Read more!

స్వీడన్ లో సుధామూర్తి అనుభవం...

స్వీడన్ లో సుధామూర్తి అనుభవం...

సుధామూర్తి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేని పేరు. ఇన్ఫోసిస్ ఛైర్మెన్ గానూ.. ఓ సక్సెస్ మహిళగానూ.. మహిళా లోకానికి ఆమె గొప్ప ఆదర్శం.  సుధామూర్తి గారికి ఎదురైన ఓ అనుభవం గురించి చెప్పుకుంటే..

కొన్నాళ్ళ క్రితం మహిళా సమస్యలపై జరిగిన ఒక సదస్సుకు  సుధామూర్తి గారు అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయంగా మహిళల స్థితిగతులు, వారి ప్రాధాన్యం తదితర అంశాలపై ఆ సదస్సులో ఎంతో మంది దేశవిదేశాల ప్రతినిధులు తమ అమూల్య అభిప్రాయాల్ని అక్కడ వెల్లడించారు. చర్చలో పాల్గొన్న ఒక వక్త చాలా ఆసక్తికరమైన సమాచారంతో ఒక నివేదికను చదివి వినిపించారు. అంతర్జాతీయంగా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పొందుతున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యా లకు సంబంధించిన కీలకమైన పరిశోధన అంశాల్ని చర్చించారు.

భద్రత, సంక్షేమం తదితర విభాగాల్లో స్త్రీలకు ప్రాధాన్యాన్ని ఇస్తున్న దేశాల జాబితాతో కూడిన సమాచారాన్ని ప్రతినిధి సభ ముందు ఉంచారు. మహిళలను గౌరవిస్తూ, వారి సముద్ధరణకు సహకరిస్తున్న దేశాల పేర్లు జాబితాలో అగ్రభాగాన ఉండగా, మహిళలకు సాధికారత కల్పించడంలో వెనుకబడిన దేశాల పేర్లు అడుగున ఉన్నాయి. సుధామూర్తి గారు మన దేశం పేరు పట్టికలో ముందు వరుసలోనో, కనీసం మధ్యలో ఎక్కడో ఉంటుందని ఊహించారు.  కానీ బాధాకరంగా భారతదేశం పేరు జాబితాలో అట్టడుగు నుంచి రెండోస్థానంలో ఉంది. మన కంటే వెనుకబడిన దేశం ఒకే ఒక్కటుందనే ఊహించని చేదునిజం తెలుసుకొని ఆమె ఆశ్చర్యపోయారు. 

స్త్రీ సంక్షేమానికి పాటుపడుతున్న మొదటి మూడు దేశాలేవో తెలుసుకోవాలని ఆమె అనుకున్నారు. ఏ అమెరికానో, ఇంగ్లండో  మొదటి స్థానంలో ఉంటాయనుకున్నారామె.  మళ్ళీ ఆమె అంచనాలు తారు మారయ్యాయి. అనూహ్యంగా ఆ మూడు అగ్రదేశాలు స్కాండి నేవియన్ దేశాలే! అంటే - స్వీడన్, నార్వే, డెన్మార్క్ సదస్సుకు హాజరైన ప్రతినిధులంతా విస్తుపోయారట. యూరప్లో ఎక్కడో ఓ మూలన ఉన్న అంత చిన్న దేశాలు మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే దేశాలని తెలిస్తే ఆశ్చర్యం కలగదా మరి!

స్వీడన్ రాజకుటుంబంలో చట్టప్రకారం స్త్రీయా, పురుషుడా అన్న దానితో నిమిత్తం లేకుండా, వారి ప్రథమ సంతానానికే వారసత్వ అధికారం సంక్రమిస్తుంది. నేటికీ ఆ దేశంలో అదే చట్టం వర్తిస్తుంది. ఇక నార్వే, డెన్మార్క్లో కూడా అదే స్థాయిలో మహిళలకు గౌరవం లభిస్తుంది. ఆ యా దేశాల్లో మహిళల పట్ల వివక్ష ప్రదర్శించడం చట్టప్రకారం నేరం.

సుధామూర్తి ఒకసారి  వ్యక్తిగతమైన పని మీద స్వీడన్ వెళ్ళాల్సి వచ్చింది. అందులో భాగంగా ఆ దేశరాజధాని స్టాక్ హోమ్ లో బస చేశారు. ఒకరోజు అక్కడ రాత్రిపూట హోటల్ కు  చేరుకోవడం ఆలస్యం  అయిపోయింది. చీకటి పడేసరికి హోటల్ కు చాలా దూరంలో ఉండడం వల్ల, టాక్సీలో ప్రయాణించాల్సి వచ్చింది. హోటల్ కు టాక్సీ ఛార్జీ 40 క్రోనాలు అవుతుంది. అయితే చాలా రాత్రి అయింది. కనుక టాక్సీ డ్రైవర్ రెట్టింపు ఛార్జి వసూలు చేస్తాడనుకొని 100 క్రోనాల నోటు ఇచ్చి, చిల్లర కోసం ఆగాను. అతను 80 క్రోనాలు తిరిగి ఇచ్చాడు.

పొరపాటుగా ఇచ్చాడనుకొని ఆమె కారణమడిగారు.  'మీరు రాత్రి ఆలస్యంగా ప్రయాణిస్తున్న మహిళ కదా! అందువల్ల అసలు ఛార్జీలో సగమే తీసుకుంటాం. ఇది మా దేశ నియమం' అని చెప్పాడు ఆ టాక్సీ డ్రైవర్. . ఆ దేశ సంప్రదాయాన్నీ, స్త్రీలకు ఇచ్చే గౌరవాన్నీ తలచుకొని ఆమె కదిలిపోయారు. మనదేశంలో అయితే చీకటి పడ్డాక ప్రయాణం చేయడానికే సాహసించేదాన్ని కాదని ఆమె చెప్పారు.  ఒకవేళ ప్రయాణిస్తే టాక్సీడ్రైవర్ అసలు ఛార్జీకి కొన్ని రెట్లు ఎక్కువ సొమ్ము వసూలు చేస్తాడనడంలో సందేహం లేదు.

మనం వేదికల మీద మహిళలకు సంబంధించి పెద్ద పెద్ద ఉపన్యాసాలిస్తూ ఉంటాం. దేవతలను పూజిస్తూ ఉంటాం. మన రాజ్యాంగంలో పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులున్నాయని గర్వంగా చెబుతూ ఉంటాం. అయితే వాస్తవంగా మన దేశంలో మహిళలకు తమ భద్రతపై భరోసా ఉందా? 'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః' లాంటి పవిత్రమైన శ్లోకాలు వల్లిస్తూ, స్త్రీలు పూజలందుకునే చోటు దేవతలకు నిలయమవుతుందని చదువుకుంటాం. కానీ ఆచరణలో విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మనం కేవలం అలాంటి మంచి మాటల్ని వల్లిస్తూ ఉంటాం..  స్కాండినేవియన్ వంటి దేశాలు ఆచరిస్తాయి! అదే తేడా!


                                        ◆నిశ్శబ్ద.