తిరుమల వైభవం సీరియల్ - 31
Tirumala vaibhavam Serial- 31
దేసు వెంకట సుబ్బారావు
సాళువ మల్లయదేవ మహారాజుకు ముగ్గురు కుమారులు. వారు 1.సాళువ రామచంద్రరాజు 2.సాళువ గోపయ్య 3.సాళువ తిమ్మరాయ. సాళువ రామచంద్ర రాజు క్రీస్తుశకం 1464 లో శ్రీస్వామివారికి నైవేద్యాలు ఏర్పాటు చేశాడు.
విజయనగర రాజుల పాలనలో స్వామివారి సేవ
సాళువ రాజులు
సాళువ గోపయ్య క్రీస్తుశకం 1470లో స్వామివారికి పంగుని నుంచి ఆణి నెల వరకు (ఇంగ్లీషు నెలల ప్రకారం చూస్తే సుమారుగా మార్చి జూలై నెలల మధ్య) నాలుగు నెలలపాటు రాత్రిపూట ''పానకం'' నైవేద్యంగా సమర్పించేటట్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం స్వామివారి భాండాగారానికి 500 ఫణాలు చెల్లించారు. అయితే ఆ తర్వాత పానకం నైవేద్యం సంవత్సరం పొడుగునా అంటే ఆడి నెల నుంచి మాసి నెల వరకు జరిగేలా ఏర్పాటు చేశారు. ఇందుకు సరిపోయే 1600ఫణాలను శ్రీవారి ఖజానాకు చెల్లించారు. సాళువ తిమ్మరాయలు క్రీస్తుశకం 1482లో శ్రీస్వామివారికి 7800 ఫణాలు చెల్లించి ప్రతిరోజూ శ్రీవారికి, వరాహస్వామికి రెండు నేతి పొంగలి తళిగల నైవేద్యం ఏర్పాటు చేశారు.
సాళువ రాజుల చలివేంద్రాలు
ఎర్ర కంపయ దేవమహారాజు, ఇతని ఇద్దరు కొడుకులు, పెరిమల్లయ దేవ, మల్లయ దేవమహారాజు, మరి ముగ్గురు మనవలు సాళువ రామచంద్రరాజు, సాళువ గోపయ్య, సాళువ తిమ్మరాయ ఒకే కుటుంబంలో జన్మించిన ఈ ఆరుగురు సాళువ రాజులు విజయనగర సామ్రాజ్యంకోసం తహతహలాడినవారే! వీరంతా మహామండలేశ్వరులే! వీరి కుటుంబ ఐక్యత చూసి ఇతర రాజులకు తీవ్రమైన భయం కలిగింది. విజయనగర సామ్రాజ్యాన్ని అధిష్టించిన రాజు రెండో సాళువరాజు, సాళువ గుండరాజు ఉడైయార్ తిప్ప కుమారులు. వీరిలో సాళువరాజు కుమారుడు సాళువ పర్వతరాజు. ఈ పర్వతరాజు సలిబిందరాలను (చలివేంద్రాలు) తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే కాలిబాటలో మోకాలిమిట్ట వద్ద తాను కట్టించిన మంటపంలో ఏర్పాటు చేసి బాటసారుల దాహార్తిని తీర్చేవారు. సాళువ గుండరాజు ఉడైయార్ ను గుండయ దేవమహారాజు, మూడో గుండరాజు అని పిలిచేవారు. ఇతనికి ఇద్దరు కుమారులు. వీరిలో సాళువ తిమ్మరాజ ఉడైయార్ (క్రీస్తుశకం 1464) పెద్ద కుమారుడు. సాళువ నరసింహరాయలు రెండో కుమారుడు విజయనగర సామ్రాజ్య ఆధిపత్యాన్ని చేపట్టినవాడు. తిప్పకు ఇద్దరు కుమారులు. తిరుమలై దేవ మహారాజు (తిమ్మ లేక గోప తిమ్మ) పెద్దవాడు. త్రిపురాంతక రెండో కుమారుడు. ఇతను రెండో దేవరాయల బావమరిది. సాళువ వంశీయుల మాదిరిగానే ఇంకా బలవంతులైన రాజులు ఉన్నప్పటికీ, వారు సాళువులకు మల్లే ఐక్యత లేక బలహీనులుగానే ఉండసాగారు. వీరిలో ఒకరు వల్లభాయదేవ మహారాజు, క్రీస్తుశకం 1469లో ఉదయగిరి రాజ్యంలో పొట్టాపినాడులోని ''పరందలూరు'' గ్రామాన్ని శ్రీస్వామివారికి సర్వమాన్యంగా దానం చేశాడు. తెలుగు చోళుల సంతతివాడు కువలగుంతకు చెందిన నాల్లన్ తిరుమలరాజు కుమారుడు శ్రీమాన్ మహామండలేశ్వర తిమ్మయ దేవచోళ మహారాజు పాదవీడు రాజ్యాన్ని పాలించేవాడు. ఈ రాజు తిరుమల శ్రీవారికి క్రీస్తుశకం 1465లో తెప్పాతినాగన్ చావడి, పాదవీడు రాజ్యంలోని ఒక గ్రామాన్ని దానం చేశాడు.
