మీ పిల్లల్ని పేలు వేధిస్తున్నాయా ?

మీ పిల్లల్ని పేలు వేధిస్తున్నాయా ?

 

చిన్నతనంలో చాలామందికి తలలో పేలు పడటం సాధారణ సమస్య. మనం శ్రద్ధ పెట్టి వదిలించినా, తోటి పిల్లల తలల్లో ఉంటే మళ్ళీ ఎక్కుతుంటాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే తప్పకుండా ఉంది. ముందుగా చిన్నారుల తల మాయకుండా శుభ్రంగా ఉండేలా జాగ్రత్తపడాలి. సర్వసామాన్యంగా మురికిలేని శుభ్రమైన తలలో పేలు ఎక్కినా నిలవ ఉండవు.

వేడివేడి నీళ్ళతో తల అంటాలి. ఫోర్సుగా నీళ్ళు పోయాలి. ఇలా చేయడంవల్ల పేలు నీటి ధాటికి జారిపోతాయి.

వేప గింజలను మెత్తగా నూరి, కొన్ని నీళ్ళు కలిపి పేస్టులా తయారుచేసి తలకు పట్టించి టవలు చుట్టి పడుకోబెట్టాలి. మర్నాడు తలస్నానం చేయిస్తే పేలు నశించడమే కాకుండా ఇంకోసారి ఈ సమస్యే తలెత్తదు.

ఆవనూనెలో నూరిన వేప గింజల పొడి వేసి సన్న సెగపై మరిగించాలి. దించి, చల్లారిన తర్వాత వడపోసి ఆ నూనెను తలకు రాస్తూ వుంటే పేలు నశిస్తాయి.

వారానికి రెండుసార్లు రాత్రి నిద్రపోయే ముందు వేప నూనెను గోరువెచ్చన చేసి, జుట్టు కుదుళ్ళకు పట్టించి బాగా మర్దనచేసి తలకు టవలు చుట్టి పడుకోబెట్టాలి. పొద్దున్నే కుంకుడుకాయ రసంతో స్నానం చేస్తే పేలు హరిస్తాయ్.