Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 15
?>

తిరుమల వైభవం సీరియల్ - 15

Tirumala vaibhavam Serial- 15

దేసు వెంకట సుబ్బారావు

 

కర్కటే పూర్వఫల్గున్యాం తులసీ కాననోద్భవం, పాండ్యే విశ్వంభరాం గోదాం

వందే శ్రీరంగ నాయకీం నీలంగస్తన గిరితటీసుప్త ముద్యోధ్య కృష్ణం  పారార్ధ్యం

స్వం శృతి శత శిరస్సిద్ధ మధ్యావయంతీ స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా

బలాత్కృత్య భుంక్తే, గోదా తస్యైనమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ

 

విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరు నందు శ్రీకృష్ణ ఆలయానికి నిత్య పుష్ప కైంకర్య మూర్తి. మూర్తీభవించిన భగవత్స్వరూపులు. తనువూ, మనసు అంతా శ్రీమహావిష్ణువు ధ్యానం తప్ప మరేమీ తెలీనివాడు. రకరకాల పూలమాలలతో శ్రీకృష్ణుని అలంకరించడంలో ఆనందానుభూతిని పొందడంలో దివ్యానురాగ చక్రవర్తి.

 

అది క్రీస్తుశకం 776వ సంవత్సరం. కర్కట లగ్నం, పుబ్బా నక్షత్రం. ఆ పవిత్ర దినాన, నిత్య హరినామదాసుడు విష్ణుచిత్తుడు ఆలయ ఉద్యానవనంలో ఇంద్ర ధనుస్సును పోలిన పుష్పవనంలో హరినామ సంకీర్తన చేస్తూ, భగవానుని పాదార్చనలో తనువు బాయాలని అర్రులు చాచే పూబాలల సేకరణకై ఉద్యానవనం కలయతిరుగుతున్నాడు. రకరకాల పూమాలల అలంకరణతో వాసుదేవుని దివ్యమంగళ రూపం చూడాలనే తపన విష్ణుచిత్తునిది. అలా తిరుగాడుతున్న విష్ణుచిత్తునకు తులసిమొక్కల చెంత బంగారు వర్ణ రంజితమైన ఒక పసిపాప బోసినవ్వులు విరబూస్తూ పూలామాలికల మధ్య పూబాలిక మాదిరిగా కనిపించింది. పరిసరాలు గమనించాడు. ఎవరూ లేరు. చుట్టుపక్కల విచారించాడు. ఎవరూ తమ బిడ్డ కాదన్నారు. అంతట ఆ పసిడి బాలిక తనవైపే నవ్వులు చిందిస్తూ ఉండటంతో పరవశుండైన విష్ణుచిత్తుడు ఆ బాలిక భగవంతుని అరుగ్రహించిన బిడ్డగా తన భార్యకు అందజేశాడు. సంతాన విహీనులైన ఆ దంపతులకు బాలిక పూమాలిక అయింది. ఎంతో అందంతో, నిత్యసంతోషిణి అయిన ఆ చిన్నారికి కోదై అని నామకరణం చేశారు. ఈమెకు ''చూడిక్కొడుత్త నాచ్చియార్'', ''ఆండాల్'', గోదాదేవి'', ''ఆముక్తమాల్యద'' – అని పేర్లున్నాయి. ఈమె కధనే శ్రీకృష్ణదేవరాయలు ''ఆముక్తమాల్యద'' పేరుతో అమూల్య గ్రంధంగా మలచాడు. ఈమె భూమాత అంశగా జన్మించింది. అల్లారుముద్దుగా ఉన్న గోదాదేవికి విష్ణుచిత్తుడే పంచ సంస్కారాలు చేశాడు.

