Home »Tirumala Vaibhavam Serial » Tirumala vaibhavam Serial- 22
?>

తిరుమల వైభవం సీరియల్ - 22

Tirumala vaibhavam Serial- 22

దేసు వెంకట సుబ్బారావు

 

యమునాచార్యులవారి ఆదేశానుసారం తిరుమల చేరిన తిరుమలనంబి స్వామివారికి నిత్య సేవలు ఎలా చేస్తున్నారోనని పర్యవేక్షించి స్వామి దర్శనం చేసుకోవాలని యమునాచార్యులు తిరుమల వచ్చారు. అక్కడ స్వామివారికి మంగళాశాసనం చేశారు. తర్వాత ఒకనాడు ఉదయాన తిరుమలనంబి స్వామి మంగళ స్నానానికి పాపవినాశనం నుండి నీరు తీసుకురావడానికి వర్షం కారణంగా ఆలస్యమైంది. అది గమనించిన యమునాచార్యులు రంగదాసునిచే నిర్మితమైన బావినుండి తీర్థం (బంగారుబావి) తీసుకువచ్చేలా అనుమతి ఇచ్చాడు. అప్పటినుంచి స్వామివారికి బంగారుబావిలోని జలంతో అభిషేకాది కార్యక్రమాలకు బంగారుబావి జలాన్ని వాడటం ప్రారంబించారు.

 

ఇక్కడ శ్రీరామానుజాచార్యులవారి ఆదేశానుసారం తిరుమల చేరుకున్న అనంతాళ్వారులు శ్రీవారికి పుష్పకైంకర్యం చేయాలని సంకల్పించి ఆలయ సమీపాన ఒక చెరువు తవ్వడానికి సిద్ధమయ్యారు. చాలా ఆసక్తికరంగా సాగే అనంతాళ్వారుల చరిత్ర తెలుసుకుందాం.

 

అనంతాళ్వారులు

అనంతాళ్వారుల పూర్వీకులు కర్ణాటక ప్రాంతంవారు. మైసూరు కావేరీ తీరంలోని శిరుపుత్తూరు వీరి జన్మస్థలం. అనంతాచార్యుల తండ్రి శ్రీకేశవాచార్యులు యజుర్వేద పండితులు. అనంతాచార్యులు క్రీస్తుశకం 1053 విజయనామ సంవత్సరం మాఘమాసం చిత్తా నక్షత్రాన జన్మించారు. చిన్నతనం నుండి నిత్యం భగవంతుని ధ్యాసలోనే ఉండటంవల్ల భగవద్భక్తి మెండుగా ఉండేది. నిత్యం భగవత్సేవలోనే అమితానందం పొందుతూ ఉండటంవల్ల వీరిని ఆనందాళ్వార్లు అని కూడా పిలిచేవారు.

 

ఒకనాడు అనంతాళ్వారులు శ్రీరామానుజాచార్యులవారి పండితగోష్టికి వెళ్ళి వారి బోధనలను వినాలని శ్రీరంగం వెళ్ళాడు. అక్కడ శ్రీరామానుజాచార్యులు సభలోని శిష్యులను ఉద్దేశించి ''శ్రీరంగం భోగమండపం, కంచి త్యాగమండపం, తిరుమల పుష్ప మండపం. కనుక తిరుమల శ్రీవారి సన్నిధిలో పుష్పమండప నిర్మాణం చేసి నిత్య పుష్ప కైంకర్యం చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా'' - అని ప్రశ్నించారు. శిష్యుల గుండెల్లో ఒక్కసారిగా రాయి పడినట్లయింది. ఎందుకంటే వెయ్యేళ్ళనాటి తిరుమల ప్రస్తుత తిరుమల మాదిరిగా కాకుండా జనసంచారం లేని క్రూరమృగాలతో, విపరీతమైన చలి ప్రదేశంగా ఉండేది. దట్టమైన కీకారణ్యంలో నల్లమల అడవులు విస్తరించడం వల్ల నివాసయోగ్యంగా ఉండేది కాదు. అందువల్ల ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి జంకేవారు. కానీ రామానుజాచార్యులు అలా ప్రశ్నించగానే అనంతాచార్యులు లేచి, ఆచార్యులు అనుమతిస్తే తాను శ్రీవారి సేవకు సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ కమలాపతిని దర్శించాలని చాలాకాలంగా కోరిక ఉన్నాడని, అది తమద్వారా తీరుతుందని అనుమతికై ఎదురుచూశాడు. అంతటా రామానుజాచార్యులు దరహాసంతో ''అనంతా! నీర్ అణ్ పిళ్ళై'' అని ప్రశంసించారు. అంటే తమిళంలో ''నీవే మగాడివి'' అని అర్ధం. అప్పటినుండి వీరికి పురుష ఆందాణ్ పిళ్ళై అనే పేరు కూడా స్థిరపడింది.

