Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 19
?>

తిరుమల వైభవం సీరియల్ - 19

Tirumala vaibhavam Serial- 19

దేసు వెంకట సుబ్బారావు

 

శ్రీ వేంకటాచలా ధీశం, శ్రియా ధ్యాసిత వక్షసం

శ్రిత చేతన మందారం శ్రీనివాస మహం భజే

పరమ భాగవతోత్తములైన ఆళ్వారులు అనంత భక్తి పారవశ్యంతో గానం చేసిన వేద వాంగ్మయ సాహిత్యం అజరామరమైంది. ద్వాపర యుగంలో వీరి ఆవిర్భావ ప్రస్తావన ఉన్నట్లు చెప్తారు. భాగవత మహా పురాణంలోని ఐదవ స్కందంలో నిమి మహారాజు ఖరభంజనుడితో జరిగిన చర్చా విషయాల సందర్భంలో ఈ విధంగా వివరిస్తాడు. కలియుగంలో నారాయణ భక్తులు ఎక్కువగా ద్రవిడదేశంలో ఆవిర్భవిస్తారని, వారు తామ్రపర్ణి, పాయశ్వణి, కావేరి నదీ తీరాల్లో సంచరిస్తూ భగవత్ప్రచారం చేస్తారని అంటాడు. అలాగే నమ్మాళ్వార్లు, మధురకవి తామ్రపర్ణి నదీ తీరంలోనూ, పెరియాళ్వారులు, ఆండాళ్ళు, పోయ్గై (క్మట్మల) నదీ సమీపంలోనూ, మొదలాళ్వారులు ఇంకా తిరుమలశై ఆళ్వారులు పాయశ్వనీ నదీ సమీపాన తొండర పడి ప్పొడి ఆళ్వారులు, తిరుమంగై ఆళ్వార్లు కావేరీ నదీ తీరాన జన్మించారు. అలాగే భగవదంశలైన ఆళ్వారులు ద్రవిడదేశంలో వైష్ణవ భక్తి సామ్రాజ్యాన్ని విస్తరించారు. వీరి సాహిత్యం, ఆళ్వారుల కాలానంతరం వైష్ణవ భక్తులు ఆ అమృతసారమైన సాహిత్యాన్ని అర్ధం చేసుకోలేక సాగరమర్జనం చేశారు. అలా ఆ సాహిత్యం కాలగర్భంలో కలిసిపోగా దాదాపు 200 సంవత్సరాల అనంతరం తన యోగశక్తితో ఆ సాహిత్యాన్ని అవలోకనం చేసి, సరైన పద్ధతిలో శృతిమయంచేసి గానం చేసి ద్రవిడ భక్తజనానికి అందించిన ధన్యజీవి నాథముని. అలా ద్రవిడ ప్రబంధాలను శృతిబద్ధంచేసి పామరజనులకు కూడా గానం చేయడానికి అనుకూలంగా చేసి అపర వ్యాస భగవానులుగా పేరు గాంచారు. చోళుల కాలానికి చెందిన వీరు తమిళనాట తిరునారాయణపురానికి చెందిన ఈశ్వరభట్టు అనే వైష్ణవ భక్తుని కుమారులు. ఒకనాడు తన గ్రామంలో తిరుగుతూ ఉండగా అక్కడ స్థానిక ఆలయంనుండి శ్రీమన్నారాయణుని కీర్తిస్తూ ఒక సుస్వరంతో కూడిన ఆలాపన వినిపించింది.అమృతప్రాయమైన ఆ ఆలాపన గురించి తెలుసుకోడానికి ఆలయంలోనికి ప్రవేశించాడు. నాథమునికి జీర్ణమైపోయిన ఒక తాళపత్రంలోని ఆ సాహిత్యాన్ని గానంచేస్తున్న యువకుడు కనిపించాడు. ఉత్సాహం ఆపుకోలేక నాథముని అందులోని పది పద్యాలు ఎక్కడివని ప్రశ్నించాడు. అవి తనకు నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ కనిపించాయని, వాటి వివరాలు తనకు తెలీదని చెప్పగా, తన యోగశక్తితో ఆ తాళపత్రాన్ని పరికించిన నాథమునికి అది మధురకవి ఆలవారులు తన గురుదేవులైన నమ్మాళ్వారులను స్తుతించిన తిరువాయ్ మొళి లోని పది పాశురాలని తెలుసుకున్నాడు. నమ్మాళ్వారులు పరమపదించిన తర్వాత స్థానిక వైష్ణవ భక్తులు వేదమయమైన ఆ సాహిత్యాన్ని స్పృశించడానికి భయపడి అక్కడ ప్రవహిస్తున్న తామ్రపర్ణి నదిలో నిమజ్జనం చేశారు. ఆవిధంగా భగవత్ స్వరూపాలైన ప్రబంధాలు నదీగర్భంలో కలిసిపోగా కొన్ని ఇలా లభించాయి.