 

నారాయణుడీతడు నరులార మీరు శరణనరో మిమ్ము గాచును

తలచిన చోటను తానే ఉన్నాడు వలెననువారి కైవశమెపుడు

కొలచెను మూడడుగుల జగమెల్లను కొలచినవారిని చేకొననుండునా

ఎక్కడ పిలిచిన ఏమి అని పలికి మొక్కిన మన్నించు మునుముగాను

రక్కసులనణచి రక్షించు జగములు దిక్కని నమ్మిన తిరముగ నేలడా

చూచిన యందెల్ల చూపును రూపము ఓచిక పొగడిన ఉండునోటను

 

అన్నట్లు నిరంతరం వాసుదేవుడినే నమ్ముకున్న విష్ణుచిత్తుడు తన నిత్య కైంకర్యమైన పూమాలలు వనమాలికి అందించే విషయంలోనూ అల్లికలోనూ, అలంకరణలోనూ తన కుమార్తె కూడా చిట్టి చిట్టి చేతులతో సహకారం అందించి చిట్టి చిట్టి సేవలు చేసేది. ఆ చిరుసేవయే తండ్రికి మహదానందం కలగాజేసేది. పరవశించి తండ్రి పోయేవాడు ఆ చిన్నారి సేవలకు. ఇలా దినదిన ప్రవర్ధమానంగా అతి సౌందర్య రాశిగా పెరగసాగింది గోదాదేవి. ఈ సుగుణాల రాశిని చూసి విష్ణుచిత్తుడు ఒక వంక పరమానందభరితుడౌతూ మరోవంక ఇంత సద్గుణ సౌందర్యరాశికి ఎవరిని వరునిగా తేవాలి - అని ఆందోళనపడసాగాడు. నిత్యం స్వామి అలంకరణకే కాదు తన అలంకరణలో కూడా ఎనలేని శ్రద్ధ చూపించేది గోదా. యువతులకు ఆ వయసులో అలంకరణపై ధ్యాస ఉండటం సహజమే కదా! పూలమాలలతో రకరకాల అలంకరణలు చేసుకోవాలని తపించేది. కానీ తండ్రి ఆ తోటలోని పూలన్నీ మాధవుని సేవకేనని ఆజ్ఞాపించడంతో ఆ పూలను తాను అలంకరించుకునేందుకు తటపటాయించేది. కానీ తన సౌందర్యాన్ని పూమాలల అలంకారంతో మరింత శోభింపచేసుకోవాలనే తన ఆశను ఎలా తీర్చుకోవాలని ఆలోచించి ఒకరోజు తన తండ్రి మాధవుని అలంకరణకు సిద్ధం చేసుకున్న పూమాలలను తాను ధరించి ఆ తోటలో ఉన్న బావినీటిలో తన అందాన్ని చూసుకుని మురిసిపోయింది. తర్వాత ఆ పూమాలలను యధాస్థానంలో ఉంచి స్వామి సేవకు అందించేది. ఇది గమనించని విష్ణుచిత్తుడు ఆ పూమాలలను పరమ పావనమూర్తికి పరవశంతో అలంకరణకు ఆలయంలో అందించాడు. ఎందుకో ఆనాడు శ్రీకృష్ణుడు ఆ మాలలను ధరించినంతలో మరింత సౌందర్యంగా గోచరించాడు. అంతటా విష్ణుచిత్తుడు గోదాదేవి అందించినందువల్ల వాసుదేవుడు ఆరోజు మరింత సౌందర్యంగా కనిపించాడు అనుకుని ప్రతిరోజూ గోదాదేవిచేత అందుకున్న పూలమాలలానే స్వామికి సమర్పించేవాడు. ఇలా కొంతకాలం గడిచింది.

 

ఎప్పుడూ కాలం ఒకలాగే ఉండదుకదా! ఎంతో భక్తి పారవశ్యంతో గోదాదేవి చేత అందుకున్న పూమాలలను భట్టనాథునకు ఒకరోజు ఆ పూలమాలల్లో ఒక పొడవాటి వెంట్రుక కనిపించింది. వెంటనే విష్ణుచిత్తుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి అది స్త్రీమూర్తి కేశంగా భావించి తన కుమార్తె గోదాదేవిని ఆ విషయమై విచారించాడు. గోదాదేవి ప్రతిరోజూ తాను చేసే పనిని తెలుసుకున్న విష్ణుచిత్తుడు నిశ్చేష్టుడయ్యాడు. ఎంతో గారాబంగా పెంచుకున్న తన కుమార్తె చేసిన పనికి నొచ్చుకుని ఇకపై అలాంటి తప్పు చేయొద్దని మందలించాడు. అంతేకాదు, నిర్మాల్యమైన ఆ పూలమాలలను స్వామికి నివేదించకుండా ఎంతో విచారంగా ఇంటికి చేరుకొని తన కుమార్తె చేసిన తప్పు క్షమించమని ఆ దేవదేవుని వేడుకుని నిద్రలోకి జారుకున్నాడు.