 

రామానుజాచార్యులవారి ఆదేశానుసారం సతీసమేతంగా అనంతాళ్వారులు తిరుమల చేరుకున్నారు. అక్కడ శ్రీపతి చరణాలను దర్శించి అమితానందం పొందాడు. తర్వాత ఆలయానికి సమీపాన ఒక చెరువు తవ్వి దానిద్వారా ఒక పుష్పవనాన్ని పెంచాలని నిర్ణయించుకుని శ్రీపతిని ప్రార్ధించి తన పని నిరాటంకంగా జరగాలని కోరుకున్నాడు. ప్రయత్నం చేశాడే కానీ ఆ అరణ్యంలో సాయం చేయడానికి ఒక్కరు కూడా లేరు. అలా సహాయం పొందటం కూడా ఆచార్యులవారి భార్య అప్పటికే నిండు గర్భిణి అయినా తాను చేసేది భగవద్కార్యం కనుక మట్టి తట్టను పట్టుకుని భర్తకు సాయానికి వచ్చింది. శ్రీనివాసుని సేవలో తరించాలని ఆ తల్లికి ఎంత ఆరాటం.. అలసటనే మర్చిపోయింది. అనంతాచార్యులు గునపంతో మట్టిని తవ్వుతున్నాడు. ఆమె ఆ మట్టిని అందిస్తే దాన్ని దూరంగా పారబోసి వస్తోంది. వారి ఆనందానికి అవధుల్లేవు. మరి, వారు చేసేది సర్వేశ్వరుని సేవ కదా.

 

వీరి శ్రమను శ్రీనివాసుడు గమనించి జాలి పడ్డాడేమో. లేక పరీక్షించాలనుకున్నాడేమో.. ఒక బాలుని రూపంలో అక్కడికి చేరుకున్నాడు. వీరికి సాయం చేయాలనుకున్నాడు. వెంటనే అనంతుని వద్దకు వెళ్ళి ''అయ్యా! మీరు చాలా పెద్దవారు. ఇది చాలా పెద్ద పని. నేను కూడా సాయం చేస్తాను. కొంత మీకు శ్రమ తగ్గిస్తాను. మీకు తోడు నిండుగర్భిణిని కూడా కష్టపెడుతున్నారే! నన్ను కూడా సాయం చేయనీయండి..'' అని అడిగాడు. అనంతునికి కోపం వచ్చింది. ''ఓయి బాలకా! ఈ పని మేమే చేయాలని నిర్ణయించుకున్నాం. ఎవరి సాయం అక్కర్లేదు. మాకు శ్రమ లేదు, ఏమీ లేదు. నీ సాయం మాకు అక్కర్లేదు. దూరంగా ఫో. లేకపోతే ఈ గునపంతో కొడతాను. మమ్మల్ని ఇబ్బంది పెట్టకు'' అని కసురుకున్నాడు. బాలకుడు నొచ్చుకున్నాడు. ''ఈ పెద్ద మనిషికి కోపం ఎక్కువ. సాయం చేస్తానంటే కసురుకుంటాడే'' - అని అనంతుని భార్య వద్దకు చేరుకున్నాడు. అప్పటికి ఆమె మట్టితట్టలు మోసి అలసటగా కనిపించింది. ''అమ్మా! బాగా అలసిపోయావు. కొంచెం సేదతీరు. ఈలోగా నేను సాయం చేస్తాను. తిరిగి నీవే ఈ పని చేయవచ్చు..'' అని ఆమెను అక్కడి చెట్టువద్ద కూర్చోబెట్టి మట్టితట్టాను పట్టుకుని అనంతాచార్యుల వద్దకు బయల్దేరాడు. ఆచార్యుల భార్య ముద్దుబిడ్డగా పలికే ఆ బాలుని మాటలకు అచేతనయై అలాగేనని ఆ మట్టితట్టను అందించి నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ అక్కడ చెట్టు నీడన సేదతీరింది.

