Read more!

అల్లరి పిల్లలకోసం ఫస్ట్ ఎయిడ్

అల్లరి పిల్లల కోసం ఫస్ట్ ఎయిడ్

పూర్వంతో పోలిస్తే ఈతరం పిల్లలు ఎంతో చురుగ్గా,ఉత్సాహంగా ఉంటున్నారు. ఇది కాలానుగుణంగా వచ్చే మార్పు. వాళ్ళ తెలివి, ఐ.క్యూ. చూసి ముచ్చట పడతాం. వాళ్ళ ఉల్లాసం, ఉత్సాహం చూసి మురిసిపోతాం. అంతా బాగానే ఉంది. అయితే ఈ చురుకైన చిచ్చర పిడుగులతో కొంచెం ప్రమాదమూ ఉంది. వాళ్ళ దుందుడుకు చేష్టలు ఒక్కోసారి భయాందోళనలకు గురిచేసే మాట నిజం.

అవును, ఉత్సాహంగా పరుగులు పెట్టే బుడతలు ఒక్కోసారి కాలు జారి పడిపోతుంటారు. ఇంకోసారి ఏ బ్లేడుతోనో చేతులు తెగ్గోసుకుంటారు. మరోసారి కాలో, చేతులో కాల్చుకుంటారు. ఇంకోసారి ఇంకేదో ఆపదను కొనితెచ్చుకుంటారు. ఇలా మోచేతులు, మోకాళ్ళు గాయపడి రక్తం కారడం, మొనదేలిన వస్తువులతో ఆడటంవల్ల, కోసుకోవడం, వేడినీళ్ళు మీద పోసుకుని లేదా స్టవ్ అంటించుకుని శరీరం కాల్చుకోవడం లాంటివి పరిపాటి.

అలాగే పిల్లలకు తరచూ ఏదో ఒక అనారోగ్యం కలగడమూ సహజమే. తిండిలో తేడా వచ్చినా, వాతావరణంలో మార్పు వచ్చినా పిల్లల్లో త్వరగా తేడా కనిపిస్తుంది.

అందుకే చిన్నారులు ఉన్న ఇంట్లో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ ఉండితీరాలి. అకస్మాత్తుగా జరిగే ఇలాంటి అనర్ధాల నుండి రక్షించుకునేందుకు టింక్చర్ (tincture), దూది, పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్, బర్నాల్, బాండ్ ఎయిడ్ లాంటి అత్యవసర చికిత్సా సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలి. జలుబు, జ్వరము, కడుపునొప్పి, మోషన్సు లాంటి సాధారణ అనారోగ్యాలకు సంబంధించిన మెడిసిన్లను ఇంట్లో తప్పకుండా ఉంచుకోవాలి. అవి ఎక్స్పైర్ అయితే పడేసి వేరేవి తెచ్చిపెట్టుకోవాలి.

ఈ జాగ్రత్తలతో బాటు పిల్లల వైద్యుడి ఫోన్ నంబర్ రెడీగా ఉంచుకోవాలి.