 

అలసటతో నిద్రించిన విష్ణుచిత్తునికి కలలో మహావిష్ణువు వటపత్రశాయిగా ప్రత్యక్షమై ''ఏం భట్టనాథా! ఈరోజు నాకు పూమాలలు సమర్పించలేదేం?'' అని ప్రశ్నించాడు. దానికి ముకుళిత హస్తాలతో వినమ్రతాంజలి ఘటించిన విష్ణుచిత్తుడు ''స్వామీ! ఈరోజు ఘోర తప్పిదం జరిగింది. తమకు సమర్పించవలసిన పూలమాలలు నా కుమార్తె ధరించినందున ఆ నిర్మాల్య మాలలను తమకు సమర్పించ ఇచ్చగించనందున ఆలయానికి తేలేదు, మన్నించండి'' అని వేడుకున్నాడు. అంతట భగవానుడు నవ్వుతూ ''ఓ విప్రుడా! నీకు ఇప్పుడే తెలిసింది. కానీ ఆ బాల ముడిచిన పూలమాలలు చాలాకాలం నుండే నేను అమితానందంతో ధరిస్తున్నాను. అవే నాకు సంతోషాన్ని, ఆనందాన్ని కలగాజేస్తున్నాయి. కనుక నీవు నిర్భీతిగా ఆమె ధరించిన మాలలనే నిత్యం నాకు సమర్పించవచ్చు'' అని ఆనతిచ్చాడు. అంతటా ఉలిక్కిపడి నిద్ర లేచిన విష్ణుచిత్తుడు భగవానుడు ఆదేశించిన విధంగా గోదాదేవి ధరించి ఇచ్చిన మాలలనే ఇకపై ఆలయంలోని వటపత్రశాయికి సమర్పించ సంకల్పించాడు.

 

ఇదే విషయాన్ని అక్కడి ప్రజలకు తెలియజేసి తన బిడ్డ మహాలక్ష్మి అంశగా ఎంచి నిత్యం ఆమె ధరించి విడిచిన మాలలనే ఆలయస్వామికి సమర్పించసాగాడు. అప్పటినుండి ఆమెను చూడికొడుత్త నాచ్చియార్ అని, ఆముక్తమాల్యద అని పిలవసాగారు. ఇదే పేరుతో శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద గ్రంథాన్ని రచించి ఆంధ్రభోజుడని పేరు తెచ్చుకున్నాడు.

 

విష్ణు కైంకర్య నిరత అయిన గోదాదేవి అత్యంత భక్తితో, దైవీగుణ సంపన్నయై దివ్య సౌరభంతో జ్ఞాన వైరాగ్యాదులగు విశేష గుణాలతో ఆళ్వారులను మించి వికసింపసాగెను. అందునా పరమపురుషుడైన వటపత్రశాయియే తాను ధరించినప్పుదు ఏ మగువ మాత్రం తన జీవిత సర్వస్వం అర్పించకుండునా?!

 

ఈవిధంగా తన కుమార్తె పరమాత్ముని పరిష్వంగానికై పరితపిస్తుందని భావించిన విష్ణుచిత్తుడు ''అమ్మా! పూర్వం గోపికలు శ్రీకృష్ణుని పొందగోరి ఒక వ్రతం ఆచరించారు. నీవు కూడా ఆ వరం ఆచరించి పరమాత్మను చేపట్టగలవని చెప్పి ఆనాడు గోపికలు ఆచరించిన ధనుర్మాస వ్రతాన్ని ఉపదేశించాడు. అంతేగాక ఆ వ్రతాన్ని ఎలా చేయాలో విశదీకరించి వ్రత మహిమను కూడా బోధించాడు.