 

అనంతాచార్యులు గోవింద నామస్మరణతో మట్టి తవ్వుతున్నాడు. అదో పారవశ్యం, ఆనందం. అనిర్వచనీయమైన శక్తి. అలసటనే తెలియనీయడంలేదు. తల వంచుకుని మట్టి తవ్వుతున్నాడు. తలవంచుకునే తట్టలో మట్టి పోస్తున్నాడు. బాలకుడు మట్టి తట్టలో మట్టిని దూరంగా పారబోస్తున్నాడు. ఇది గమనించని అనంతుడు యధావిధిగా మట్టి తవ్వుతున్నాడు. బాలకుడు మట్టి దూరంగా పారబోస్తున్నాడు. ఇలా కొంతసేపు జరిగింది. ఇదివరలా నిదానంగా మట్టితట్ట అందించే భార్య వేగంగా అందిస్తోందేమిటి అనే సందేహం కలిగింది. వెంటనే పక్కకు తిరిగి చూశాడు. బాలకుడు చిరునవ్వుతో తట్ట అందుకోబోతున్నాడు. అది గమనించిన అనంతాచార్యులకు పట్టరాని కోపం వచ్చింది. ''నీవెందుకు వచ్చావు? చెప్పాను కదా.. మధ్యలో కలగజేసుకోవద్దని. నీ పని చెప్తానుండు'' అని బాలకుని పట్టుకోబోయాడు. బాలుడు పట్టు తప్పించుకుని పరిగెట్టాడు. అనంతుడు పట్టు తప్పి తుళ్ళిపడ్డాడు. కోపంతో బాలునిపై చేతిలోని గునపం విసిరాడు. అది వేగంగా వెళ్ళి బాలుని గడ్డంపై తగిలింది. గాయంతో బాలుని గడ్డం రక్తసిక్తమైంది. బాలుడు భయంతో పరిగెత్తి ఆలయంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.

 

చేసేదేమీ లేక అనంతాచార్యులు తిరిగి తన పనిలో నిమగ్నమయ్యాడు. సాయంసమయమయింది. స్వామి సాయం సేవకు ఆలయ అర్చకులు ఆలయానికి చేరుకున్నారు. జరిగిన విషయం తెలుసుకుని బాలకుని రప్పించేందుకు తలుపు తీయమని అర్చకులు బ్రతిమాలుకున్నారు. కానీ ఎంతకూ తలుపు తెరవకపోవడంతో బలవంతాన తలుపులు తెరిచారు. కానీ అక్కడ బాలుడు లేదు. బాలుని జాడ కూడా లేదు. కానీ ఆశ్చర్యం నిత్యకల్యాణ చక్రవర్తి, సర్వావయ సౌందర్య మూర్తి తిరుమలరాయని చిబుకం నుండి ధారగా రక్తం కారుతోంది. ఒక్కసారిగా అనంతాచార్యులకు, అక్కడి అర్చకులకు గుండులు అవిసిపోయాయి. ఏమిటీ వింత? తాను బాలుని కొట్టడం ఏమిటి, ఇక్కడ స్వామికి రక్తం చిందడం ఏమిటి? అనంతాచార్యులకు అర్ధమైంది. ఎవరి సేవకైతే తాను శ్రీరంగం నుండి వచ్చాడో, ఎవరి సేవకై తాను నిరంతరం తపిస్తున్నాడో, ఎవరి కరుణాకటాక్షానికై తాను ఎదురుచూస్తున్నాడో, ఆ నందకిశోరుడు, తనను కరుణించడానికి వచ్చిన వానిని నిర్దయగా గాయపరిచాడే.. అయ్యో.. అంటూ గుండెలు అవిసేట్లు విలపించాడు. తను చేసిన పాపపు పనికి నిర్దయగా శిక్షించమని వేడుకున్నాడు.