 

అలా లభించిన పది పాశురాలలోని భక్తిభావ వర్షంలో తడిచిన నాథమునులకు తిరువాయ్ మోళిలోని మిగిలిన భాగమంతా వినే భాగ్యం కోల్పోయానని పరిపరివిధాల విలపించాడు. కానీ సముద్రగర్భంలో కలిసిపోయిన ఆ ప్రబంధాలను సాధించి ఎలాగైనా ఆ భక్తి సాహిత్యాన్ని అందరికీ అందించి ప్రజలందరికీ భగవన్ముక్తిని కలగచేయాలని సంకల్పించాడు. సహజంగానే యోగవిద్యాసంపన్నుడైన నాథమునులు తన యోగశక్తితో నమ్మాళ్వారులను ప్రసన్నం చేసుకున్నాడు. ఆర్తితో ప్రార్ధించి నాతమునుల ఆవేదనను అర్ధంచేసుకున్న నమ్మాళ్వారులు సంతోషించి స్వయంగా నాథమునుల ముందు నిలిచి తన జ్ఞాన సంపదనంతా ప్రసాదించాడు. అలా కాలగర్భంలో కలిసిపోయిన పాశురాలను అన్నింటినీ కూడా నాథమునులు అవగతం చేసుకునే వరాన్ని ప్రసాదించాడు. ఈవిధంగా కాలగర్భంలో కలిసిపోయిన పాశురాలను అన్నిటినీ ఆకళింపు చేసుకుని వాటికి పునరుజ్జీవనం పోయాలని భావించాడు. ఆవిధంగా ;లభించిన ప్రబంధ సాహిత్యసంపదనంతా క్రోడీకరించి, శృతిబద్ధంచేసి వైష్ణవ భక్త జనానికి అందించాడు. ఇలా శృతిబద్ధంచేసిన పాశురాలు 4000. ఈ పాశురాలే నాలాయిర దివ్య ప్రబంధంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. క్రీస్తుపూర్వం 8 వ శతాబ్దానికి చెందిన ఆళ్వారుల సాహిత్యాన్ని 10వ శతాబ్దానికి చెందిన నాథమునులు మరల వెలుగులోకి తెచ్చి దాదాపు 200 సంవత్సరాల విశ్వవ్యాపితం చేశాడు. ఈవిధంగా ద్రవిడ వేద సాహిత్యమైన ప్రబంధాలను వెలుగులోనికి తెచ్చి వైష్ణవ భక్తి సామ్రాజ్యాన్ని విస్తరించిన భక్తాగ్రణి నాథమునులు. ఈ నాథమునుల మనవడు యమునాచార్యులు. సకల శాస్త్రపారంగతుడైన యమునాచార్యులు అనేకమంది పండితులను ఓడించి అనేక రాజుల ప్రశంసలు పొంది ఆలావందాన్ అనే పేరు తెచ్చుకున్నాడు.