 

హేమంతే ప్రథమే మాసి నంద ప్రజకుమారికా

చేరుర్హవిష్యం భుంజానా కాత్యాచన్యర్చన వ్రతం

 

కాత్యాయనీ మాత వ్రతాన్ని చేయ సంకల్పించిన గోదాదేవి ఎముకలు కోరికే చలికాలంలో ఉదయాన్నే చన్నీటితో స్నానం చేసి, ఒంటిపూట భోజనంతో ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతాన్ని ఆచరించింది. అంతేకాకుండా ఆ మాసమంతా రోజుకొక గీతాన్ని గానం చేసింది. అలా కూర్చిన ముప్పై పాశురాలనే తిరుప్పావై పేరుతో ప్రసిద్ధిచెందింది. ఇంతేకాకుండా గోదాదేవి నాచ్చియార్ తిరుమొళి అనే 140 గాథలున్న మరొక ప్రబంధాన్ని కూడా రచించింది. ఈమె రచించిన భావనామృన్ని గ్రహించిన మీరాదేవి కూడా హిందీలో ఆ మురహరునిపై విరహగీతాలాపన చేసింది.

 

నిత్యం మురహరుని ధ్యానంలో మునిగిపోయి నిద్రాహారాలు మరచి కృశించిపోతున్న తన కుమార్తె గోదాదేవిని చూసిన విష్ణుచిత్తుడు ''ఏమ్మా! ఎందుకలా ఉన్నావు? నీవు కోరిన విధంగా ఆ మురహరునికే నిన్ను కట్టబెడతాను. కానీ ఆ మహావిష్ణువు ఈ భువిపై 108 దివ్య తిరుపతుల్లో వెలసియున్నాడు. నీవు కోరిన వానికిచ్చి వివాహం చేయదలచాను'' అని ఆ 108 దివ్య తిరుపతుల వైభవాన్ని అక్కడ వెలసిన శ్రీమహావిష్ణువు దివ్య రూపాన్ని వర్ణించసాగాడు. ఆసాంతం అన్ని గాథలు విన్న గోదాదేవికి శ్రీరంగనాథుని వైభవం గురించి వర్ణిస్తున్నప్పుడు ఆమె ముఖారవిందం వికసించడం చూసి ఆ శ్రీరంగనాథుదే తన గారాలపట్టికి తగిన వరునిగా ఎంచి అతనికే ఇచ్చి వివాహం చేయ నిశ్చయించుకున్నాడు.

 

ఎగిరి నీ పాదముల చెంత కెట్లు వచ్చి వాలుడునో యన్న యుత్సుకత్వంబు కలడు సాధ్యసాధనమైన పక్షముల జంట హృదయమున కుండి శరీరమునకు లేదు ఓ శ్రీరంగపతీ, ఇంతకాలం ఈవిధంగా నీ కొరకు పరితపించవలె? ఒక్కమారుగా ఎగిరి వచ్చి నీ పాదాంబుజములను చేరవలెనాన్న ఆశ మిక్కిలి అధికమగుచున్నది. అయ్యో నా హృదయమునకు రెక్కలు ఉన్నవి కానీ, నా శరీరమునకు లేవే. ఒక పక్షిగా పుట్టిన నిన్ను క్షణంలో చేరి నీ పరిష్వంగం చేరేదాన్ని కదా'' అని వాపోయింది.

 

భట్టనాథుని వాక్యాలకు తన హృదయ విపంచి వినీలాకాశంలో పయనించసాగింది. భట్టనాథుని కోరిక మేరకు ఆలయాధికారులు ఈ విషయాన్ని ఆ దేశపు రాజైన వల్లభదేవునికి విన్నవించారు. దానికి ఎంతో సంతోషించిన వల్లభదేవుడు శ్రీవిల్లి పుత్తూరులోని శ్రీకృష్ణ ఆలయ పరిసరాలు సర్వాలంకారాలతో అలంకరించి పెళ్ళి శోభ తెచ్చాడు. మంగళవాద్యాలు, గజ, తురగ పదాతి దళాలతో వల్లభదేవుడు రాచమర్యాదలతో గోదాదేవిని శ్రీరంగం తీసుకుని వచ్చాడు. దారంతా గోదాదేవి రచించిన తిరుప్పావై జనులంతా పఠిస్తుండగా శ్రీరంగంలోని సప్త ప్రాకారాలు వివాహ శోభతో దేదీప్యమానంగా ప్రకాశించసాగాయి. పెళ్ళి పల్లకిలో శ్రీరంగం చేరిన గోదాదేవికి ఘనంగా స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. ఆలయ ప్రాంగణం అంతా ముత్యాలముగ్గులతో, మంగళతోరణాలతో శోభిస్తోంది.