 

కన్నీళ్ళ పర్యంతం ఏడుస్తూ పసిబిడ్డను ఓదారుస్తున్నట్లు ''అయ్యో నా తండ్రీ! ఎంత పని జరిగింది'' అని పరుగుపరుగున వచ్చి రక్తస్రావాన్ని నిలవరింపచేసేందుకు పచ్చకర్పూరం, చందనం అద్దాడు. రక్తస్రావం ఆగింది. అంతలో అశరీరవాణి ఇలా పలికింది. ''అనంతా! నీ భక్తికి పరవశించాను. నీవల్ల అయిన ఈ గాయం నీ భక్తికి చిహ్నంగా చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. నిత్యం పచ్చకర్పూరం అద్దు. దాన్ని చూసి భక్తజనావళి నిన్ను గుర్తుంచుకుంటారు. అంతేకాకుండా నువ్వు విసిరిన ఈ గునపం మహాద్వారంవద్ద గోడకు వేలాడదీయి. నన్ను చూడటానికి వచ్చే భక్తులు ఈ సంఘటనను గుర్తుచేసుకుంటారు..'' అని సెలవిచ్చాడు. అందుకే స్వామివారి చిబుకానికి నిత్యం పచ్చకర్పూరం అద్ది ఆ సంఘటనను భక్తులందరూ గుర్తుంచుకునేలా చేస్తారు. అలాగే ఆలయ ముఖద్వారంవద్ద అనంతాచార్యులు విసిరినా గునపం కూడా వేలాడదీసి ఉంటుంది.

 

తర్వాత అనంతాచార్యులు రామానుజ వనం పేరుతో ఎంతో అందమైన పుష్పవనాన్ని పెంచసాగాడు. రకరకాల అందమైన పూలతో ఆ వనం ఎంతో మనోజ్ఞంగా ఉండేది. ఆ వనంలోని పూలన్నీ వనమాలికే అంకితం. ఈ అనంతాచార్యులను మరోసారి పరీక్షించాలని అనుకున్నాడు శ్రీహరి.

 

