ్చి తలను 2వ పద్ధతిలోవలె మోకాళ్లకు ఆనించాలి.

గాలి పీలుస్తూ లేచి నిలబడండి. చేతులు కిందకు వదలి, నిలబడి విశ్రాంతించాలి.

 (రెండో విధానంలో 10 స్థాయిలుంటాయి. అందులో ఇక్కడ ఇచ్చిన 5, 9 స్థాయిలను వదిలిలపెట్టి మిగతావి ఆచరించాలి) ఓంకార మంత్రమున బీజాక్షరాలను పలకటం, హ, ర అక్షరాల ఉచ్చారణవల్ల నరాలు, రక్తప్రసరణ జీర్ణకోశము బాగవుతుంది. సాధన సమయంలో సూర్యుని అనేక పేర్లు చెబితే అవి బాగా శక్తి స్నేహం, ప్రేమ, బలం, శక్తి, పట్టుదల, దీక్ష, ఆరోగ్యం ఇస్తాయి.

                                        ◆నిశ్శబ్ద.