కోనేరు రాజు మరుత్తువాక్కుడి గ్రామం కావేరీ నదీ తీరాన ఉంది. కోయిల్ కెల్వి ఎంబెరుమన్నార్ జియ్యరుకు దానంగా ఇచ్చారు. ఈ గ్రామాన్ని జియ్యరు స్వామి తిరుమల శ్రీవారికి క్రీస్తుశకం 1494లో బహుమతిగా ఇచ్చారు. కొమ్మరాయ ఉడైయార్ కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. 1.పెరియ తిమ్మరాజ ఉడైయార్. వెట్టువ కులత్తూరు సంబంధిత పుదుచ్చేరి గ్రామాన క్రీస్తుశకం 5.6.1494లో శ్రీస్వామివారికి దానం చేశారు. కొమ్మరాయ ఉడైయార్ రెండో కొడుకు సిరుతిమ్మరాజ ఉడైయార్. ఇతను శ్రీస్వామివారికి అనేక బహుమానాలు ఇచ్చాడు. కిమ్మరాయ ఉడైయార్ కుమార్తె లక్ష్మీ అమ్మన్ శ్రీవేంకటేశ్వర స్వామికి నైవేద్యాలు పెట్టారు. పెరియ తిమ్మరాజు భార్య పెరియ నరసమ్మ శ్రీస్వామివారికి 1400ఫణాలు క్రీస్తుశకం 1494లో చెల్లించింది. సంగమ వంశపు కడపటి రాజు రెండో విరూపాక్షుడు విజయనగర సామ్రాజ్యాన్ని అదుపులో ఉంచుకుని పరిపాలన సాగించలేకపోయాడు. సామంతరాజు ఇతర అవకాశవాదులైన రాజులు తిరుగుబాటు చేశారు. ఇదే అదనుగా చేసుకుని విజయనగర సామ్రాజ్య ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు సాళువ నరసింహరాయలు. ఇతని దగ్గర బలమైన మూలబలం చంద్రగిరి కోటలో ఉండటంతో ఇతర సామంతరాజులు ఎవరూ ఎదిరించలేకపోయారు. అంతేకాక ఇతను రాజ్యకాంక్షతో తన సహపాటి రాజులతో సఖ్యత పెంచుకోలేదు. యుద్ధాలు చేయలేదు. విజయనగర సామ్రాజ్యంలోని మూలబలాన్ని మహామంత్రి హోదాలో తనవైపుకు మరల్చుకున్నాడు. రెండో విరూపాక్షుని హత్యతో విజయనగరం ఇతర రాజుల కైవసం కానీయకుండా తన వశం చేసుకున్నాడు. మొదట చంద్రగిరి ప్రభువై ఆపై విజయనగర రాజయ్యాడు. క్రీస్తుశకం 1450 నుంచి 1493వరకు 44 ఏళ్ళపాటు ఏకచ్ఛత్రాధిపతిగా, తిరుగులేని రాజుగా విజయనగర సామ్రాజ్యాన్ని పాలించాడు.