ఒకనాటి రాత్రి పద్మావతీ సమేతుడైన శ్రీనివాసుడు అందమైన ఉద్యానవనంలోని పుష్ప శోభను తిలకించాలని విచ్చేశాడు. అందమైన ఆ పుష్ప శోభకు పులకించిన పద్మావతీ శ్రీనివాసులు పుష్పవనం అంతా విహరించాడు. పద్మావతీ దేవికి ప్రియమైన పుష్పాలన్నీ ఒక్కొక్కటీ తుంచి ఆమె కురులను అలంకరించాలని అనుకున్నాడు శ్రీహరి. కానీ, పద్మావతి శ్రీనివాసునికి అందకుండా, ఆ అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటోంది. ఇలా ఒకరికొకరు అందకుండా పుష్పవనమంతా కలయతిరుగుతున్నారు. ఆ సందడికి అనంతాచార్యులకు మెలకువ వచ్చింది. తన పుష్పవనాన్ని ఎవరో పాడుచేస్తున్నారని భావించి ఆ ఆగంతకులను పట్టుకోవాలని ప్రయత్నించాడు. నవనీతచోరుడు కనుక శ్రీనివాసుడు తప్పించుకున్నాడు. కానీ పాపం ఆబాల పద్మావతి దొరికిపోయింది. తన పుష్పవనాన్ని పాడు చేసినందుకు పద్మావతీ దేవిని పట్టుకుని చెట్టుకు కట్టేశాడు. ఎన్నివిధాల బ్రతిమాలినా విడిచిపెట్టలేదు. కారణం అసలు దొంగను పట్టుకోవాలనేదే. రాత్రంతా ఆమె చుట్టూ కాపలా కాశాడు. కానీ తప్పించుకున్న శ్రీనివాసుడు కనిపించనేలేదు. వనమంతా గాలించాడు. ఎక్కడా దొరకలేదు. ఇక్కడ పద్మావతి చెట్టుకు కట్టివేయబడింది. రాత్రంతా జాగారం.. శ్రీనివాసుని జాడ లేదు. ఈలోగా తూర్పు తెలతెలవారుతోంది. అర్చకులు ''కౌసల్యా సుప్రజారామా..'' అంటూ ఆలయద్వారాలు తెరిచారు. అంతే, ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. స్వామివారి వక్షస్థల లక్ష్మి కనిపించలేదు. అర్చకులు కంగారుపడిపోయారు. ఇంతలో ఒకరిలో భగవంతుడు ఆవహించి పద్మావతి అనంతాచార్యులవారి తోటలో పొగడచెట్టుకు కట్టివేయబడి ఉందని వివరించాడు. తర్వాత అర్చకులు పూతోటకు వెళ్ళి చూడగా అక్కడ పద్మావతి దేవిని కాపలా కాస్తూ అనంతాచార్యులు కనిపించాడు. విషయం వివరించి స్వామివారికి లక్ష్మీవియోగాన్ని కలిగించినందుకు పరిపరివిధాల క్షమించమని ప్రార్ధించి ఆ మహాదేవని పూలబుట్టలో ఉంచి ఆలయం చేరి స్వామివారి సన్నిధికి తీసుకొచ్చాడు. స్వామి మోము వికసించింది. అందరూ చూస్తుండగా అమ్మ స్వామివారి వక్షస్థలం చేరుకుంది.

 

ఈ రసవత్తర ఘట్టాన్ని భక్తులకు తెలియజేయాలనే ఉద్దేశంతో తిరుమలలో ప్రతి సంవత్సరం పూర్వ ఫల్గుణి నక్షత్రం సాయంకాలం శ్రీమలయప్పస్వామివారు ఒక కొయ్య తిరుచ్చిలోనూ, ఉభయదేవేరులు మరొక తిరుచ్చిలోనూ పురిశైవారి తోటలోని మండపానికి వచ్చారు. అక్కడ ఆలయ నివేదనలు జరిగినతర్వాత పొగడచెట్టు (పద్మావతి దేవిని కట్టివేయబడిన చెట్టు) వద్దకు వెంచేపు చేస్తారు. అక్కడ స్వామివారికి హారతి సమర్పించి, శేష హారతిని, పుష్పసరాన్ని, శఠారిని పొగడచెట్టుకు శాయిస్తారు. ఈ విధంగా జరిగే ఉత్సవాన్ని బాగ్ సవారి ఉత్సవం (బాగ్ అంటే తోట) అంటారు. దీన్ని ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం రోజుకు మరునాడు ఈ ఉత్సవాన్ని జరిపిస్తారు. ఈ ఉత్సవంలో స్వామివారు అప్రదక్షిణంగా ఊరేగింపును పూర్తిచేసుకుని ఆలయం ప్రవేశిస్తారు. అందువల్లనే దీన్ని బాగ్ సవారీ అని కూడా పిలుస్తారు.

 

మరల స్వామివారు కర్కాటక మాసం పూర్వ ఫల్గుణి నక్షత్రం తిరువాదిప్పుర రోజున మరోమారు విచ్చేస్తారు. ఈనారి ప్రదక్షిణంగా విచ్చేస్తారు. తోటలో పూజలు అందుకున్న తర్వాత పూలమాలలు, శాఠారితో బృందావనం లోని పొగడచెట్టుకు శాయిస్తారు. ఆరోజే అనంతాచార్యులు పరమపదం చేరుకున్నారట. వారే పొగడచెట్టుగా అవతరించారని పెద్దలు చెప్తారు. తదనంతరం శ్రీవారు ప్రదక్షిణంగా ఊరేగుతూ ఆలయం ప్రవేశించారు.