నమ్మాళ్వారులనే ప్రసన్నం చేసుకున్న మహా భక్తాగ్రేసరుడైన నాథమునులు తనకు సంప్రాప్తించిన ప్రబంధ సంపదనంతా శ్రీరంగనాథుని సన్నిధిలో వైష్ణవ భక్తులందరూ గానం చేసుకోడానికి అనుగుణంగా శృతిబద్ధం చేస్తుంటాడు. తమిళ ప్రాచీన గ్రంథమైన కోయిల్ ఒళుగులో వివరించిన ప్రకారం ఈ నాథమునుల శ్రీరంగ నాథుని ఆలయంలో వైష్ణవ భక్తి ప్రచారం చేయనారంభించాడు. వీరి ప్రబోధనల్లో ముఖ్యంగా వైష్ణవ భక్తి తత్వాన్ని, పాశురాలలోని ఆళ్వారుల భక్తిసారాన్ని వేద వైభవాన్ని, ఉపనిషత్తుల సారాన్ని తెలియజేసేవాడు. అంతేకాకుండా శ్రీరంగనాథుని ఆలయంలో తన శిష్యులకు యోగవిద్యారహస్యాన్ని కూడా బోధించేవాడు. ఈవిధంగా దక్షిణ భారతంలో వైష్ణవ భక్తి ప్రచారానికి నాంది పలికాడు.

 

నాథమునులవారి ప్రబోధాలకు ప్రభావితమైనవారిలో పుండరీకాక్షులు, శ్రీరామమిశ్రులు ఇంకా యమునాచార్యులు ముఖ్యులు. ఈ యమునాచార్యులనే ఆలావందార్ అని కూడా అంటారు. ఆలవందార్ నాథమునులకు మనవడు. యమునాచార్యులవారు అనేక శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఎందరో పండితులను సాహితీ చర్చల్లో ఓడించాడు. అనేకమంది రాజుల సన్మానాలు పొందిన కారణంగా వీరికి ఆలవందార్ (అంటే అన్నీ తెలిసినవాడు అని అర్ధం) అనే పేరు వచ్చింది. వైష్ణవ వ్యాప్తికి కృషిచేసినవారిలో వీరు కూడా ప్రముఖులు. వీరి బోధనల్లో పాశురాలలో ప్రవచించిన తిరువేంకటపతి వైకుంఠాన్ని వీడి తిరుమల గిరిపై నెలకొన్నాడని, అందుకే దివి నుండి స్వామిమీద నిరంతరం పుష్ప వృష్టి కురుస్తుందని ఆ అద్భుత ఆనంద సౌందర్యమూర్తిని తిలకిస్తే చ్గాకి హబ్న తరుస్త్య్బ్దబుం తెలియజేస్తూ ఆ వెంకటనాథునికి నిత్యసేవా కైంకర్యాలు చేసేవారే కరువయ్యారని వాపోయాడు. కారణం ఆ కాలంలో తిరుమలగిరులు వన్యమృగాలకు, అతి శీతల వాయువులకు, జనసంచారంలేని కిక్కిరిసిన వృక్షసముదాయంతో నిండి, జనసంచారానికి దూరంగా ఉండేవి. తిరుమలపై నివాసం అంటే అత్యంత క్లిష్టతరంగా ఉండేదని ప్రసిద్ధి. ప్రజలు అక్కడ నివసించడానికి జంకేవారని నానుడి.

 

శ్రీవైష్ణవ మత ప్రచారకుల్లో ముఖ్యంగా పేర్కొనదగినవారు నాథమునులు, యమునాచార్యులు, రామానుజాచార్యులు, పరాశరులు, లోకాచార్యపిళ్ళై, వేదాంతదేశికులు, మనవాళమామునులు. శ్రీ రామానుజాచార్యులవారి సిద్ధాంతాలను అనుసరించినవారు పెద్దజియ్యరువారు. మనవాళమామునులవారి సిద్ధాంతాలను అనుసరించినవారు చిన్నజియ్యరువారు. పెద్దజియ్యరువారు శ్రీవారి కైంకర్యాలను చేయడంలో అస్వస్థత కలిగినప్పుడు చిన్నజియ్యరువారు ఆ కైంకర్యాలను నిర్వహించారు. వీరికి కైంకర్య నిర్వహణలో ఇబ్బంది ఏర్పడినప్పుడు స్వామివారి కైంకర్యాలను నిర్వహించడానికి మనవాళమామునుల మఠానికి చెందిన ఏకాంగి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