సాళువ నరసింహరాయలు
సాళువ వంశ పూర్వీకులు కల్యాణపురాన్ని రాజధానిగా చేసుకుని పాలన సాగించారు. మొదటి గుండయదేవ మహారాజు, సాళువ మంగిదేవ మహారాజు, అతని సోదరుడు గౌతయ ఈ కల్యాణపురాన్ని ఏలారు. గౌతయ కుమారుల్లో ఒకరు మూడో గుండదేవ మహారాయలు. ఈ గుండదేవ మహారాయల పుత్రుడే సాళువ నరసింహులు. సాళువ నరసింహులు తన రాజధానిని కల్యాణపురం నుంచి చంద్రగిరికి మార్చాడు. చంద్రగిరి శ్రీవేంకటేశ్వరుని నిలయమైన వేంకటాద్రికి సమీపంలో ఉంది. ఈ చంద్రగిరి పర్వతమయం. శత్రురాజుల ప్రవేశానికి అభేద్యమైంది. ఈ కారణంగానే సాళువ నరసింహరాయలు ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. సంగమవంశీయుడైన మల్లికార్జున పరిపాలనా కాలంలో సాళువ నరసింహ చంద్రగిరి రాజ్యానికి అధిపతిగా ఉన్నాడు. ఆనాటి విజయనగర రాజుల మూల బలం చంద్రగిరిలో కూడా ఉండేది. ఆ సైన్యానికి సేనాధిపతిగా ఈ సాళువ నరసింహరాయలు ఉన్నాడు. మూలబలంతో పాటు తన బలాన్ని కూడా పెంపొందించుకున్నాడు. చిత్తూరు, వెల్లూరు, చెంగల్పట్టు, దక్షిణ ఆర్కాటు జిల్లాల వరకు తన ఆధిపత్యాన్ని పెంచుకున్నాడు. విజయనగర సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా, సర్వాధిపత్య సేనానిగా ఎదిగాడు. సాళువ వంశీయులు అత్యంత బలవంతులు కావడంతో ఇతర సామంతుల నుంచి తిరుగుబాటు రాలేదు.
సాళువ రాయలు శ్రీవారికి చేసిన సేవలు
సాళువ రాయలు తన సైన్యాన్ని అప్రమత్తం చేసి కళింగ దేశంపై దండెత్తి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దక్షిణ భారతంపై దండెత్తి అక్కడి రాజులను ఓడించి వారిని తన వైపునకు మరల్చుకున్నాడు. రెండో విరూపాక్షుని పాలన క్షీణించడంతో తానే విజయనగర సామ్రాజ్యాధిపతిగా ప్రకటించుకున్నాడు. మహామండలేశ్వరుడిగా, మీదినీ మీసరగండగ, కఠారి సాళువుగా, మహారాజాధిరాజుగా, విజయనగర సామ్రాజ్య పాలన సాగించాడు. ఇతని తండ్రి సాళువ గుండయదేవ మహారాజు, తల్లి మల్లాంబిక. సాళువ తిమ్మరాజు దేవ మహారాయ ఉదయార్ ఇతని సోదరుడు కాగా, శ్రీరంగదేవి ఇతని భార్య. ఇతనికి ముగ్గురు కొడుకులు. 1. కుమార నరసయ్య ఇమ్మడి (నృసింహగా ప్రసిద్ధి చెందాడు) 2. చిక్క సంగమ 3. పెరియ సంగమ. ఇతని సేనాని ముఖఫలం నాగమ నాయకుడు, ఎంతో సన్నిహితునిగా ఉంటూ సాళువ నరసింహరాయలకు తోడ్పడుతుండేవాడు. విజయనగర సామ్రాజ్య పరిపాలనలో సాళువ నరసింగరాయలు తిరుమలశ్రీవారికి చేసిన సేవలు అమోఘం. స్వామి దేవాలయంలో అనేక ఉత్సవాలు ప్రవేశపెట్టాడు. పూజా విధానంలో వేద పారాయణం, అర్చనలు, మంత్రోక్తంగా సాగేట్లు ఏర్పాటు చేశాడు. ఉత్సవకాలంలో ఉత్సవర్లకు అత్యంత వైభవోపేతమైన నగలు, నాణాలు మలయప్ప స్వామికి శ్రీదేవి, భూదేవిలకు సమర్పించి ఎంతో ఆకర్షణీయంగా చూపరులకు ఆనందం గొల్పేట్లు వేడుకగా తిరువీధుల్లో సాగేట్లు ఏర్పాటు చేశాడు.
తిరువీధుల్లో ఉత్సవం నడిచినప్పుడు దారి పొడుగునా దివిటీలతో దీపాలు వెలిగించి ఆ దీప కాంతుల్లో దేదీప్యమానంగా స్వామి ఊరేగేలా చేశాడు. ఉత్సవర్లకు ముందు ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, ఎద్దులు అలంకరణలతో ముందుకు సాగుతుండేవి. భాజాభజంత్రీలు మోగుతుండగా వీనుల విందైన సంగీతం వాయిస్తుండగా, భక్తులు గోవింద గోవింద అనే జపంతో భూమి దద్దరిల్లేట్టు తన్మయత్వంతో పాటలు పాడుతూ, ఆడుతూ ఉత్సవంలో నడిచేవారు. తిరుమల, తిరుపతి పుణ్యక్షేత్రాల్లో గోపురాలు, మంటపాలు, ప్రాకారాలు కట్టించాడు. పురాణాల్లోని సుందర కథలను శిల్పనైపుణ్యంతో తీర్చిదిద్దించాడు. దేవాలయాల్లో రంగవల్లులు దిద్దిన్హి ఆకర్షణీయంగా తయారుచేశాడు. క్రీస్తుశకం 1457లో అల్లిపురం అనే గ్రామాన్ని సర్వమాన్యంగా తిరుమల శ్రీవారికి సమర్పించాడు. ఈ గ్రామం నుంచి వచ్చే ఆదాయంతో శ్రీస్వామివారికి నిత్యం ''రాజన్న తిరుప్పోనకం'' అని పిలిచే నేతి పొంగలిని ఉదయకాల సంధిలో నైవేద్యంగా పెట్టమని ఆజ్ఞాపించాడు.