 

అక్కడి ప్రజలంతా దివ్య ప్రబంధంలోని పాశురాలను మనోహరంగా గానం చేయసాగారు. ఆలయ ప్రాంగణం అంతా శ్రీరంగనాథుని నామస్మరణతో మారుమోగింది. శ్రీవైష్ణవులు దివ్య పాశురాలను గానంచేస్తున్నారు. వందిమాగధులు స్తోత్ర వచనాలు పలుకుతున్నారు. గజాలు, అశ్వాలు ప్రత్యెక అలంకరణతో ఆలయ ప్రాంగణం చేరుకున్నాయి. మంగళవాద్యాలు శ్రావ్యంగా గానం చేస్తున్నాయి. అప్సరసలను పోలిన నృత్యాంగనలు ఆడుతూ పాడుతున్నారు. భట్టనాథులు, వల్లభదేవుడు గోదాదేవి ఉన్న పల్లకికి ఇరువైపులా నడుస్తున్నారు. నగరకాంతలు గోదాదేవిపై మంగళజలములు కురిపించసాగారు. శ్రీరంగనాథుని కూడా నూతన వధువుగా అలంకరించారు. శ్రీమహాలక్ష్మి ఆగమనాభిలాషియైన శ్రీమహావిష్ణువు కూడా అత్యంత శోభతో ప్రకాశించాడు.

 

అంతట గోదాదేవి శంతను మండపం నుండి శ్రీరంగవిమానం చేరుకుంది. అక్కడ శేషశాయి అయిన శ్రీరంగని పాదపద్మములను చేరిన గోదాదేవి ఆ రంగానిలో ఐక్యమైంది. ఈ దివ్యదృశ్యాన్ని కాంచిన విష్ణుచిత్తునికి గుండె ద్రవించగా విచారగ్రస్తుదగుట చూసిన శ్రీరంగనాథుడు అశరీరవాణితో ధైర్యం చెప్పి ''శ్రీవిల్లి పుత్తూరులో తనకు నిత్యం పుష్ప కైంకర్యం చేయమని, తన సతి తనను చేరినందున నీవు నిశ్చింతగా ఉండ''మని ఆనతిచ్చాడు. తదుపరి విష్ణుచిత్తుడు శ్రీవిల్లి పుత్తూరు చేరి తన కుమార్తె రచించిన దివ్య ప్రబంధమైన తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొళి నిత్యం గానం చేస్తూ తన 85వ ఏట శ్రీవిష్ణుసాయుజ్యం చేరాడు.

 

తరువాత శ్రీరంగనాథుని ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా గోదాదేవికి ఒక ఆలయం కట్టించి నిత్యోత్సవాదులతో ఆమె అర్చనకు ఏర్పాటు చేశారు. నాటి నుండి దివ్య దేశాలయిన ప్రతి వైష్ణవాలయాలలో గోదాదేవిని కూడా ప్రతిష్ఠించి అర్చించసాగారు. పన్నిద్దరు ఆళ్వారులలో కనీసం గోదాదేవి, శఠగోపులు, రామానుజులు, తిరుమంగ ఆళ్వారులు గల వైష్ణవాలయాలే దివ్యదేశాలుగా పేర్కొనబడ్డాయి.

 

క్షీరాబ్ది జిల్కిన శ్రీధవు గోశపు నమ్యగలంకృత చంద్రముఖులు

చేరి సంప్రార్ధించి స్థిరమైన కోరికల్ పొందిన రీతిగ పుడమియందు

శ్రీవిల్లి పుత్తూర సిత పద్మ మాలికల్ దాల్చిన భట్టరుతనయద్రవిడ

భాషను పరమమౌ పద్యమాలికలను ముప్పది సాయంచె నొప్పిదముగ

భక్తివీనిని పఠియించు భక్తవరులు

నాల్గు భుజభూధరంబుల పెల్గునత్తి

యరుణలోచనముల నొప్పు హరి కటాక్ష

మంది సుఖ సంపదల గాంతు రనవరతము

(ఇంతటితో ఆళ్వారుల చరిత్ర సమాప్తం)


ఇంకా ఉంది...

 

Tirumala vaibhavam Serial-15, godadevi and 12 Alwars, godadevi and tiruppavai pashuras, the story of godadevi, godadevi and vishnuchitta, godadevi and nacchiyar tirumoli, godadevi and srivilli puttooru