చలికాలంలో చిన్న పిల్లలకు స్నానం చేయించేటప్పుడు ఈ తప్పులు చేయకండి..!

చలికాలంలో చిన్న పిల్లలకు స్నానం చేయించేటప్పుడు ఈ తప్పులు చేయకండి..!

వాతావరణం అనేది శరీరానికి ఎప్పుడూ పరీక్ష పెడుతూ ఉంటుంది.  వేసవిలో విలవిలలాడేలా చేస్తుంది.  చలికాలంలో శరీరాన్ని వణికిస్తుంది.  చలికాలంలో వస్త్రధారణ మొత్తం మారిపోవాల్సిందే.. లేకపోతే చర్మానికి  తీరని నష్టం చేకూరుతుంది. అయితే చిన్న పిల్లల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా వారి చర్మం  చాలా లేతగా ఉంటుంది.  చలికాలం ఎఫెక్ట్ తో పాటు వారికి రోజులో రెండు సార్లు స్నానం చేయించడం, చర్మ సంరక్షణ ఉత్పత్తులు వాడటం,  శరీరానికి నూనెతో మసాజ్ చేయడం వంటివి చేస్తుంటారు.  కానీ చలికాలంలో పిల్లలకు స్నానం చేయించేటప్పుడు కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి.  లేకపోతే పిల్లలు చాలా ఇబ్బందులు పడతారు.

గందరగోళం వద్దు..

పిల్లలను స్నానానికి తీసుకెళ్లాలి అనుకున్న తరువాత వారిని మొదట బాత్రూమ్ లోకి  తీసుకెళ్లి నీరు పోసిన తరువాత అవి మర్చిపోయాం,  ఇవి మర్చిపోయాం అని గందరగోళ పడకూడదు.  మొదట పిల్లలకు స్నానానికి అవసరమైన వస్తువులన్నీ బాత్రూమ్ లో సమకూర్చుకున్న తరువాతే పిల్లలను బాత్రూమ్ లోకి తీసుకువెళ్లాలి. పిల్లలు బట్టలు లేకుండా లేదా శరీరం మీద కొన్ని నీళ్లు పడిన తరువాత అలాగే ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. అసలే ఈ చలికాలంలో బాత్రూమ్ లు మరింత చల్లగా ఉంటాయి.  అందులోనూ బాత్రూమ్ లకు కిటికీలు ఉంటే అవి మరింత ఇబ్బందిని కలిగిస్తాయి.  పిల్లలకు స్నానం చేయించేటప్పుడు కూడా బాత్రూమ్ లు మూసివేయడం మంచిది.

నీరు..

పిల్లల స్నానానికి ఉపయోగించే నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చలిగా ఉంది కదా అని ఎక్కువ వేడిగా ఉన్న నీటిని వాడకూడదు. అలాగే  పిల్లలకు బాత్ టబ్ లో స్నానం చేయించేటట్టు అయితే ఛాతీ కంటే ఎక్కువ ఎత్తులో నీటిని ఉంచకూడదు.  దీనికంటే పిల్లలకు నీటిని మగ్ తో లేదా చెంబు సహాయంతో నీరు పోయడం మేలు.  అయితే స్నానం చేయించే ప్రక్రియ వేగంగా చేయాలి. అలాగే పిల్లల శరీరానికి హాని కలగకుండా చేయించాలి.  శరీరం మీద నీరు పడిన తరువాత గాలి తగిలితే పిల్లలకు చలి వేస్తుంది.

సబ్బు...


పిల్లలకు స్నానం చేయించేటప్పుడు బ్రష్షులు,  లోఫా,క్లాత్ వంటివి వాడకూడదు.  నేరుగా శుభ్రంగా ఉన్న చేతులతో పిల్లలకు సబ్బు రాయడం వల్ల స్నానం తొందరగా పూర్తీ చేయవచ్చు. తరువాత మెత్తగా ఉన్న టవల్ తో శరీరాన్ని శుభ్రంగా తుడవాలి.

తడి..

పిల్లలకు నీటిలో ఆడటం అంటే సరదా.. ముఖ్యంగా వేడి నీరే కదా అని పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లైట్ తీసుకోకూడదు.  పిల్లలను ఎక్కువ సేపు తడిలో ఉంచకూడదు. ఎక్కువసేపు తడిలో ఉంటే పిల్లల చర్మం మీద ఉండే రక్షణ పొర దెబ్బతింటుంది.

                                                  *రూపశ్రీ.