 

శ్రీవారి ఆలయం మహా ప్రదక్షిణ మార్గంలో సరిగ్గా నైరుతి మూలలో అనంతాళ్వారు ఇల్లు ఉంది. ఆ ఇంటిని ఆనుకుని తోట ఉంది. ఇంటిప్రాకారంమీద, తోటలోని మండపంలో అనంతాళ్వారు, ఆయన భార్య, కుమారుడు, సేవకుల శిల్పాలున్నాయి. ఇంటి వెనుక దిగుడుబావి కూడా ఉంది. అనంతాళ్వారు తోట ఉన్న వీధికి రామానుజన్ తిరువీధి అని పెరున్నట్లు శాసనాల వల్ల తెలుస్తుంది.

 

ఒకసారి భగవద్రామానుజులు తిరుమలకు విచ్చేసి అనంతాళ్వారులు చేస్తున్న పుష్ప కైంకర్యాలున్ని చూసి ముగ్ధులయ్యారు. తన మాట మన్నించి స్వామివారి సేవను అత్యంత వైభవంగా చేస్తున్నందుకు పులకించిపోయాడు. అనంతాచార్యుల కోరిక మేరకు రామానుజులు తన విగ్రహాన్ని తానే బహూకరించాడు. ఆ విగ్రహాన్ని అనంతాళ్వారు (అనంతాచార్యులు) శ్రీవారి ఆలయంలోని హుండీకి ఎదురుగా ప్రతిష్ఠ చేశాడు. వీరే శ్రీవేంకటాచల ఇతిహాసమాల రచించాడు.

 

తర్వాత కొన్నాళ్ళకు శ్రీరామానుజాచార్యులు గురుముఖతః శ్రీమన్నారాయణుని అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశంగా పొందాడు. కానీ దాన్ని ఇతరులకు బోధించినచో నరక ప్రాప్తి పొందుతారని, కనుక ఇతరులకు బోధించవద్దని గురువు ఆదేశించాడు. కానీ భగవంతుని సేవకు, కీర్తనకు, ధ్యానానికి అందరూ అర్హులేలేనని, ఇలా శ్రీమన్నారాయణ మంత్రాన్ని నియంత్రించడం పాపంగా భావించి దీన్ని జనులందరికీ వినిపించి వారందరినీ ధన్యులను చేయాలని, దీనివల్ల తను నరకప్రాప్తి పొందినా సరే, సమస్త ప్రజలు అందరూ వైకుంఠ ప్రాప్తి పొందడానికి కారణమైన శ్రీమన్నారాయణ మంత్రాన్ని ప్రజలందరికీ తెలియచేస్తానని చెప్పి శ్రీరంగంలోని శ్రీరంగనాథుని గోపుర శిఖరం ఎక్కి ప్రజలందరూ వింటుండగా శ్రీమన్నారాయణ మంత్రమైన ''ఓం నమో నారాయణాయ'' అని ముమ్మారు పలికి అక్కడ గుమిగూడిన ప్రజలందరిచేత పలికించి చైతన్యవంతులను చేశాడు. అది తెలిసి గురువు రామానుజులపై ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. కానీ విశ్వసంరక్షకుడైన శ్రీమన్నారాయణ మంత్రం ప్రజలందరిచేత పలికించి లోక కల్యాణానికి, సమస్త జనులకు వైకుంఠ ధాముని స్మరించే మహదవకాశాన్ని అందచేసి ప్రజలందరిచేత కీర్తించబడతాడు.

 

ఇంకా ఉంది...

 

Tirumala vaibhavam Serial-22, tirumala glorious history and ananthacharya, ramanujacharya and srimannarayana, brahmotsavalu dhwajarohana, bagh sawari utsavam and padmavatidevi