వెన్ను మీద పట్టు కావాలిప్పుడు!
posted on Sep 19, 2024
వెన్ను మీద పట్టు కావాలిప్పుడు!
మగవారితో పోలిస్తే ఆడవారిలో ఎముకల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఆడవారిలో ఎన్నో రకాల సమస్యలే వీటికి కారణం అవుతాయి. మరీ ముఖ్యంగా మహిళలు గర్భవతులు అయ్యి డెలివరీ అయిన తరువాత వారిలో ఎముకలు చాలా వరకు బలహీనం అయి ఉంటాయి. వీటిని దృఢంగా చేసుకోవడం ఎంతో ముఖ్యం.
ఈ మధ్య కాలంలో మహిళలలో ఎక్కువగా నమోదు అవుతున్న సమస్యలలో వెన్నెముక బలహీనంగా ఉండటం ప్రధానంగా గుర్తించబడుతోంది. చూడటానికి శారీరకంగా బలంగా ఉన్న చాలా మంది మహిళలలో ఈ సమస్య అంతర్లీనంగా చాలా ఇబ్బంది పెడుతోంది అంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ అదే నిజమంటున్నారు స్త్రీ మరియు పోషకాహర నిపుణులు.
అయితే మహిళలలో ఎదురయ్యే ఈ రకమైన వెన్ను నొప్పి సమస్యలకు మంచి పరిష్కారం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా యోగానే. వెన్నుపూసను బలంగా, దృఢంగా మార్చే యోగాసనం వేస్తే వెన్ను నొప్పిని తరిమికొట్టవచ్చు.
సాధారణంగా వెన్ను నొప్పి లక్షణాలు ఎలా ఉంటాయంటే…
ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, కుదురుగా కూర్చోలేకపోవడం, పడుకున్నపుడు కూడా కొద్దిసేపు కూడా సరిగా పడుకోలేకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లయితే వెన్ను పూస బలహీనంగా ఉన్నట్టు లెక్క. ఇది మాత్రమే కాకుండా బరువులు ఎత్తేటప్పుడు, వంగి పైకి లేచేటప్పుడు, చురుగ్గా కదలాల్సినప్పుడు కూడా ఇబ్బంది ఎదురవుతూ ఉంటే అది వెన్నెముక బలహీనంగా ఉండటం వల్ల కలిగే ఇబ్బంది అని గమనించాలి.
వెన్ను నొప్పి మీద యోగాస్త్రం:-
వెన్ను నొప్పి తగ్గడానికి ఒకే ఒక్క ఆసనం చాలు చాచి తరిమికొడుతుంది. అది కూడా ఎక్కువ సమయం కాకుండా కేవలం రెండే రెండు నిమిషాల సమయం వెచ్చించగలిగితే వెన్ను నొప్పి మాయమవుతుంది.
దీనికి వేయాల్సిన ఆసనం మార్జాలాసనం!!
మార్జాలాసనం క్రమం తప్పకుండా వేయడం వల్ల వెన్ను నొప్పి నుండి మంచి ఉపశమనం పొందవచ్చు. దీన్ని మార్జాలాసనం అని ఎందుకంటారనే విషయం గురించి చాలామందికి అవగాహన ఉంటుంది. నిజమే!! ఈ ఆసనం వేసినప్పుడు పిల్లి ఎలా ఉంటుందో అలాంటి భంగిమలో ఉంటుంది శరీరం. కనుకనే దీన్ని మార్జాలాసనం అని అంటారు. ఇంగ్లీష్ లో అయితే క్యాట్ స్ట్రెచింగ్ అని అంటారు.
ఎలా వేయాలంటే…
మొదటగా యోగాసనాలు వేయడానికి అనువైన ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. యోగ మ్యాట్ లేదా మెత్తని దుప్పటి వేసుకుని ఆసనం మొదలు పెట్టడానికి ముందు రెండు మోకాళ్ళ మీద కూర్చోవాలి.
రెండు చేతులను ముందుకు చాచి అరచేతులను నేలకు ఆనించి ఇప్పుడు మోకాళ్ళ మీద బలం వేసి పైకిలేవాలి. వీపు సమాంతరంగా ఉంటూ చేతులు, మోకాళ్ళ మీద వంగినట్టు ఉంటుంది.
ఇప్పుడు కుడి కాలును వెనక్కు సమాంతరంగా చాపాలి. ఎడమచేతిని కూడా సమాంతరంగా ముందుకు చాపాలి. ఎడమ కాలును, కుడి చేతిని వంచకూడదు. ఈ భంగిమలో కొన్ని సెకెన్ల పాటు ఉండాలి.
తరువాత ఎడమ కాలును వెనక్కు, కుడి చేతిని ముందుకు చాపాలి. వాటిని సమాంతరంగా ఉంచాలి.
ఈ విధంగా కాళ్ళు చేతులను మారుస్తూ ఆసనాన్ని వెయ్యాలి. ప్రతి ఆసనం కనీసం మూడు సార్ల చొప్పున కనీసం రెండు కలిపి ఆరు సార్లు ఈ ఆసనం వేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ప్రయోజనాలు:-
మార్జాలాసనం వేస్తుందం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ఈ ఆసనం వేయడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ముఖ్యంగా వెన్నెముక దృఢంగా మారుతుంది.
మహిళలలో చాలామందికి కనిపించే పిరుదులు, నడుము, పొత్తి కడుపు భాగంలో క్రొవ్వు చేరడం జరగదు. వెన్ను నొప్పిలాగా వేధించే నడుము నొప్పి ఈ ఆసనం వల్ల తగ్గిపోతుంది. అధిక కొవ్వు కలిగి ఉంటే అది క్రమేపీ తగ్గిపోతుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా వేస్తే శరీరం కూడా తేలికగా మారుతుంది.
◆నిశ్శబ్ద.