 

యమునాచార్యులు

వైష్ణవ ఆచార్యుల్లో ముఖ్యులు, ప్రథములు శ్రీ యమునాచార్యులు. వీరు విశిష్ఠ అద్వైతాన్ని ఏర్పాటు చేసి దీనిద్వారా తన పూర్వీకుల నుండి ఆచరణీయంగా వస్తున్నా ఆచారవ్యవహారాలను, భగవద్గీత, ఆళ్వారుల పాశురాల నుండి గ్రహించిన భగవంతుని తత్వాన్ని, విశేష గుణాలను శ్రుతుల్లో ప్రవచించిన ఆచారాలను సరళీకృతం చేసి విపులీకరించారు. అలాగే శ్రీవైష్ణవ సంప్రదాయాలను ఆధారం చేసుకుని చతుశ్లోకి, స్తోత్రరత్నావళి, సిద్ధిత్రయాలైన ఆత్మసిద్ధి, సంవితసిద్ధి, ఈశ్వరసిద్ధి, ఇంకా ఆగమ ప్రమాణాలను, మహా పురుష నిర్ణయాన్ని, గీతార్ధ సంగ్రహాన్ని, నిత్యం, మాయావాద ఖండనాలను రచించారు. వీరు వేదాంతార్థాలను యమునా తీరాన నివసించే మానక్కాల్ నంబి వద్ద అభ్యసించారు. కాళింగునివల్ల విషపూరితమైన యమునానదిని శ్రీకృష్ణుడు స్వచ్చమైన నీటిగా మార్చినవిధంగా యమునాచార్యులు వేదాలలోని అర్థరహిత వ్యాఖ్యానాలను తొలగించి స్వచ్ఛమైన వేదాంత సిద్ధాంతాన్ని రచించాడు.

 

యమునాచార్యులు అక్కియాల్వన్ అనే వేదాంత పండితుని తన పదహారవ ఏట వేదాంత పటిమతో ఓడించి ఆళవందాన్ అనే బిరుదును కైవసం చేఉస్కున్నాడు. పల్లవరాణి అనుజ్ఞ మేరకు అక్కియాల్వన్ అనే వేదాంత పండితుని ఓడించాడు. తన తెలివితేటలతో ఓడించాడు. అక్కియాల్వన్ యమునాచార్యులకు 3 సమస్యలు ఇచ్చి, వాటిని తానే వ్యతిరేకించి తానే సమర్ధించాలని కోరాడు. అంతట యమునాచార్యులు 1) అక్కియాల్వన్ తల్లి గొడ్రాలు కాదు 2) తమ రాజు శక్తివంతమైన తెలివైన మహారాజు అని, 3) మహారాణి శీలవతి అని సమాధానం ఇచ్చాడు. వీటిని అక్కయాల్వన్ ఖండించలేకపోయాడు. అంతట యమునాచార్యులు మహారాజు అనుజ్ఞ మేరకు ఈవిధంగా తన సమస్యలకు ఈవిధంగా ఖండించాడు. 1) శాస్త్రాలలో చెప్పినట్లు ఒకే ఒక్క సంతానం సంతానం కాదని, అందువల్ల సాత్వి అయిన అక్కియాల్వన్ తల్లి సంతానవతి కాదని సెలవిచ్చాడు. 2) మరో సమస్యకు సమాధానంగా ఎంత శక్తివంతుడైన, సమర్థుడైన రాజైనా గర్విష్టిఅయిన అక్కియాల్వన్ వంటి పండితునికి ఆశ్రయం ఇచ్చినందున తాను సమర్థవంతమైన రాజు కాదని, పేర్కొంటాడు. ఇక చివరిడైన సమస్యకు శ్రుతుల్లో చెప్పినట్లు ప్రతి స్త్రీ వివాహ సమయంలో మొదటగా దేవతలైన సోముడిని, తర్వాత గంధర్వుని ఆ తర్వాత అగ్నిని కూడా భర్తగా స్వీకరించాలి. తర్వాత మాత్రమే తన భర్తను వరిస్తుంది. దీనికి మహారాణికూడా మినహాయింపు కాదు అని సెలవిచ్చాడు. ఈ సమాధానాలు విన్న యమునాచార్యులవారి అమోఘమైన వేదాంత పాండిత్యానికి సంతోషించి అక్కియాల్వన్ కు రాజ్య బహిష్కారం విధించి, యమునాచార్యులకు అర్ధరాజ్యం ఇచ్చి ఆలవందార్ అనే బిరుదు ప్రదానం చేశాడు.