క్రీస్తుశకం 1468లో చంద్రగిరి రాజ్యంలోకి తెప్పైనాడులోని వంజిప్పాకం, మల్లిమాలై, సేరులక్కూరు, భీమాపురం.. ఈ 4 గ్రామాల ఆదాయం పడైవీడు సిర్మాయిలో ఉన్న వలాల్మాన కొండ గ్రామ ఆదాయం మొత్తం ఐదు గ్రామాల ఆదాయాన్ని ''సంధిముప్పాడు'' అని పిలుస్తూ ముప్పై యూనిట్లు వండిన అన్నాన్ని స్వామికి నైవేద్యంగా పెట్టడానికి దానం చేశాడు. మురుకుంబుట్టులోని బ్రాహ్మణ అగ్రహారాన్ని సర్వ మాన్యంగా క్రీస్తుశకం 1468 లో శ్రీస్వామివారికి ఇచ్చాడు. ఇదే సంవత్సరంలో మాంగోడు వేలాడు, మన వూరు గ్రామాలను శ్రీస్వామివారికి సమర్పించాడు. క్రీస్తుశకం 1474లో శ్రీవారి దేవాలయంలో కొత్తగా డోలోత్సవాన్ని ప్రవేశపెట్టాడు. ఈ డోలోత్సవ నిర్వహణకు పాదవీడు రాజ్యంలోని కలివాయి పర్రులోని దొమ్మరపట్టి గ్రామాన్ని సర్వమాన్యంగా దానం చేశాడు.
ఐదురోజులు జరిగే ఈ ఉత్సవంతోబాటు సంధి నైవేద్యం తన తల్లి మల్లయ్యమ్మ పేరిట జరిగేట్టు ఏర్పాటు చేశాడు సాళువ నరసింహరాయలు. తిరుమలలో ఊంజల సేవను కొత్తగా ప్రవేశపెట్టినట్లు ఒక శాసనంలో పేర్కొన్నారు. అదే శాసనంలో ఈయనే ధర్మ ముగతిరుప్పల్లి ఒడం తిరునాళ్ళు అంటే తెప్పోత్సవం జరిపించారు. ఈ తెప్పోత్సవం సందర్భంగా నాలుగు అప్పాలు శ్రీవారికి నైవేద్యంగా పెట్టే ఏర్పాటు చేశాడు. ఊంజల్ సేవ ఐదురోజులపాటు జరిగినట్లు తిరుమల, తిరుపతి దేవాలయాల్లో శాసనాలు ఉన్నాయి. తెప్పోత్సవాలు క్రీస్తుశకం 1505 లో క్రీస్తుశకం 1524లో జరిగినట్లు శాసనాలు ఉన్నాయి. అచ్యుతరాయల కాలంలో జలక్రీడై,తిరుప్పల్లి ఓడం తిరునాళ్ళు అని పిలిచే తెప్పోత్సవం 9 రోజులపాటు జరిపించినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి.
