బొమ్మలతో పౌష్టికాహారం పట్ల అవగాహన

 

బొమ్మలతో పౌష్టికాహారం పట్ల అవగాహన

ప్రముఖ బాల సాహితీవేత్త, వైద్య ఆరోగ్య సైన్స్ రచయిత్రి డాక్టర్ కందేపి రాణీప్రసాద్ నూతనంగా ఒక కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పండ్లు ఫలాలను తింటే ఆరోగ్యం లభిస్తుందని అందరికీ తెలుసు. అయితే పిల్లలు అన్ని ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడరు. ఆ విషయం మాతృమూర్తులందరికీ విదితమే. పండ్లతో, డ్రై ఫ్రూట్స్.తో అనేక రకాల బొమ్మలను చేసి పిల్లలకు చూపించడం వలన ఆయా ఆహార పదార్థాల పట్ల ఆసక్తి కలుగుతుందని ఆలోచించిన రాణీప్రసాద్ డ్రైఫ్రూట్స్.తో అనేక బొమ్మల్ని సృష్టిస్తున్నారు. ఆయా బొమ్మల్ని పిల్లలకు చూపించి అందులోని పోషక పదార్థాల విలువల్ని వివరిస్తూ తల్లీ పిల్లలను చైతన్య పరుస్తున్నారు. అంజీర్లు, బెర్రీ పండ్లు, చెర్రీ పండ్లు, బాదంపప్పు జీడి పప్పు, పిస్తా, పప్పు, కిస్‌మిస్‌లు, చియా సీడ్స్, వంటి అనేక రకాల డ్రైఫ్రూట్స్.తోనూ, యాపిల్, అరటి, బత్తాయి, కమలా, అవకాడో, జుకినీ, కివీ, డ్రాగన్ వంటి పండ్లతోనూ అనేక బొమ్మలు తయరుచేసి తమ ఆసుపత్రికి వచ్చే పిల్లలకు ఎగ్జిబిషన్ల ద్వారా చూపిస్తున్నారు. వాటిని ఎలా తయారు  చేసుకోవచ్చో, వాటిలోని పోషకాలు ఏమిటో కూడా వివరిస్తున్నారు. అంతే కాక వాటిని వ్యాసాలుగా రాసి పత్రికల్లో ప్రచురిస్తున్నారు.

పిల్లలకు డ్రైఫ్రూట్స్ తినడం పట్ల ఆసక్తిని కలగజేయడం లక్ష్యంగా బొమ్మలు తయారు చేస్తున్నానని రాణీప్రసాద్ చెప్పారు పిల్లలు పౌష్టికాహారం తీసుకోకపోవడం అనేది చాలా పెద్ద సమస్య. ఈ సమస్యకు రాణీప్రసాద్ తన కళల ద్వారా పరిష్కారం చూపుతున్నారు. పిల్లలకు నోటితో చెప్పడం కన్నా చిత్రాల ద్వారా కథల ద్వారా చెప్పటం వల్ల ఎంతో ఉపయోగముంటుంది. తమ ఆసుపత్రికి వచ్చే చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే డ్రైఫ్రూట్స్ విలువనూ, ఉపయోగాన్నీ చక్కగా వివరించి చెపుతున్నారు. రాణీప్రసాద్ ఇంతకు ముందే పొడుపు కథల ద్వారా పిల్లలకు మానవ శరీర ఆవయవాల్ని పరిచయం చేశారు. అలాగే పిల్లల తల్లుల కోసం ‘మెడికల్ రంగోలీ’ తయారు చేసి వైద్య శాస్త్రాన్ని ముగ్గుల్లోకి రప్పించారు. పోలియో చుక్కలు, టీకాలు వేయించే వాటిని కవితలుగా మలిచి తమ ఆసుపత్రి ప్రిస్కిప్షన్ ప్యాడ్ మీద ప్రింటు చేస్తూ ప్రజల్ని చైతన్యవంతంగా మలుస్తున్నారు. ఇప్పుడు పిల్లలకు బలవర్ధకమైన ఆహారం మీద ఇష్టాన్నీ ప్రేమనూ పెంచడానికి తన కళల ద్వారా ప్రయత్నిస్తున్నారు. కళ అనేది తమ మానసిక ఆనందం కోసమే కాకుండా పదుగురినీ జాగృతం చేసేది అని రాణీ ప్రసాద్ నిరూపిస్తున్నారు.