 

ఈవిధంగా అర్ధరాజ్యం స్వీకరించిన యమునాచార్యులు దైవచింతనకు దూరమై రాజ్యపాలనకు అలవాటుపడ్డాడు. కానీ నాథమునులవారి శిష్యులైన రామమిశ్రులకు యమునాచార్యులను తన గురువుగారైన నాథమునుల తర్వాత వైష్ణవ ప్రచార సారథులుగా చేయాలని, ఎలాగైనా యమునాచార్యులను శ్రీరంగం తీసుకొచ్చి నాథమునులవారికి అప్పగించాలని భావించాడు. ఈవిధంగా భావించిన రామమిశ్రులు ఆలవందార్లను కలిసి తమ తాతగారైన నాథమునులవారి మూలధనం తనవద్ద ఉందని, దాన్ని మీరు శ్రీరంగం వచ్చి మాత్రమే తీసుకువెళ్ళాలని మనవి చేశాడు. అంతట ఆళవందార్ రామమిశ్రులవెంట శ్రీరంగం చేరుకున్నాడు. యమునాచార్యులు శ్రీరంగం చేరుకునే లోపునే నాథమునులవారు కాలంచేశారు. ఆ విషయం తెలిసిన యమునాచార్యులు చివరి క్షణాల్లో తన తాతగారైన నాథమునులను చూడలేక పోయినందుకు విచారించాడు. తర్వాత నాథమునులవారు తనకు అందించిన మూలధనాన్ని తీసుకోవాలని శ్రీరంగనాథుని ఆలయం చేరుకున్నాడు యమునాచార్యులు.

 

శేషశయనుడైన శ్రీరంగనాథుని, పద్మదళాయతాక్షుని, చిన్మయానంద స్వరూపుని, జగద్రక్షకుని, సర్వమంగళాకార నిత్య సౌందర్య విరాజితుని చూసిన యమునాచార్యులు ఆనందాశ్రువులతో, పులకించి, పరవశించి తన్మయత్వంతో మంగళా వచనాలతో 65 శ్లోకాలతో స్తోత్ర రత్నాలను రచించాడు. తర్వాత రామమిశ్రుల ఆదేశానుసారం తన తాతగారైన నాథమునులవారి కోరికమేరకు సన్యాశ్రమం స్వీకరించి యమునాచార్యులు పేరుతో శ్రీవైష్ణవ సంప్రదాయ పరిరక్షణా ప్రచార కార్యక్రమాలకు కర్తగా శ్రీకారం చుట్టాడు.

 

అపరాధ సహస్ర భాజనం పతితం భీమ భావార్ణవోదరే

అగితం శరణాగతం హరే కృపయా కేవలం ఆత్మసాత్కురు

 

ఇంకా ఉంది...

 

Tirumala vaibhavam Serial-19, tirumala hills complete information, history of tirumala and 12 alwars, detailed story of yamunacharya, tirumala and nathamuni, akkiyalvan in tirumala history, ramamishra and alavamdar in tirumala vaibhavam