శ్రీరామనవమి, కృష్ణాష్టమి, నరసింహ జయంతి ఇత్యాది ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణం, శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు, కృష్ణుని జన్మనక్షత్రమైన రోహిణి, శ్రీ గోవిందరాజస్వామి అవతార నక్షత్రమైన ఉత్తర – ఇత్యాది నక్షత్ర దినాల్లో ఆయా దేవుళ్ళకు తిరుమంజనాలు చేయించి విశేష వైభవంగా అలంకరించి వీధి ఉత్సవాలు జరిపించడం ప్రారంభించారు. ఆళ్వారుల, ఆచార్యుల తిరు నక్షత్రాలలో కూడా ఇలాంటి పూజలు జరిపించారు. అమావాస్యలతో కూడిన రోజుల్లో అంటే దీపావళి, ఉగాది, రథసప్తమి లాంటి పుణ్య దినాల్లో కూడా శ్రీస్వామివారికి విశేష పూజలు జరిపించి ఆస్థానాలు చేస్తున్నారు. సంక్రమణ దినాలైన మకరసంక్రాంతి రోజుల్లో కూడా శ్రీస్వామికి విశేషపూజలు జరిపి ఆస్థానాలు గావించారు. క్రీస్తుశకం 1476 లో శ్రీసాళువ నరసింహరాయలు శ్రీస్వామివారికి ముప్పై సంధి పూజలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక సంధిపూజ తన పేరుతో జరిగేట్టుగా, దానికి ''నరసింహరాయ సంధి'' అనే పేరు పెట్టాడు. సాళువ నరసింహరాయల పరిపాలనాకాలం నాటికి తిరుమల శ్రీవారి సన్నిధిలో అప్పటికి సంవత్సరానికి నాలుగు బ్రహ్మోత్సవాలు జరుగుతుండేవి.
1.పురటాశి నెలలో బ్రహ్మ ప్రారంభించినది
2. మార్గశి నెలలో శామవై పల్లవ రాణి
3. ఆడి నెలలో తిరువేంకటనాథ యాదవరాయలు
4. మాశినెలలో రెండో హరిహరరాయలు ముల్లై తిరు వేంకట జియ్యరు ఏజెంటుగా జరిపించాడు
అలాగే తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామికి సంవత్సరానికి రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
1.వైయ్యాశినెలలో దేవాలయ ప్రతిష్ఠతో ప్రారంభమైంది
2. ఆణి నెలలో శ్రీ వీరనరసింగదేవయాదవ రాయల భార్య యాదవ నాచియార్ ప్రవేశపెట్టింది.
ఈ ఆరు బ్రహ్మోత్సవాలు గాక మరో ఉత్సవం తోబాటు (ఊంజల్ ఉత్సవం, తెప్పోత్సవం) ఏడు ఉత్సవాల్లో ఎడోరోజు ఉత్సవర్లకు నైవేద్యంగా నాలుగు అప్పపడులను ఏర్పాటు చేశారు. ఈ నైవేద్యం సాళువ నరసింహరాయలు తన పేరిట, తన కుమారులైన కుమార నరసయ్య, చిక్క సంగమ, పెరియ సంగమ పేరిట దేవాలయంలో సంపంగి ప్రాకారంలో తాను కట్టించిన నాలుగు స్తంభాల మండపంలో జరిగేట్టు చేశాడు. తిరుమల రాయ మంటపానికి లోపల ఎత్తైన పీఠంపై ఒక మంటపం ఉంది. ఈ మంటపాన్ని అనాన ఊంజల్ మంటపం అంటారు. ఈ మంటపాన్ని కూడా సాళువ నరసింహరాయలు కట్టించి శ్రీ మలయప్పస్వామికి శ్రీదేవి, భూ దేవేరులకు ఏడు రోజులు జరిగేట్లు ఊంజలసేవను ఏర్పాటు చేశాడు. ఆరవీడు రాజైన తిరుమల రాయలు ఈ ఊంజల మంటపానికి ముందు శిల్ప కళానైపుణ్యంతో ఎత్తైన మంటపాన్ని కట్టించాడు. దీన్నే తిరుమల రాయ మంటపం అని ఇప్పటికీ పిలుస్తున్నారు.
సాళువ నరసింహరాయలు తిరుపతి, తిరుమలలో అనేక మంటపాలు కట్టించాడు. శ్రీవారి ఆలయంలో సంపంగి ప్రాకారంలో నాలుగు మూలలా నాలుగు మంటపాలు, స్వామి పుష్కరిణి చుట్టూ మంటపాలు, వేయికాళ్ళ మంటపంలో దక్షిణ వైపున పాత మంటపం, తిరుమల రాయ మంటపం లోపల ఉన్న ఊంజల మంటపాన్ని ఇంకా అనేక మంటపాలను తన పేరిట కట్టించాడు. ఇందుకయ్యే ఖర్చు తను భరించేందుకు స్వర్ణముఖీనదీ తీరాన ఉన్న దుర్గ సముద్రాన్ని శ్రీవారికి సర్వమాన్యంగా సమర్పించాడు.
ఇంకా ఉంది...
Tirumala vaibhavam Serial-31, tirumala glorious history oonjal utsav, tirumala venkateswara teppotsav, tirumala vaibhavam and saluva narasimharaya, achyutaraya 9 days teppotsav in tirumala vaibhavam